బారెడు పొద్దెక్కినా... హైదరాబాద్‌లో చలి తగ్గలేదు... ట్రాఫిక్కూ తగ్గలేదు. ట్రాఫిక్‌ సముద్రానికి ఆవల...అరటి చెట్లు... మామిడి చెట్లు... రకరకాల తీగలు అల్లుకున్న ఇంట్లోకి కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్య శోధనపై కృషి చేస్తున్న ఈ నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు  ప్రపంచ తెలుగు మహాసభల గురించి, తనపై ప్రభావం చూపిన సాహిత్యం, నాన్న, అన్నయ్యల సాంగత్యం గురించి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

-డాక్టర్‌ రెంటాల జయదేవ

 
కవిత... మీ పేరే ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. ఆ పేరు ఎవరు పెట్టారు?

(నవ్వేస్తూ...) నాన్నే (కె.సి.ఆర్‌)! ఆయనే ఇష్టపడి మరీ నాకీ పేరు పెట్టారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నాన్న అప్పట్లో మంచి కవితలు చాలా రాసేవారు. మా అన్నయ్య (కె.టి.ఆర్‌) శ్రవణా నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి, అన్నయ్యకు తారకరామారావు అని మా తాతగారు (కె.సి.ఆర్‌. తండ్రి రాఘవరావు) పేరు పెట్టారు. కానీ, నేను పుట్టినప్పుడు పిల్లకు నేనే పేరు పెడతా అని నాన్న కవిత అని నామకరణం చేశారు.

నాన్న గారి కవితలు మీకు గుర్తేనా?
నాన్న చాలా సున్నితమైన భావోద్వేగాలున్న మనిషి. ఆయన ప్రేమయినా, కోపమైనా, పట్టుదలయినా తీవ్రంగా ఉంటుంది. విద్యార్థి దశ నుంచి ఆయన అలా స్పందించినప్పుడల్లా కవితలు రాసుకున్నారు. ఆయన చేతి రాత చాలా గుండ్రంగా, బాగుండేది. ఆయన రాసుకున్న మినీ కవితలు, సేకరించి రాసి పెట్టుకున్న పద్యాలు, సామెతలు... ఇవన్నీ ఓ పుస్తకంలో ఉండేవి. మా నాన్నకు కూడా తెలియదు... అది ఇప్పటికీ నా దగ్గరగా భద్రంగా ఉంది. అవన్నీ పుస్తక రూపంలోకి తేవాలి.
 
నాన్న దగ్గర పెద్ద లైబ్రరీ ఉందంటారు. ఆయన ఏవేం చదివేవారు?
1978 ముందు విద్యార్థి దశలో ఆయన చాలా సాహిత్యం చదివారట. యువజన కాంగ్రెస్‌లోకీ, తరువాత రాజకీయాల్లోకీ, అటుపైన తెలంగాణ ఉద్యమంలోకీ వచ్చాక సాహిత్యం చదవడానికి ఆయనకు టైమ్‌ దొరకకుండా పోయిందనిపిస్తుంది. నాకు ఊహ తెలిసిన 1983, 84 ప్రాంతంలో నాన్న తెలుగు, హిందీ, ఇంగ్లీషు పుస్తకాలన్నీ చదివేవారు. టాల్‌స్టాయ్‌ రాసిన పే..ద్ద నవల వార్‌ అండ్‌ పీస్‌ (యుద్ధం...శాంతి) రెండు మూడుసార్లు పైగానే చదవడం నాకు గుర్తు. హిందీ నవలలు బాగా చదివేవారు. ఉద్యమంలోకి వచ్చాక రకరకాల నివేదికలు వగైరా చదవడం పెరిగింది కానీ, లేదంటే రోజూ ఆయన మంచం పక్కనే ఏదో ఒక పుస్తకం ఉండాల్సిందే.
 
మీపై ఆ పుస్తకాల ప్రభావం ఏంటి?

మేము బషీర్‌బాగ్‌ ఎమ్మెల్యే క్వార్టర్సులో ఉన్నప్పటి నుంచి ఎర్రమంజిల్‌ క్వార్టర్సు, మంత్రి అయ్యాక మెట్టుగూడ క్వార్టర్సు, ఆ తరువాత బంజారా హిల్స్‌ ఇల్లు.. ఇలా అన్నిచోట్లకూ సాహిత్యం పుస్తకాలు మాతో పాటు భద్రంగా రావాల్సిందే. బడిలో చదువుకొనే పిల్లలమైనా అన్నయ్య, నేను ఏ పుస్తకమైనా తీసుకొని చదివే స్వేచ్ఛ, సావకాశం మాకుండేవి. మార్కుల గురించి ఒత్తిడి లాంటివేమీ ఉండేవి కావు.

తెలుగు భాష, సాహిత్యం మీద మీకు ఆసక్తి ఎలా వచ్చింది?
పసివాడిగా ఉన్నప్పుడు అన్నయ్య కె.టి.ఆర్‌.తో అప్పుడప్పుడైనా నాన్న ఆడేవారట కానీ, నేను పుట్టేసరికే నాన్న యూత్‌ కాంగ్రెస్‌, రాజకీయాలతో బిజీ. నాన్న వాళ్ళ ఊరు... సిద్దిపేట దగ్గర చింతమడక గ్రామం. ఇప్పటిలా ఎవరి ఫోన్‌లో వాళ్ళు తలదూర్చే రోజులు కావవి! అప్పట్లో ఊళ్ళో వాతావరణమే వేరు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ పద్యాలు నోటి రావాల్సిందే. మా తాత గారు కాంట్రాక్టర్‌. ఆయనకు ఇంటికి ఉర్దూ పేపర్‌ వచ్చేది.
 

కూర్చొని, రాసుకోవడానికి ఇంట్లో ‘కలమ్‌ దాన్‌’ (రాతబల్ల) ప్రత్యేకంగా ఉండేది. పొలాలు, సేద్యంతో ఆయన టిపికల్‌ రైతులా బతికేవారు. ఆయన ఎప్పుడూ ఏదో చదువుతూ ఉండేవారు. మాకు మా తాత గారే మంచి పద్యాలు, శ్లోకాలు, శతకాలు చెప్పేవారు, నేర్పించేవారు. అన్నయ్య చాలా పద్యాలు అప్పజెప్పేవాడు. ఇప్పటికీ నాన్నకూ, వాడికీ చాలా పద్యాలు నోటికే వచ్చు. మా అన్నయ్య వంకాయ తిననంటే, అది ‘కూరల్లో రాజు’ లాంటిదంటూ ...‘లంకాపతి వంటి రాజు, సీత వంటి సాధ్వీమణి, వంకాయ వంటి కూరయు లేవు...’ అంటూ తాత పద్యం చెప్పడం నాకు గుర్తే. అలాగే, మా చెడ్డ కలలు వస్తున్నాయంటే, ...‘రామస్కందం హనూమన్తం వైనతేయం వృకోదరం..’ అంటూ నేర్పిన శ్లోకమూ గుర్తే.

మరి నాన్న గారు మీకు భాష గురించి ఏం నేర్పారు?

అన్నయ్య ఎప్పుడూ హాస్టల్‌లో ఉండి, చదువుకొనేవాడు. నేను మాత్రం ఇంట్లోనే! నాన్న షటిల్‌ బ్యాడ్మింటన్‌ బాగా ఆడేవాళ్ళు. ఎప్పుడూ సరదాగా ఉండే నాన్న నేను కొంచెం పెద్దయ్యాక తనతో షటిల్‌ కోర్టుకు తీసుకెళ్ళేవారు. ఆ టైమ్‌లో నాకు అన్నీ చెబుతుండేవారు. ఆయన ఎప్పుడూ ఎవరినీ చెయ్యెత్తి కొట్టగా నేను చూడలేదు. ‘జంతువులకు లేనిదీ, మనకు ఉన్నదీ మాట. మాట మనిషికున్న వరం. దాన్ని సక్రమంగా వాడుకోవాలి. అదే ఆయుధం కూడా! కాబట్టి, మాట జారకూడదు’ అని ఎప్పుడూ చెప్పేవారు. ఏ భాష అయినా అవతలివాళ్ళకు స్పష్టంగా మాటలతో కమ్యూనికేట్‌ చెయ్యలేకపోతున్నా మంటే అది మన ఫెయిల్యూరే అన్నది తెలియకుండానే మాకు నూరిపోశారు. అందుకే, నాకూ, అన్నయ్యకూ భాష మీద ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మేము ఏదైనా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా, కమ్యూనికేట్‌ చేస్తున్నా అది ఆ ప్రభావమే. ఘంటసాల పాటలు, పాత హిందీ పాటలు, జగ్జీత్‌ సింగ్‌, గులామ్‌ అలీ గజల్స్‌ నాన్న బాగా వినేవారు. కారులో మేమంతా ప్రయాణిస్తున్నప్పుడు పాత హిందీ పాటలు పెట్టి, వినిపించి, అర్థాలు కూడా చెప్పేవారు.

ఇంతకీ, తెలుగులో మీకు ఎలాంటి మార్కులొచ్చేవి?
ఇవాళ 99 మార్కులొస్తున్న ర్యాంకర్ల రోజులతో పోలిస్తే, నేను 85 మార్కుల దాకా వచ్చే యావరేజ్‌ స్టూడెంట్‌ని (నవ్వులు...). ఇ మెయిల్స్‌ లేని ఆ రోజుల్లో ఏడెనిమిది తరగతులకు వచ్చేసరికే క్లాస్‌మేట్లం, మిత్రులం ఒకరికొకరం లెటర్లు రాసుకొనేవాళ్ళం. అయితే, ఏనాడూ ఆ లెటర్లు ఏమిటని కానీ, వాటిని తెరిచి చూడడం, అనుమానించడం లాంటివేవీ మా ఇంట్లో ఉండేవి కావు. అంత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, రెస్పెక్ట్‌, ఇండివిడ్యువాలిటీ మా అమ్మానాన్నలిచ్చారు. పంజరంలో చిలకల్లా పెంచకుండా, స్కూలు పుస్తకాలే కాకుండా అన్నీ చదవనిచ్చారు. మా అన్నాచెల్లెళ్ళం ఎప్పుడూ కొట్టుకొనేవాళ్ళం కాదు. ఎంతసేపటికీ బుద్ధిగా ఉండేవాళ్ళం. ఇవాళ్టి వాళ్ళతో చెప్పాలంటే బాగా బోరింగ్‌ అన్న మాట (నవ్వులు...).