మలయాళ మాంత్రికుడితో ఒక సంభాషణ

తెలుగు పాఠకులకు అయిదేళ్ళ కిందట పరిచయం అయిన పుస్తకం ‘సూఫీ చెప్పిన కథ’. కెపి రామనున్ని రాసిన ఈ మలయాళ నవలను ఎల్‌ఆర్‌ స్వామి తెలుగు చేశారు. సారంగబుక్స్‌ దీనిని ప్రచురించింది. ఇది ఆయన తొలి నవల. సినిమాగా కూడా రూపొంది ప్రశంసలు అందుకుంది. ‘సూఫీ చెప్పిన కథ’ ఫ్రెంచి, ఇంగ్లీషు సహా అన్ని దక్షిణాది భాషల్లోకీ అనువాదం అయ్యింది. కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు సహా అనేక పురస్కారాలు అందుకుంది. కెపి రామనున్ని నాలుగు నవలలు రాశారు. ఆయన తాజా నవల ‘దైవతిందె పుస్తకం’కి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఆరు కథల పుస్తకాలు అచ్చయ్యాయి. విస్తృతంగా వ్యాసాలు రాస్తుంటారు. సాహిత్య, భాషా ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉంటారు. ఇటీవల ఆయన తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా జరిపిన సంభాషణ....
 
 ‘‘నిజంగానే సూఫీ చెప్పాడా ఆ కత మీకు?’’
చెంపలమీదకి అల్లుకుంటూ పాకిన నల్లని గడ్డం నడుమ పెదాలు విచ్చుకున్నా, అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి నా ప్రశ్నకి.
 
‘‘నిజంగా జరిగిన కథ కాదా అది?’’
రెట్టింపు ప్రశ్నతో నా కళ్ళలోకి కాస్త లోతుగా చూశాడు అతను. అతని చూపు నా చేతిలో ఉన్న చిన్న నోటుపుస్తకం మీదకి మళ్ళింది. నా దగ్గర ఇంకా చాలానే ప్రశ్నలు ఉన్నాయని అర్థమయ్యాక చెప్పడానికి సిద్ధమయ్యాడు.
 
‘‘మేలప్పురంలో జరిగిన ఒక సంఘటన గురించి అంతా చెప్పుకునేవాళ్లు. ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అతనితో వెళ్ళిపోయింది అని. అది నాలో ఉండిపోయింది. నాతోపాటే ఉండిపోయింది. ఇదే సమయంలో హిందూ ముస్లిం అంటూ జరుగుతున్న గొడవలు నన్ను బాగా వేధించేవి. వెంటాడేవి. ఎప్పుడూ ఇలాగే ఉందా అని తరచి చూసుకున్నపుడు, నేను పుట్టిపెరిగినచోటే తడుములాడుకున్నపుడు, ఇలా లేదనే అనిపించేది. దర్గాలు, దేవతలు, పూజలు, ఫకీర్లు, సూఫీలు.. ఎక్కడా ఘర్షణల్లేవు. హిందువులూ, ముస్లింలూ అని విడివిడిగా ఆరాధించలేదు. వలసపాలకుల విభజన రాజకీయాలకు ఈ దేశం అమాయకంగా బలైపోయింది. అదే వారసత్వం ఆ తర్వాత కూడా మన నాయకులు కొనసాగిస్తున్నారు. మతాతీత వాతావరణం ఈ నేల మీద ఉండేదని చెప్పాలనిపించింది. నవలకి సిద్ధమైనపుడు మేలప్పురం కత గుర్తుకొచ్చింది. యథాతథంగా కాదు గానీ ‘సూఫీ చెప్పిన కథ’ని ప్రభావితం చేసిన సంఘటన మాత్రం అదే.’’
 
‘‘కార్తి పాత్రని ఎక్కడి నుంచీ తెచ్చుకున్నారు?’’
‘‘నేను విన్న కథలోంచి, నేను చూడని హిందూ అమ్మాయిని ఊహించుకుని నా అనుభవంలోకి వచ్చిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించాను.’’
 
‘‘తన చేతుల్లో పుట్టి పెరిగిన కార్తిని, పన్నెండు పదమూడేళ్ళ పిల్లని మేనమామ శంకుమీనోన్‌ కామదృష్టితో చూడడం.. కేరళ పాఠకులు ఎలా అర్థం చేసుకున్నారు?’’
‘‘‘సూఫీ చెప్పిన కథ’ కళాకౌముది అనే వారపత్రికలో సీరియల్‌గా అచ్చయింది. వచనం కొత్తగా ఉంది. వస్తువు సున్నితమైనది. ప్రేమ, మోహం, భక్తి మిళితమైన ఆ నవలను కేరళ పాఠకులు విప్పారిన కళ్ళతో చదివారు. ప్రగతిశీల భావాలు బలంగా నాటుకున్న నేల మాది. మెచ్యూర్డ్‌ రీడర్‌షిప్‌. చర్చ జరిగింది కానీ, దాడి లేదు.’’
 
హిందూ పిల్ల కార్తి, ముస్లిం పిలగాడు మమ్ముటితో లేచిపోయింది. ముస్లింగా మారినా అమ్మవారి రాతి విగ్రహాన్ని దాచుకుని పూజించింది. ఆ ప్రియుడు కూడా తనను కోరివచ్చిన ప్రియురాలి కోసం ముస్లింల ఇంట్లో అమ్మవారి గుడి కట్టించి ఇచ్చాడు. ముస్లిం కుర్రకారు దీనిపై రగిలిపోతోంది. గుడి పడగొట్టాల్సిందే అని పట్టుబడుతోంది. ఇంట్లోనూ తెలియని నిశ్శబ్దం నిరసనలా వ్యాపించింది. ఏమిటిదంతా అని మమ్ముటి మథనపడుతున్నాడు. ‘సూఫీ చెప్పిన కథ’ లోని ఒక సందర్భం ఇది. నవలలో ఉన్న ఈ విద్వేషపూరిత వాతావరణం కేరళ పాఠకుల మీద ఎటువంటి ప్రభావం చూపిందో తెలుసుకోవాలనిపించింది. 
 
‘‘మరి సీరియల్‌గా వస్తున్నపుడు హిందువుల నుంచి గానీ, ముస్లింల నుంచి గానీ వ్యతిరేకత రాలేదా?’’
ఈ ప్రశ్నతో అతడు పాతికేళ్ళ వెనక్కి వెళ్ళాడు. సోఫాలో విశ్రాంతిగా కూర్చున్నాడు. అతని తలకి పైన గోడ మీద పద్మావతి, శ్రీనివాసుల పటం వేలాడుతోంది.  ‘‘ఏ మత విశ్వాసాలనూ సూఫీ చెప్పిన కథ వ్యతిరేకించదు. 19వ శతాబ్దపు తొలి రోజుల నాటి సమాజాన్ని నవల ఆవిష్కరిస్తుంది. రెండు మతాల నడుమ సఖ్యతను చూపిస్తుంది. ఆకాంక్షిస్తుంది. అందుకే ఏ వర్గం నుంచీ వ్యతిరేకత ఎదురవలేదు.’’
 
‘‘వామపక్ష ఉద్యమాలతో కలిసి ప్రయాణించే మీరు రచయితగా మత విశ్వాసాల పట్ల సానుకూలంగా ఉన్నట్టుగా సూఫీ చెప్పిన కథలో అనిపిస్తుంది. మరి వామపక్ష వర్గాల నుంచి నిరసన ఎదురవలేదా?’’
‘‘నిజానికి ఆ నవల వచ్చిన కాలంలో కమ్యూనల్‌ రీడింగ్‌ లేదు. చాలా ఇష్టంగా చదివారు కూడా. మలయాళంలోనే 20ముద్రణలు పూర్తయ్యాయి. 40వేలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి.’’ 
 
‘‘మరి చంపుతామనే బెదిరింపులు ఎప్పుడు మొదలయ్యాయి?’’
‘‘నా తాజా నవల ‘దైవతిందె పుస్తకం’ వెలువడినపుడు కూడా ఏ బెదిరింపులూ లేవు. అదొక సైన్స్‌ ఫిక్షన్‌. మహమ్మద్‌, జీసస్‌, కృష్ణుడు.. ఈ ముగ్గురూ పాత్రలుగా ఉంటారు. ఇది కూడా మతసామరస్యాన్ని ఆకాంక్షించేదే. నా సమస్త రచనలకూ మూల వస్తువు ఇదే. కథలోనో, నవలలోనో చెప్పినప్పుడు రాని వ్యతిరేకత వ్యాసాలు రాసేప్పటికి మొదలైంది. మద్యమామ్‌ దినపత్రికలో మత వైషమ్యాల మీద ఒక పెద్ద వ్యాసం రాశాను. ఇక అప్పుడు మొదలైంది. ‘హిందువులూ, ముస్లింలూ అంతా ఒక్కటే అంటావా.. ముస్లింలను కరప్ట్‌ చేస్తున్నావు’ అంటూ దాడికి దిగారు. ఇస్లాం మతంలోకి మారకపోతే కుడి చెయ్యీ, ఎడమ కాలూ నరికేస్తామని బెదిరించారు. చంపేస్తామంటూ లేఖ రాశారు. వెంటాడారు. భయపెట్టారు. రచ్చ రచ్చ అయిపోయింది. కేరళలోని ప్రగతిశీల శక్తులన్నీ నాకు అండగా నిలబడ్డాయి. సీపీఐ, సీపీఎం, కొన్ని ముస్లిం గ్రూపులూ నాకు ధైర్యం చెప్పాయి. ఇక అప్పుడు ఒక్క వ్యాసానికే నేను పరిమితం కాలేదు. వరుస వ్యాసాలను మద్యమామ్‌ ప్రచురించింది. రాసే కొద్దీ దాడులు పెరిగాయి.’’
 
‘‘ఎందుకిదంతా రాయకపోతే ఏమైంది.. అనిపించలేదా? తమిళనాడులో పెరుమాళ్‌ లాగా సారీ చెప్పి తప్పుకుంటే పోతుంది కదా అని ఎప్పుడూ అనిపించలేదా?’’
‘‘అట్లా అనిపించకుండా అందరూ నా వెంట నిలబడ్డారు. నేను ఏ మతాన్ని గానీ, వాళ్ళ నమ్మకాలని గానీ తప్పు బట్టలేదు. వ్యతిరేకించలేదు. పరస్పరం గౌరవించికునే, ఆమోదనీయ సంస్కృతే మనది అని చెప్పడమే నా ఉద్దేశ్యం.’’
 
‘‘ముస్లిం గ్రూపుల నుంచే ఎందుకు మీకు హెచ్చరికలు వచ్చాయి? హిందు విశ్వాసాల పట్ల మీరు అనుకూలంగా ఉన్నట్టు అనిపించడమే కారణమా?’’
‘‘కానే కాదు, హిందుత్వ శక్తులకీ నేను నచ్చలేదు. నేను ముస్లింవాదినంటూ నా తల మీద ముస్లిం టోపీ పెట్టిన ఫోటోలతో కుంజన్‌ మెమోరియల్‌లో ఫ్లెక్సీలు కట్టి గొడవ చేశారు. నేను వారికి సమాధానం చెప్పాను. ఒక ముస్లిం ఇంట్లో అయ్యప్ప పడి కట్టుకుని దీక్ష తీసుకుని ఒక ముస్లిం స్నేహితుడిని వెంటబెట్టుకుని శబరిమలకి వెళ్ళాను. ఇదంతా వాళ్ళకి కోపం తెప్పించింది.’’
 
‘‘రచయితగా మొదలైన మీ ప్రయాణం ఉద్యమకార్యకర్తగా కొనసాగుతున్నట్లుంది.’’
‘‘అవును వర్తమాన సమాజంతో జరిపే సంభాషణే రచన. ఒక్కోసారి పుస్తకాన్ని దాటి ప్రయాణించాల్సి వస్తుంది. అసహనం పెచ్చుమీరిన కాలంలో ఇదొక అవసరం. ‘ఐక్య మలయాళ ప్రస్థానం’ అనే ఉద్యమ సంస్థలో నేను క్రియాశీలంగా ఉన్నాను. ప్రస్తుతం మాతృభాషా ఉద్యమాల్లో పాల్గొంటున్నాను. మాతృభాష అమలుపై కేరళ ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ ఆమరణ దీక్ష కూడా చేశాను. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను.’’
 
‘‘దేశంలో అసహన వాతావరణం పెచ్చు మీరిపోతోందంటూ నిరసన తెలుపుతూ సాహిత్యకారులూ, కళాకారులూ చాలా మంది రెండేళ్ళ కిందట తమ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. మీరు మాత్రం 2017లో ‘దైవతిందె పుస్తకం’ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నారు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?’’
‘‘నిరసన రూపాలు అనేకం ఉంటాయి. అవార్డులు వెనక్కి ఇవ్వడం ఒక బలమైన నిరసన. నేను అవార్డు తీసుకోవడం ద్వారా నా నిరసన ప్రకటించాను. వేదికమీద కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకుని కిందికి వచ్చిన వెంటనే, అవార్డు కింద ఇచ్చిన లక్ష రూపాయలను అంతకు కొద్ది రోజుల ముందే హర్యానా రైల్లో హిందుత్వ మూకల దాడికి బలైన 17 ఏళ్ళ బాలుడి తల్లి చేతికి అందించాను. అదీ రహస్యంగా కాదు. జాతీయ మీడియా సమక్షంలో చెక్కు ఆమె చేతిలో పెట్టి నా నిరసన తెలియజేశాను.’’

ఎందుకో హఠాత్తుగా నేను మాట్లాడుతున్నది ఒక సాహిత్యకారుడితోనా, ఒక ఉద్యమకారుడితోనా అనే సందేహం కలిగింది. చిక్కగా చీకటి కమ్ముకున్న ఆ చలిరాత్రి తిరుపతి పళనీ టాకీస్‌ సమీపంలోని ఎస్‌బీఐ హాలిడేహోం వెయిటింగ్‌ హాల్‌లో అప్పటికే గంటన్నరకు పైగా సీరియస్‌గా సాగుతున్న సంభాషణ.. మాటల దారి మళ్ళించాలనిపించింది. మతం, సమాజం, దేశం, ద్వేషం.. ఎన్ని మాట్లాడుతున్నా కార్తి బాగా గుర్తుకొస్తూనే ఉంది. మాతృస్వామిక వ్యవస్థ అమలులో ఉన్న సంపన్న నాయర్‌ కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల. మేనమామ శంకుమీనోన్‌ కళ్ళలో తనపై మెదిలిన కాంక్షను గుర్తించి, దయతో భక్తుడిని కరుణించే అమ్మవారిలా అతడికి తన వసంతం ఇవ్వాలనుకున్న ప్రేమమయి. పోక, కొబ్బరి కొనడానికి వచ్చిన ఒకటిన్నర మనిషంత పొడవుండే ముస్లిం పిలగాడు మమ్ముటి చూపులతో తన అస్తిత్వాన్నీ, శరీరాన్నీ తొలిసారిగా ప్రత్యేకంగా గ్రహించి, ‘వస్తావా’ అనగానే, ‘వస్తాను’ అని తడుముకోకుండా అని, అతడితో నది దాటేసిన పిల్ల. ముస్లింగా మారినా అమ్మవారిని ఆరాధిస్తూ ఆ ముస్లిం వాడలో ఎవరికి ఏ జబ్బు చేసినా క్షణాల్లో నయం చేసే దేవతగా మారిన హిందువుల పిల్ల కార్త్తి. తన పట్ల దేహమోహకాంక్షా విరక్తుడై ముడుచుకుపోతున్న పెనిమిటిని వాత్సల్యంతో లాలించిన అమ్మ. దారి మళ్ళిన ప్రేమోహాన్ని క్షణాల్లో గ్రహించిన జ్ఞాని. మరి ఎందుకలా ప్రవర్తించింది?
 
‘‘కార్తి అమీర్‌ని ఎందుకు చంపేసింది?’’
అతనా ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు. నా చేతిలో తెరిచి పట్టుకున్న చిన్న పుస్తకం వైపు నిశ్చలంగా చూశాడు కాసేపు, ఆ ప్రశ్న ఆ పుస్తకంలోంచి వచ్చిందా లేక నా లోపలి నుంచి వచ్చిందా అన్నట్టుగా.
‘‘కార్తి దేవత. శక్తి. అంటే ఫెమినిటీ. హోమోసెక్సువాలిటీని ఫెమినిటీ సహించదు. అమీర్‌ అపవిత్రుడయ్యాడని భావించింది. గంగతో అతడిని పరిశుద్ధం చేస్తున్నా అనుకుంది.’’
 
 ‘‘అంతేనా.. తనతో పెనవేసుకుపోయిన ప్రేమబంధం తెగిపోయి అమీర్‌ వైపు మళ్ళిపోయిన ద్వేషమా?’’
‘‘అవును కార్తి మనిషి కూడా’’
ఏమిటీ గడ్డపు మనిషి అనిపించింది ఆ జవాబుతో. విశ్వాసాలు మాత్రమే వేరు గానీ, హిందూ ముస్లిం సమాజాలు వేరు వేరు కాదు ఈ దేశంలో అనే వాస్తవాన్ని నిరూపించడానికే ‘సూఫీ చెప్పిన కథ’ నవల రాశానని చెబుతున్న ఇతడు, మానవ స్వభావపు లోతుపాతుల్లోకి జొరబడిపోయి ఆర్ధ్రతను, ప్రేమను, ద్వేషాన్ని, హింసా ప్రవృత్తినీ పాతాళగొలుసుతో దేవులాడి, పైకి లాక్కొచ్చిన మాంత్రికుడిలా అనిపించాడు నాకు. అబ్బే.. కథ, పాత్రలు కల్పనే ఎక్కువ అని పెదాలు చెబుతున్నా, అతని కళ్ళు మాత్రం ఇంకేదో నిజం చెబుతున్నాయనిపించింది. కథకులు మాయగాళ్లు. ఏ రహస్యపు తావుల్లోనో దాచి, టోపీలోంచో, ఖాళీపెట్టెలోంచో తీసినట్టుగా ఒక అద్భుతాన్ని పాఠకుల ముందుంచుతారు. ఈ మలయాళ మాంత్రికుడు కూడా ఒక మాయలాంతరు పట్టుకుని తిరుగుతున్నాడు. ఎక్కడైనా తారసపడితే మాత్రం వదలకండి. వెతికి చదవండి. 
 
రచయిత ఎలా అయ్యానంటే..
‘‘అటేడు తరాలూ, ఇటేడు తరాలూ వెతికినా మా ఇంట్లో రచయితలు కనిపించరు. రచయితగా నా పుట్టుక చిత్రంగానే జరిగింది. హైస్కూల్లో ఉండగా సైంటిస్ట్‌ కావాలనుకున్నా. కాలేజీ మెట్లెక్కేసరికి డాక్టర్‌ కావాలనిపించింది. అప్పుడు కాలికట్‌లో మా సమీప బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్నా. వాళ్ల ఇంటి నిండా అన్నీ ఆధ్యాత్మిక పుస్తకాలు. వివేకానంద, రామకృష్ణ పరమహంస.. ఇలా తెగ చదివేశా. అదే సమయంలో కేరళలో వామపక్ష భావజాల సాహిత్యం కూడా విస్తృతంగా ఉండేది. దొరికినవి దొరికినట్టు అవీ చదవడం మొదలు పెట్టా. దీంతో గందరగోళంలో పడిపోయా. ఏది కరెక్టో అర్థం కాలేదు. ఇంతకీ దేవుడు ఉన్నాడా, లేడా? ఈ ప్రశ్న ఒక్కటే నన్ను వేధించడం మొదలు పెట్టింది. నీళ్లు లేదు, తిండి లేదు, నిద్ర రాదు. నా పరిస్థితిచూసి మా వాళ్ళంతా ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే నేను క్లాస్‌ టాపర్‌ని. జీవితం అంటే ఏమిటి? పుట్టుకకి ముందూ తర్వాతా కూడా ఏమైనా ఉంటుందా? ఎవరు పలకరించినా ఇవే ప్రశ్నలు. ఆ ఏడాది పరీక్షలు కూడా రాయలేదు. నాకేదో అయిందని అంతా అనుకున్నారు. సైకియాట్రిస్టు దగ్గరకి తీసుకువెళ్ళారు. ఆయనని కూడా అదే అడిగాను, ‘దేవుడు ఉన్నాడా, లేడా?’ అని. సమాధానం అయితే చెప్పలేదుకానీ, ఆయన మందులు రాసి ఇచ్చాడు. అవి వేసుకుంటే ఒకటే నిద్ర. ఇలా కాదనిపించింది. డాక్టర్‌ కోవూరు శిష్యుడు బిఎం మాథ్యూ అనే ఆయనని వెళ్లి కలిశాను. నా ప్రశ్నలు విని ఆయన మందులు రాయలేదు. కొన్ని పుస్తకాల పేర్లు రాసిచ్చి చదవమన్నాడు. మలయాళంలో ఉన్న మంచి సాహిత్య పుస్తకాలు అవి. చదవడం మొదలు పెట్టా. నా మనో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నాన్న బ్యాంకు ఉద్యోగి. ఆయన హఠాత్తుగా చనిపోవడంతో, డిగ్రీ చేయకముందే ఆయన ఉద్యోగం నాకు వచ్చింది. బ్యాంకులో చేరాక చదవడం పెరిగింది. రాయాలనే కోరిక కలిగింది. తొలికథ మాతృభూమిలో అచ్చయింది. 1989లో ‘సూఫీ పరంజ కత’ నవల రాశాను. రెండో నవల కూడా బ్యాంకులో పనిచేస్తుండగానే రాశాను. కథలు చాలా రాశాను. అయితే ఉద్యోగం నా రచనా వ్యాసంగానికి ఇబ్బంది అనిపించింది. మానేశాను.’’
 
ఆర్‌ ఎం ఉమామహేశ్వరరావు