రంగస్థలం నుంచే సినీ ప్రస్థానం..

ఆచంద్ర తారార్కం నిలిచిపోయే చిత్రం..‘లవకుశ’

లవకుశులుగా నటించడం పూర్వ జన్మ సుకృతం: నాగరాజు, నాగసుబ్రహ్మణ్యం

అమలాపురం టౌన్‌:అలనాటి మహానటులంతా నాటక ‘రంగస్థలం’ నుంచే సినీరంగంలోకి అడుగిడినవారే.అక్కడ నటనతో ఓనమాలు దిద్ది.. సినీరంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు గడించిన వారెందరో.. అలా నాటకరంగం నుంచి అమలాపురం పట్టణానికి చెందిన వియ్యూరి నాగసుబ్రహ్మణ్యం పరిచయమయ్యారు. ఈయన ఎవరో కాదు 55ఏళ్ల క్రితం శ్రీరామచంద్రునిగా ఎన్టీఆర్‌, సీతాదేవిగా అంజలీదేవి జీవించి నటించిన లవకుశ చిత్రంలో కుశుడు పాత్రధారి.      ఆ ఒక్క సినిమాతో ఎంతో పేరుప్రఖ్యాతలను గడించారు.ప్రస్తుతం అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో ఇండియన్‌ టైలర్స్‌ పేరిట దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 

 సినీ నటుడైందిలా..

సుబ్రహ్మణ్యం తండ్రి సుబ్బారావుకు సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. అలనాటి అనార్కలీ సినిమాకు ఆయన ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేశారు. నటునిగా కొన్ని సినిమాల్లో నటించారు. అప్పటికే ఆయన బుర్రకథ కళాకారునిగా విశేష పేరుప్రఖ్యాతలు గడించారు. తండ్రితోపాటు నాటక, కళాపరిషత్‌లకు వెళుతూ నటనపై మక్కువ పెంచుకున్నారు. దాంతో 1950 దశకంలో కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీక్లబ్‌లో లవకుశ నాటకంలో సుబ్రహ్మణ్యం కుశుడుగా నటించి అందరినీ మెప్పించారు.అప్పటికే లవకుశ సినిమా తీసేందుకు నటీనటుల ఎంపిక ప్రక్రియను దర్శకుడు సి.పుల్లయ్య చేపట్టారు. దీనిలో భాగంగా మద్రాసు నుంచి కాకినాడకు వచ్చిన ఆయన సుబ్రహ్మణ్యం  వేసిన లవకుశ నాటకాన్ని తిలకించారు. 

కుశుని పాత్రధారి హావభావాలు తిలకించిన ఆయన వెంటనే అదే పాత్రకు ఆయనను ఎంపిక చేశారు. అప్పటికే మద్రాసులో సినీ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఏవీ సుబ్బారావు కుమారుడైన అనపర్తి నాగరాజు లవుడు పాత్రకు ఎంపిక చేశారు. అప్పటికి వీరి వయసు 11ఏళ్లు.. 1958లో లవకుశ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఐదేళ్లకు పైగా చిత్రీకరణ చేసుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. గేవా కలర్‌లో తీసిన ఈ సినిమాను 1963 మార్చి 29న విడుదల చేసినట్టు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సినిమా విడుదలై అప్పుడే 55ఏళ్లు గడిచిపోయింది. చలనచిత్ర చరిత్రలో లవకుశ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. తరాలు మారినా ఆ చిత్రం స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. శ్రీరామచంద్రునిగా ఎన్టీఆర్‌ నటవిశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు ఇలాగే ఉంటారా! అన్న భావన కల్పించిన మహానటుడు ఎన్టీఆర్‌. ఓర్పు, సహనానికి ప్రతీక అయిన సీతాదేవి పాత్రలో అంజలీదేవి ఒదిగిపోయారు. 

మరికొన్ని సినిమాల్లో నటించినా..:
లవకుశ అనంతరం పాత్రధారులైన నాగరాజు, సుబ్రహ్మణ్యంలు పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి సీతారామకల్యాణంలో నటించారు. చిన్నతనంలో రామునిగా సుబ్రహ్మణ్యం, లక్ష్మణుడిగా నాగరాజులు నటించారు. అనంతరం వెంకటేశ్వర మహత్యంలో కృష్ణుడిగా సుబ్రహ్మణ్యం, పద్మావతిదేవి తమ్ముడిగా నాగరాజులు నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన  చిత్రం వెలుగునీడలులో జగ్గయ్యతో కలిసి నటించే అవకాశం సుబ్రహ్మణ్యంకు దక్కింది. ఇదే సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కె.విశ్వనాధ్‌ పనిచేసినట్టు చెప్పారు. సుదీర్ఘకాలం అనంతరం 2006లో కోనేరు సాయిప్రతాప్‌ నేతృత్వంలో కొత్త తారాగణంతో తీసిన కల్యాణం చిత్రంలో నటించారు. 
 
స్టూడియో సెట్టింగులే..:
ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆనాడు అందుబాటులో లేకపోయినా స్టూడియోల్లోనే సెట్టింగులు వేసి లవకుశ చిత్రాన్ని నిర్మించారు. మద్రాసులోని వాహినీ, విజయ స్టూడియోలతోపాటు ఎంజీ రామచంద్రన్‌కు చెందిన అడయార్‌ తోటలో వాల్మీకీ మహర్షి ఆశ్రమాన్ని నిర్మించారు. అడవులను తలపించే రీతిలో సెట్టింగులు వేయ డం ఆషామాషీ వ్యవహారం కాదు. 
 
అమెరికా నుంచి కృష్ణుని రంగు
లవకుశ చిత్రానికి సంబంధించి మేకప్‌ మెటీరియల్‌ను పీతాంబరం తీసుకువచ్చేవారు. అప్పటికి ఎన్టీఆర్‌కు ప్రధాన మేకప్‌మేన్‌గా హరిబాబు పని చేస్తున్నారు. లవకుశ సినిమాలో నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రునితోపాటు కుశుడు పాత్రధారికి నీలంరంగు ఒంటినిండా వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పీతాంబరం అమెరికా నుంచి ప్రత్యేకంగా ఈ రంగును తీసుకువచ్చేలా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌తోపాటు తనకీ అదే రంగు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేది. ప్రత్యేక లేపనాల ద్వారా మళ్లీ ఈ రంగును పోగొట్టుకునేవారం. 

నాటకాల పిచ్చే సినీ నటుడిని చేసింది..
చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఎంతో ఇష్టం. జాతీయస్థాయిలో పేరొందిన నల్లా రామ్మూర్తి, కోళ్ల సత్యం వంటి ఎందరో ప్రముఖులతో కలిసి నాటకాలు ఆడిన రోజులు ఎన్నటికీ మరిచిపోలేం.చింతామణి నాటకంలో భవానీశంకరం పాత్ర నాటక రంగంలో పెద్దపేరే తీసుకువచ్చింది. రంగస్థలం నుంచే సినిమాబాట పట్టినవారిలో ఎస్‌వీఆర్‌ నుంచి రేలంగి, అంజలీదేవి, కుటుంబరావు, ఆదినారాయణరావు.. ఇలా ఎందరో ప్రముఖులు కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీక్లబ్‌ నుంచి వెళ్లినవారే. 
 
ఆయన పూజారిగా.. నేను టైలర్‌గా:
లవకుశ పాత్రధారులుగానటించిన నాగరాజు హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ వద్ద నిర్మించిన ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. ఆ ఆలయంలో వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే ఆయన జీవనం సాగిస్తున్నారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక తనకు దేవునికానుకగా టైలరింగ్‌ వచ్చింది.ఏ గురువు వద్దా నేర్చుకోకుండానే సినిమా, నాటకాలు అనంతరం అమలాపురంలో ఇండియన్‌ టైలర్స్‌ షాపును ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్టుతెలిపారు. అప్పట్లో లవకుశ సినిమా అమలాపురం సమీపంలోని ఈదరపల్లి శ్రీనివాసా థియేటర్‌లో విడుదలై 200 రోజులు ఒకే థియేటర్‌లో ఆడి రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నాగ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి తిలకించేందుకు వెళ్లగా కుశుడు వచ్చాడంటూ ప్రేక్షకులు ఊరేగింపుగా తీసుకువెళ్లి ఘనసన్మానం చేసిన విషయాన్ని ఎన్నటికీ మరిచిపోలేను. ఇటీవల  శ్రీకామాక్షీపీఠంలో జరిగిన కార్యక్రమంలో లవకుశ పాత్రధారులైన నాగరాజు, సుబ్రహ్మణ్యంలు ముఖ్యఅతిధులుగా హాజరై చెట్టాపట్టాలేసుకుని తిరగడం విశేషం.