పల్లెటూరునే ఆత్మగా చేసుకున్న కవి దర్భశయనం శ్రీనివాసాచార్య.సరళతతో కూడిన గాఢత ఆయన కవిత్వ మార్గం.రైతు బాగుకోసమే ఆయన తపన. నాలుగున్నర దశాబ్దాల్లో ఆయన కవిత్వంలో ఎక్కువ రాసింది రైతుకోసమే. ఆయనకిద్దరు పిల్లలు. ‘కవిత్వం నా మూడో సంతానం’ అని చాటిచెప్పే శ్రీనివాసాచార్య ప్రతిచోటా కవిత్వంతోనే సహవాసం చేస్తూ, మనసావాచాకర్మణా దానికే అంకితమయ్యారు.

‘‘సాహిత్యం పల్లెటూళ్ళకు విస్తరించాలి, కవిసమ్మేళనాలు గ్రామాల్లో జరగాలి, కవిత్వం గ్రామీణులతో మమేకమైనప్పుడే మనబోటి దేశంలో సాహిత్యానికి పరిపూర్ణత’’ అన్నది ఆయన నిశ్చితాభ్రిపాయం. ఈ సమాజంలో, ‘కవిది తండ్రిపాత్ర’ అంటున్న సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, వ్యాస రచయిత, సంపాదకుడు , ఉపన్యాసకుడు శ్రీనివాసాచార్య అంతరంగం ఆయన మాటల్లోనే.....

వరంగల్‌ జిల్లా చిన్న కొర్పోలు మా గ్రామం. నాన్న రంగాచార్య. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులు. అమ్మ అలివేలుమంగతాయారు. నాకు ఇద్దరు అక్కలు, చెల్లెలు, తమ్ముడు.ఎనిమిదో తరగతిలో మా తెలుగు మాస్టారు తేలు లక్ష్మీనారాయణ స్ఫూర్తితో 1974లో మొట్టమొదటి కవిత రాశాను. ఆయన నా గురించి అన్ని క్లాసుల్లోనూ చెబుతూ నాకు స్ఫూర్తినిచ్చేవారు. మా బావగారు ఇచ్చిన ‘అమృతం కురిసిన రాత్రి’ నే చదివిన తొలి కవితా సంపుటి. అప్పుడే కవిత్వం నాకు ఒక అద్భుతంగా తోచింది. ఆకర్షణీయంగా మారింది.తర్వాత దాశరథి ‘అగ్నిధార’ శ్రీశ్రీ మహాప్రస్తానం’ చదివాను. కవిత్వంలో ఉండేది మనుషుల బాధలే అని తెలిశాక రైతు జీవితాన్నే కవిత్వంగా రాసేవాణ్ణి. పలు పోటీలప్పుడు, ‘జనధర్మ’ పత్రికలో నా తొలి కవిత (1978) వెలువడినప్పుడూ,నాకు ఊళ్ళోనూ, కాలేజీలోనూ కవిగా గుర్తింపు వచ్చింది.

నర్సంపేటలో ఇంటర్మీడియట్‌ చదువుతూ, ‘మిత్రమండలి’ కవితా సమావేశాల్లో పాల్గొనేవాణ్ణి.హైదరాబాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ, వ్యవసాయ ఆర్థికశాస్త్రంలో పీజీ చేశాను. మనుషులతో కలిసిపోయే నా తత్వంవల్ల,విదేశీ విద్యార్థుల సాహచర్యంలోనూ భిన్న సంస్కృతులను తెలుసుకున్నాను. ‘మనం మంచివాళ్ళుగా ఉంటే చాలదు, మంచి ప్రపంచం కూడా కావాలి’ అనే సారాంశం గ్రహించాను. అవన్నీ నా కవిత్వానికీ, నాకో జీవిత దృక్పథానికీ దోహదపడ్డాయి.1984లో ఆంధ్రాబ్యాంక్‌లో చేరాను. ప్రస్తుతం హైదరాబాద్‌ (ఫైన్సాన్సియల్ డిస్ర్టిక్ట్‌)లోని ఆంధ్రాబ్యాంక్‌ ఎంప్లాయీస్‌ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. నాకు ఇష్టమైన సాహిత్యానికి న్యాయం చేయడం కోసం పదోన్నతులు వదులుకుని, 13 సంవత్సరాలుగా చాలా ఆనందంగా సాహిత్యసేవ చేస్తున్నాను.

తొమ్మిది కవితా సంపుటాలు

‘జీవన వీచిక’ (1987) నా తొలి కవితా సంపుటి. సంజీవదేవ్‌ ఆవిష్కరించారు. దీనికే మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు తొలి సాహిత్య పురస్కారం లభించింది. రెండో కవితా సంపుటి ‘ప్రవాహం’ (1992) సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ‘ముఖాముఖం’ (1995) కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు. ‘వేళ్ళు మాట్లాడే వేళ’ (1999) శివారెడ్డి ఆవిష్కరించారు. ‘ఆట’ దీర్ఘకవిత (2001), ‘నాగటిచాళ్ళు’ (2005), ‘నేలగంధం’ (2009), ‘పొలం గొంతుక’ (2013), ‘పత్రహరితం’ కవితా సంపుటి 2016లో వెలువడింది. ఇప్పటివరకు 400 పైగా కవితలు రాశాను.

అందులో ఎక్కువ రాసింది రైతుల గురించే. నా నలభైఏళ్ళ వయసులో ఆధునిక జీవితాన్ని నేనెలా చూస్తున్నానో, 24ఖండికలుగా ‘ఆట’ దీర్ఘకవితలో వ్యాఖ్యానించాను. బాల్యం నుంచి వృద్ధాప్యం–మరణం వరకు జీవితదశలిందులో ఉంటాయి. విమర్శ పుస్తకం ‘ఇష్టవాక్యం’, ‘సెంట్స్‌ ఆఫ్‌ ద సాయిల్‌’ (మట్టి పరిమళం) పేరిట ఇంగ్లీషులో నేను రాసిన కవిత్వం పుస్తకాలుగా వచ్చాయి.