రచయిత, తెలుగుభాషోద్యమ కృషీవలుడు డాక్టర్‌ జి.వి.పూర్ణచంద్‌.. తెలుగుకు ప్రాచీనభాష హోదా తేవడంలో కీలకపాత్ర వహించారు. కొత్త తరానికి తెలుగు రాయడం, చదవడం నేర్పాలనీ, ఇంటింటా మంచి తెలుగుపుస్తకాల గ్రంథాలయం ఆవిష్కృతం కావాలని, మన రాతకోతలన్నీ తెలుగులోనే జరగాలనే లక్ష్యంకోసం పాటుపడుతున్న పూర్ణచంద్‌ ఇంటర్వ్యూ....

విజయవాడ సమీపంలోని కంకిపాడు నా జన్మస్థలం. 1957 ఏప్రిల్‌ 23న జన్మించాను. నా పూర్తిపేరు డాక్టర్‌ గంగరాజు వెంకటపూర్ణచందు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. శ్యామల, శ్రీలక్ష్మి. మా బావలు కణ్ణన్‌, రఘువరప్రసాద్‌.మా నాన్నగారు వెంకట గోపాలకృష్ణచంద్రమౌళీశ్వరరావు. అమ్మ సత్య ప్రసూన. నాన్న మెహర్‌బాబా భక్తులు. బాబాపై 35 పుస్తకాలు రాశారు. వ్యవసాయశాఖ ఉద్యోగి. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (1976–81) లో వైద్యవిద్యనభ్యసించి 1982లో శుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి స్థాపించాను.

సాహిత్యాభిరుచి

మా మాతామహులు దావులూరు వెంకటేశ్వరరావు బాల్యంనుంచీ నన్ను గ్రంథాలయానికి తీసుకెళ్ళి పత్రికలు, పుస్తకాలు చదివిస్తూ నాలో సాహిత్యాభిరుచి పెంచారు. స్కూల్లో ఉండగానే బొమ్మలు, కార్టూన్లు గీసేవాణ్ణి. నా కార్టూన్లు పూర్ణశ్రీ పేరిట పత్రికల్లో వచ్చేవి. నూజివీడులో 8,9,10 తరగతుల్లో ఉండగా మా ఇంటి ఎదురుగా మహాకవి దుర్గానంద్‌ ఉండేవారు. కవిత్వం అంటే ఏమిటో ఆయన దగ్గర తెలుసుకున్నాను. టెన్త్‌ నుంచి వైద్యవిద్య పూర్తయ్యేవరకు స్వీయరచన, సంపాదకత్వంలో ‘మేఘమాల’ లిఖిత మాసపత్రిక నడిపాను.

తొలి రచన

వామపక్ష తాత్త్వికవేత్త ఏటుకూరి బలరామమూర్తిసహా, తుమ్మల వెంకట్రామయ్య, రాఘవాచారి, మైత్రేయ లాంటివారితో కాలేజీస్థాయిలోనే సాన్నిహిత్యం ఏర్పడింది. నా పఠానాసక్తికీ, సాహిత్యరచనా పిపాసకు వారు మెరుగులు దిద్దారు. అలా హేతువాద దృక్పథంతో, సైన్స్‌, చరిత్ర, సాహిత్యం మేళవించి రాసిన ‘ఆత్మలతో మాట్లాడగలమా’ అనే నా తొలి పరిశోధనాత్మక వ్యాసం 1975ఆంధప్రభ వీక్లీలో వచ్చింది.

అరుదైన గ్రంథాల పఠనం

విజయవాడ రామమోహన గ్రంథాలయంలోని అరుదైన గ్రంథాలు చదివేవాణ్ణి. పురాణపండ రంగనాథ్‌ ముందుగా గ్రంథ పరిచయం చేశాక పూర్తిఅవగాహనతో చదివడంవల్ల అరుదైన ఎన్నో గ్రంథాల సారాంశాన్ని జీర్ణించుకోగలిగాను. ఆకాశవాణికేంద్రం యువవాణి విభాగాధిపతి పి.ఆర్‌.రెడ్డి ప్రొత్సహించి నన్నొక రచయితగా, వక్తగా తీర్చిదిద్దారు. ఆనాటి ‘జయశ్రీ’ వార,మాస పత్రికలో కథలకు బొమ్మలు గీస్తూ, కల్చరల్‌ రిపోర్టర్‌గా పనిచేస్తూ రచనావ్యాసంగంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. నాలో పరిశోధనాత్మక దృక్పథం పెరగడానికి వీళ్ళంతా సహకరించారు.

తొలి పరిశోధనాత్మక పుస్తకం

‘సౌజన్య’ పత్రికలో 1978–80లో చారిత్రక పరిశోధనా దృక్పథంలో ‘ప్రేమ–పెళ్ళి–శృంగారం’ అనే ఫీచర్‌ నిర్వహించాను. ఫ్రాయిడ్‌, యూంగ్‌, హేవ్లాక్‌ఎల్లాస్‌, ఎరిక్‌హెచ్‌.ఎరిక్‌సన్‌ల సిద్ధాంతాలను మన సమాజానికి అన్వయిస్తూ, మన ప్రాచీన సాహిత్య అంశాల్ని వాటికిజోడిస్తూ తులనాత్మక పరిశోధనా వ్యాసాలు రాశాను. ‘అమలిన శృంగారం’ పేరిట అలా నా 300 పేజీల తొలి పుస్తకం వెలువడింది. ఫ్రాయిడ్‌ చెప్పిన ఇడ్‌, ఇగో, సూపర్‌ ఇగో...మన సాంఖ్యులు చెప్పిన సత్యరజస్థమో గుణాలకూ మధ్య సారూప్యతను ఈ పుస్తకంలో తొలిసారిగా నిరూపించాను. దీనిపై ఇప్పటివరకు నేనుతప్ప ఎవరూ రాయలేదు.సంపూర్ణ సూర్యగ్రహణం (1980దశకం) సమయంలో జలప్రళయం వస్తుందని ప్రచారం జరిగింది. ఆ భయాలతో చాలామంది ఆస్తుల బదలాయింపులు కూడా చేసుకున్నారు. స్కైల్యాబ్‌పై విపరీతమైన ప్రచారం చేశారు. ఈ భయాలకు మూఢనమ్మకాలు జతకలిసేవి. ఈ అపోహలు తొలగించేందుకు ‘రేపటి సూర్యగ్రహణం–ప్రపంచ భవిత’ అనే పుస్తకంలో వాటిని తర్కబద్ధంగా చర్చించాను.