జగమెరిగిన జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు. రాజకీయ విశ్లేషకుడు, అనువాదకుడు, బహుగ్రంథ రచయిత. తెలుగునాట పద్మశ్రీ పురస్కారం పొందిన పత్రికారంగ మణిపూస. పార్టీలకతీతంగా 18మంది ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు నెరపిన అనితర సాధ్యుడు. తెలుగు ప్రజల సమస్యలపై క్షుణ్ణమైన అవగాహనతో డెబ్భయ్యేళ్ళుగా కలం ఝుళిపిస్తున్న వింశతి సహస్ర సభాకేసరి  తుర్లపాటి. ఈ ఏడాది జర్నలిస్టు జీవిత సప్తతి మహోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ. 

బెజవాడ పాటిబండవారివీధిలో 1931 ఆగస్టు  10న నేను పుట్టాను. మా నాన్నగారు సుందర రామానుజరావు. స్వగ్రామం పామర్రు. న్యాయవాది. అమ్మ శేషమాంబ. కవయిత్రి, పాటల రచయిత్రి, భక్తురాలు. మేం ముగ్గురు సోదరులం. నేను మధ్యముణ్ణి. నాకు ఒక అక్క, ఒక చెల్లెలు. అమ్మ కనుసన్నల్లో విలువలతో పెరిగాం. ఏదైనా కొనుక్కోవడానికి అణా, కానీ ఇస్తే, దాన్ని పామర్రు లైబ్రరీలో ఇచ్చి భారతం, రామాయణం పుస్తకాలు చదివేవాణ్ణి. విజయవాడ, పామర్రు, గన్నవరంలలో చదివాను. గూడూరు కాలేజీలో చదివానుగానీ, బి.ఏ పూర్తి కాలేదు. 

మళ్ళీ పుట్టాను
అవును, నేను మళ్ళీ పుట్టాను. ఎందుకంటే నా 13–14 ఏళ్ళ వయసులో జ్వరంవచ్చి మూడునెలలు మంచంమీదే ఉన్నాను. ఒకరోజు కిందకు దించేశారు. కానీ కొనప్రాణం ఉందని డాక్టర్‌ గుర్తించారు. తర్వాత క్రమంగా కోలుకున్నాను. ఆ సమయంలో కాలక్షేపంకోసం ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చదవడం ప్రారంభించాను. ఆనాటి ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావుగారు రాసే సంపాదకీయాల పట్ల ఎంతో ఆకర్షితుణ్ణయ్యాను. రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్నాను. పత్రికాభాష, శైలి, వాక్యనిర్మాణ చాతుర్యం ఏకలవ్య శిష్యుడుగా ఆయన దగ్గరే నేర్చుకున్నాను.

తొలి వ్యాసం

‘మాతృభూమి’ పత్రికలో ‘స్వరాజ్యంలో స్వాతంత్ర్యం’ అనే నా తొలివ్యాసం 1947 మార్చి 22న ప్రచురితమైంది. ప్రత్యేకాంధ్ర రాష్ట్రంకోసం అప్పట్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాయడం ప్రారంభించాను. 1951లో ఆచార్య ఎన్‌.జి.రంగా గారి ‘వాహిని’లో సహసంపాదకునిగా, చలసాని రామారాయ్‌గారి ‘ప్రతిభ’ పత్రిక ఎడిటర్‌గా చేశాను. నా రాజకీయ వ్యాసాలే నన్ను టంగుటూరి ప్రకాశంగారి దృష్టిలో పడేట్టు చేశాయి. తెలుగురాష్ట్ర సాధనకోసం ఆయన స్థాపించిన ఉద్యమ పత్రిక ‘ప్రజాపత్రిక’లో పనిచేశాను. ఆయన కార్యదర్శిగా, జర్నలిస్టుగా ద్విపాత్రాభినయం చేశాను. ముఖ్యమంత్రి ప్రకాశంగారి పి.ఏగా ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించాను. జర్నలిస్టుగా మాత్రమే జీవిస్తానని చెప్పడంతో ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తర్వాత ఖాసా సుబ్బారావుగారి తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశాను. 1955లో డాక్టర్‌ టి.వి.ఎస్‌. చలపతిరావుగారి ‘ప్రజాసేవ’ పత్రికలో ఐదేళ్ళు పనిచేశాను. 

‘వార్తల్లోని వ్యక్తి’ శీర్షికకు 58 ఏళ్ళు

ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుగారు నన్ను ఏరికోరి అందులో చేర్చుకున్నారు. 1960 జూలై 1న ఆంధ్రజ్యోతి ప్రారంభమైంది. నేను మే 21న చేరాను. ఆ రోజే నాకు ఆడపిల్ల పుట్టింది. అందుకే మా అమ్మాయికి ప్రేమజ్యోతి అని పేరు పెట్టాను. తొలి ప్రధాని నెహ్రూపై గౌరవంతో నా కుమారుడికి జవహర్‌లాల్‌ నెహ్రూ అని పేరు పెట్టాను. 
ఆంధ్రజ్యోతిలో చీఫ్‌ రిపోర్టర్‌, సండే ఎడిషన్‌ ఇన్‌ఛార్జి, సినిమా ఎడిటర్‌, సంపాదకీయ రచయిత...ఇలా వివిధ హోదాల్లో  32ఏళ్ళు నిరాఘాటంగా పనిచేశాను. నార్లవారు సూచించిన విధంగా ‘వార్తలలోని వ్యక్తి’ శీర్షికలో వారానికో వ్యాసం రాసేవాణ్ణి. ఇదెంతో పాపులర్‌ అయింది. జ్యోతిలోంచి వెళ్ళిపోయాక కూడా ఆ కాలమ్‌ను నేను కొన్నేళ్ళు కొనసాగించాను. తర్వాత కె.రామచంద్రమూర్తిగారి ప్రోత్సాహంతో మరో ప్రముఖ దినపత్రికలో అదే శీర్షికతో 22 ఏళ్ళుగా ఈనాటికీ రాస్తూనే ఉన్నాను. ఒక జర్నలిస్టు 58 ఏళ్ళుగా ఒకే శీర్షికను అవిశ్రాంతంగా నిర్వహించడం నిజంగా గర్వకారణమే. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల నుంచి స్థానిక ప్రముఖుల వరకు వార్తల్లోని వ్యక్తులగురించి ఇందులో రాస్తాను. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులతో సహా దిగ్గజాలైన జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులందరితో రాష్ట్ర ప్రయోజనాలకోసం అనుబంధం కొనసాగిస్తూ, నాటినుంచి నేటివరకు ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నాను. 

అంబేద్కర్‌  ఇంటర్వ్యూ 

1951డిసెంబరులో డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజోలు వెళుతూ గన్నవరంలో దిగినప్పుడు ఆయన్ను ఇంటర్వ్యూ చేశాను. మీరు రచించిన రాజ్యాంగం ప్రకారం జరిగే తొలి ఎన్నికల వరకైనా కేంద్రంలో మంత్రిగా కొనసాగితే బాగుండేదన్నాను. నాకు నచ్చని అంశాలున్న హిందూకోడ్‌ బిల్లుపై నెహ్రూతో విభేదాలవల్లే న్యాయశాఖామంత్రి పదవికి రాజీనామా చేశానని అంబేద్కర్‌ అన్నారు. ఆ ఇంటర్వ్యూను ఆంధ్రపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ‘‘మీరు దళితవాదాన్ని సమర్థిస్తూ ప్రచారం చేస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని నన్ను అభినందించారు. అదేవిధంగా నెహ్రూ, రాజాజీ సహా ఎందరో ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశాను. 

రాష్ట్ర సమస్యలపై  నెహ్రూకు లేఖ

1952లో ప్రధాని నెహ్రూకి తెలుగువారి సమస్యలపై రెండు సుదీర్ఘ లేఖలు రాశాను. అప్పుడు ఆయన వి.వి. గిరిని పిలిచి ఎవరీ తుర్లపాటి? అని అడిగారు. అప్పటినుంచే నాకు నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం. 
‘‘బెజవాడలో నాకు గుండెపోటు వచ్చినప్పుడు తన ప్రాణం కూడా లెక్కచేయకుండా నన్ను కాపాడారు తుర్లపాటి’’ అని మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్‌ నన్ను ప్రశంసించడం మరువలేను.

నోబెల్‌ కమిటీకి లేఖ

మహాత్మాగాంధీకి నోబెల్‌ శాంతి బహుమతి రాకపోవడం అన్యాయం. దీనిపై నోబెల్‌ కమిటీకి లేఖ రాశాను. మరణానంతరం అవార్డు ఇవ్వలేమన్నారు. మరి ఐ.రా.స. ప్రధానకార్యదర్శి డాగ్‌ హేమర్‌షెల్డ్‌ కు ఎలా ఇచ్చారని నిలదీశాను. దీనిపై ఇప్పటివరకు నోబెల్‌ కమిటీ నాకు సమాధానమివ్వలేదు. 
నాటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ గురించి అవాంఛనీయమైన శీర్షికతో అవాస్తవాలు రాసిన ఫ్రాన్స్‌ ‘లెనాన్డ్‌’ పత్రిక యాజమాన్యంతో క్షమాపణలు చెప్పించాను. 18 ఏళ్ళక్రితం స్విట్జర్లాండ్‌ ఆర్థికమంత్రి పాస్కల్‌, చంద్రబాబుపై ప్రయోగించిన అనుచిత పదజాలం తెలుగుజాతికే అవమానకరమైనదిగా భావించాను. ఆయనతో కూడా క్షమాపణలు చెప్పించాను. 

అక్కినేనికి నటసామ్రాట్‌

సినీరంగంతో నాకు బలమైన సంబంధాలున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు 60 చిత్రాలు పూర్తిచేసిన సందర్భంగా 1957 ఆగస్టులో అక్కినేనిని అంబారీపై ఊరేగించి ఆయన సినీజీవిత వజ్రోత్సవ సభ విజయవాడలో ఘనంగా చేశాం. ఆయనకు నటసామ్రాట్‌ బిరుదు ఇచ్చింది నేనే. 

జరల్నిస్టు జీవిత సప్తతి మహోత్సవం 

జర్నలిస్టుగా 30 ఏళ్ళు పూర్తిచేశాక 1977లో పెరల్‌ జూబ్లీ ఉత్సవం, 1997లో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో చంద్రబాబు సమక్షంలో స్వర్ణోత్సవ వేడుక జరిగాయి. 2017మార్చినాటికి 70ఏళ్ళు జర్నలిజం కెరీర్‌ పూర్తిచేయడం అదృష్టంగా భావిస్తాను. ఈ ఏడాది నా స్నేహితులు ‘‘జర్నలిస్టు జీవిత సప్తతి మహోత్సవం’’ చేస్తున్నారు. 
పి.వి. చేతులమీదుగా నేషనల్‌ సిటిజన్స్‌ అవార్డు (1991), ఇంగ్లాండ్‌వారి ఇంటర్నేషనల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు (1997), అమెరికన్‌ బయోగ్రాఫికల్‌ ఇనిస్టిట్యూట్‌, న్యూయార్క్‌వారి లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ (1998) అవార్డు లభించాయి. 2012లో నా ఆత్మకథను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. 2016లో లెజండరీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నా పేరు నమోదైంది. జపాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌వారు నాపై ఒక డాక్యుమెంటరీ తీశారు. ‘గత ఏడాది ఒకేసారి నాపై పలువురు ఏడు పుస్తకాలు ప్రచురించారు. 

వింశతి సహస్ర సభాకేసరి

2002 జనవరి 26న పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. తెలుగునాట ఈ గౌరవం నాకు దక్కడం నా సుక్రుతం.
1947నుంచీ నేటివరకూ డెబ్భైఏళ్ళుగా అనేక సభల్లో ప్రసంగిస్తున్నాను. 
1969లో శాసనమండలి ఛైర్మన్‌ గొట్టిపాటి బ్రహ్మయ్యగారు, ఉపన్యాస కేసరి బిరుదుతో నన్ను సత్కరించడం, పదివేల ఉపన్యాసాలు పూర్తిచేసిన సందర్భంగా 1993లో నా పేరు గిన్నిస్‌బుక్‌లో చేరినప్పుడు మంత్రులు, ఎంపీలు విజయవాడలో దశసహస్ర సభాకేసరి బిరుదుతో సత్కరించడం, 2015లో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌వారు అష్టాదశ సహస్ర సభాకేసరి (18వేల ఉపన్యాసాలు పూర్తి) బిరుదునివ్వడం, నేటికి 20వేల ఉపన్యాసాలు పూర్తిచేసి వింశతి సహస్ర సభాకేసరిగా ఆరోగ్యంగా నేటికీ సభల్లో పాల్గొనడం, తెలుగువాడిగా పుట్టి స్వరాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టుగా సేవ చేయడం తెలుగువారి ఆశీస్సుల ఫలితమే. 
రన్నింగ్‌ చేస్తా
ఇప్పుడు నా వయసు 86 ఏళ్ళు.. తెలుగు అధిక మాసాలు కలిపితే 88 ఏళ్ళు. రోజుకు ఆరేడు గంటలు పుస్తకాలు, పత్రికలు చదువుతాను. సభల్లో ప్రసంగిస్తాను. నా ఆరోగ్యంపట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న నా కోడలు ప్రశంసనీయురాలు. ఆరోగ్యం విషయంలో అక్కినేని నాకు ఆదర్శం. నా పని నేనే చేసుకోవడం, మితాహారం, బాధ కలిగినప్పుడు ఎక్కువ ఆలోచించకపోవడం, ప్రతి ఉదయం రన్నింగ్‌ చేయడం నా అలవాట్లు. 

నైతిక విలువలు తగ్గాయి

యావద్భారత ప్రఖ్యాతి పొందిన జర్నలిస్టులెందరో తెలుగువారే. కోటంరాజు రామారావు, కోటంరాజు పున్నయ్య, సి.వై.చింతామణి, ఎం.చలపతిరావు, ఖాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, జి.వి. కృపానిధి, ఎ.ఎస్‌. రామన్‌ లాంటి గొప్ప పాత్రికేయులెందరో. కరాచీలో ఒక వీధికి కోటంరాజు పున్నయ్యగారి పేరు పెట్టారు. విజయవాడలో మా వీధికి నాపేరు పెట్టారు. ఇది అరుదైన గౌరవం.
పాత్రికేయులలో నైతిక విలువలు, పుస్తక పఠనం తగ్గిపోయాయి. వారు నిస్వార్థంగా ఉండాలి. పుస్తక పఠనం చేసినవారే గొప్ప జర్నలిస్టులుగా రాణిస్తారు. పుస్తక పఠనంవల్లనే నేనింతటివాడినయ్యాను. ప్రతి పాత్రికేయుడూ పుస్తక పఠనం, భాషాపటుత్వం పెంచుకోవాలి. 

కుటుంబం

కూచిపూడి నాట్యకళాకారిణి కృష్ణకుమారి నా జీవితభాగస్వామి. నెహ్రూ, టిటో, నాజర్‌ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన నాట్యరాణి. కోల్‌కతాలో సన్మానం పొందటానికి వెళుతూ మేం రైల్లో కలుసుకున్నాం. మాది ప్రేమ వివాహం. 1959 జూన్‌ 12న మా వివాహం జరిగింది. మా పిల్లలు జీవితంలో స్థిరపడ్డారు. మానసకృష్ణ, సారమతి, కృష్ణకుమార్, కృష్ణ సుప్రియ నా మనవలు. 1979లో కేన్సర్‌వల్ల మరణించిన నా భార్యపేరిట కృష్ణకళాభారతి సంస్థ స్థాపించి ఏటా కళా ప్రముఖులను సత్కరిస్తున్నాం. నాకు సొంత ఇల్లు లేదు. బ్యాంకు బ్యాలెన్సు లేదు. దమ్మిడీ సంపాదన లేదు.