హైదరాబాద్‌ అనగానే.. నవాబులు.. హవేలీలు.. ముషాయిరాలు గుర్తుకొస్తాయి. ఆ గత వైభవ చిహ్నాలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన రంగస్థల దిగ్గజం ఖాదర్‌ అలీ బేగ్‌. ఉర్దూ నాటక రంగాన్ని కొత్త మలుపు తిప్పిన ఖాదర్‌ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు ఆయన కుమారుడు మహమ్మద్‌ అలీ బేగ్‌, కోడలు నూర్‌. వీరిద్దరినీ ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా.. జాలువారిన విశేషాల మాలిక ఈ కథనం... 
 
మహమ్మద్‌ అలీబేగ్‌ మొదట్లో యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌. నాటకరంగంలోకి రావాలని కానీ.. దానిలోనే జీవనం సాగించాలని కానీ.. ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఖాదర్‌ మరణం తర్వాత 2004లో మహమ్మద్‌.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి ‘ఖాదర్‌ ఆలీబేగ్‌ థియేటర్‌ ఫౌండేషన్‌’ స్థాపించారు. మహమ్మద్‌ తల్లి బేగం రజియా ఈ ఫౌండేషన్‌కు ఛైర్‌పర్సన్‌. హిందుస్థానీ నాటకరంగానికి పునర్‌వైభవాన్ని తీసుకురావటమే ఈ ఫౌండేషన్‌ ప్రధానోద్దేశం. ఈ ఫౌండేషన్‌లో ఎం.ఎ్‌స.సత్యు, రామ్‌గోపాల్‌ బజాజ్‌, వాణి గణపతి, సుహాసిని మణిరత్నం, కార్తీక్‌ ఇళయరాజా బోర్డు సభ్యులుగా ఉండేవారు. ‘‘1990 దశకంలో నాటకాలకు పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. తెలుగు, మరాఠీ నాటకాలకు పూర్వవైభవం తీసుకురావటానికి అక్కడక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. అయితే నాటకాల పునర్జీవనానికి ఒక ప్రత్యేకమైన ఉద్యమం ఏదీ లేదు..’’ అని ఆనాటి రోజులకు గుర్తుచేసుకుంటారు మహమ్మద్‌ 1980లలో ఖాదర్‌ తన నాటకాల ద్వారా అనేక మంది మహామహులను ప్రపంచానికి పరిచయం చేశారు. ‘‘బాబా (మహమ్మద్‌ నాన్న ఖాదిర్‌) విజయ్‌ తెండూల్కర్‌, మోహన్‌ రాకేష్‌, బాదల్‌ సర్కార్‌, శంభు మిత్రా, ఫ్రెంచ్‌ నాటక రచయిత మోయిలిరి వంటి మహామహులను నాటక రంగానికి పరిచయం చేశారు. మొఘల్‌, ఆస్‌ఫజాహీ యుగాలకు సంబంధించి ఆయన రూపకల్పన చేసిన నాటకాలు చాలా ఆదరణ పొందాయి. నేను వీటిని చూస్తూ పెరిగాను. అయితే నాటకరంగంలోకి ప్రవేశించాలని గానీ, దర్శకుడిని కావాలని గానీ నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మిత్రులు, సన్నిహితుల సలహా మేరకు ఫౌండేషన్‌ స్థాపించా. బాబా స్నేహితులైన- ఎం.ఎస్‌.సత్యు, నసీరుద్దీన్‌ షా, షబానా ఆజ్మీ, రోహిణీ హట్టంగడి, టామ్‌ ఆల్టర్‌, ఫరూక్‌ షేక్‌ వంటి వారిని నాటకాలు వేయటానికి పిలిచా. వారందరూ ఆనందంగా అంగీకరించారు..’’ అని మహమ్మద్‌ ఫౌండేషన్‌ స్థాపించిన తొలి రోజుల గురించి ప్రస్తావిస్తారు.
 
మేలి మలుపు.. 
2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లోని తారామతి బారాదరిని పర్యాటక కేంద్రంగా మార్చటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యాటక సంస్థ ఛైర్మన్‌ ఆంజనేయ రెడ్డి ఈ విషయం గురించి మహమ్మద్‌తో మాట్లాడారు. ‘‘తారామతి చరిత్రకు సంబంధించిన ఒక నాటకాన్ని ప్రదర్శించమని ఆయన అడిగారు. కులీకుతబాషా చరిత్ర నేపథ్యంలోని నాటకాలను బారాదరిలో బాబా ప్రదర్శించేవారు. అలాంటి నాటకాలను మళ్లీ ప్రదర్శిస్తే బావుంటుందని ఆయన సూచించారు. నేను చాలా మంది దర్శకులను దర్శకత్వం వహించమని అడిగాను. కానీ ఎవరూ అలాంటి నాటకానికి దర్శకత్వం వహించటానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ సమయంలో బారిదరిలో స్టేజీకాని.. గ్రీన్‌రూమ్‌లు కానీ ఉండేవి కావు. తాగటానికి నీళ్లు కూడా దొరికేవి కావు.. చివరకు ఢిల్లీకి చెందిన అశోక్‌ లాల్‌ నాటకానికి దర్శకత్వం చేయటానికి అంగీకరించారు. కార్తీక్‌ ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఎం.ఎ్‌స.సాత్యు లైటింగ్‌ సమకూర్చారు. ఈ నాటకంలో ఐదు పాటలుండేవి..’’ అని తన తొలి ప్రయత్నాన్ని మహమ్మద్‌ వివరించారు. ఈ నాటకానికి చాలా పేరు వచ్చింది. దీనితో హైదరాబాద్‌ నాటకరంగంలో మహమ్మద్‌ పేరు మార్మోగిపోయింది. ఒక చారిత్రక కట్టడంలో వేసే నాటకానికి.. ఆడిటోరియంలో నాటకానికి చాలా తేడా ఉంటుందంటారు మహమ్మద్‌ ‘‘నాటకం చూడటానికి వచ్చే వారు ఆ కాలంలోకి వెళ్లిపోవాలి. ఆ జ్ఞాపకాలలో మమేకం కావాలి. అలాంటి అనుభవం ప్రేక్షకులకు ఇవ్వాలనేది నా ఉద్దేశమ’’ని అంటారాయన. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం మహమ్మద్‌ దర్శకత్వం వహిస్తున్న నాటకాల ప్రదర్శనా సమయం తక్కువే. ‘1857- తుర్బాజ్‌ ఖాన్‌’ నాటకం నిడివి 60 నిమిషాలు. ‘కూలీ-దిలోంకా షహజాదా’ నాటక ప్రదర్శనా సమయం 65 నిమిషాలు. మహమ్మద్‌ భార్య నూర్‌ రాసిన ‘స్పేసెస్‌’ నాటకం నిడివి 90 నిమిషాలే.
 
తొలి చూపులోనే.. 
నూర్‌ది చెన్నై. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలలో మాస్టర్స్‌ చేసిన తర్వాత ఆసే్ట్రలియా కాన్సులేట్‌లో పనిచేసేది. 2013లో ఆసే్ట్రలియా ప్రభుత్వం ఒక ఫెస్టివల్‌ను నిర్వహించింది. దీని ముగింపు కార్యక్రమం ఫలక్‌నుమా ప్యాలె్‌సలోని దర్బార్‌ హాల్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి మహమ్మద్‌ కూడా అతిథిగా హాజరయ్యారు. ‘‘అక్కడే మేమిద్దరం కలుసుకున్నాం. నా బ్లాగ్‌ అడ్రస్‌ రాసి ఆయనకు ఇచ్చా..’’ అని నూర్‌ మహమ్మద్‌తో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయన చదివిన తొలి బ్లాగ్‌ నూర్‌దే. ‘‘అప్పటికి తనకి 24 ఏళ్లే. అయినా తను రాసిన శైలి నాకెంతో నచ్చింది..’’ అంటారు మహమ్మద్‌. అదే సమయంలో ‘కులీ కుతుబ్‌ షా’ నాటకం ప్రదర్శించాలనుకున్నారు మహమ్మద్‌ దానికి నూర్‌ స్ర్కిప్ట్‌ సాయం చేశారు. ఈ స్ర్కిప్టును ఇంగ్లిష్‌ నుంచి ఉర్దూలోకి ఖాదీర్‌ జమీన్‌ అనువాదం చేశారు. ఈ నాటక ప్రదర్శనకు సమయం దగ్గర పడుతోంది. కానీ హీరోయిన్‌ పాత్రకు ఎవరూ దొరకలేదు. అప్పుడు ఆ పాత్రను తననే వేయమని అడిగా. నూర్‌ రెండు వారాలు సెలవు పెట్టి నాటకం వేసింది. ఆ తర్వాత ఇక కాన్సులేట్‌లో ఉద్యోగం వదిలేసి మా ఫౌండేషన్‌లో చేరిపోయింది’’ అని మహమ్మద్‌ ఆ తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు.
 
కొత్త కెరటం.. 
2013, ఏప్రిల్‌ 14న గోల్కొండ కోటలో ఈ నాటకాన్ని తొలిసారి ప్రదర్శించారు. దీనికి విపరీతమైన ఆదరణ లభించింది. ‘‘ఈ నాటకాన్ని చూడటానికి 14 ఏళ్ల యువకుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అనేక మంది వచ్చారు. అంటే ఇలాంటి ప్రదర్శనలను అందరూ ఇష్టపడుతున్నట్లే కదా..’’ అంటారు మహమ్మద్‌ ఈ ప్రదర్శన తర్వాత మహమ్మద్‌, నూర్‌ కలిసి ఆరేడు ఫెస్టివల్స్‌కు హాజరయ్యారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. ‘‘మాది ఒక పరిణితి చెందిన బంధం. మా ఇద్దరి ఇష్టాలు, అభిప్రాయాలు ఒకటే. ఇద్దరం ఒకే విధమైన సాహిత్యాన్ని, సంగీతాన్ని ఇష్టపడతాం..’’ అంటారు నూర్‌. ‘‘ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌- ఇలా ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తాం. మేమిద్దరం కలిసే పనిచేస్తాం కాబట్టి ఇల్లు, పని అని వేర్వేరుగా ఉండవు’’ అంటారు బేగ్‌. పేజీ త్రీ సెలబ్రిటీగా పేరుతెచ్చుకున్న ఈ జంట- తమ నాటకాలు సమాజంలో ఉన్నత వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటాయంటే ఒప్పుకోరు. ‘‘సమాజంలో అన్ని వర్గాల వారి కోసం మేము నాటకాలు వేస్తాం. మా నాటకాలకు ఎంట్రీ ఫీజు రెండు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. మా నాటకాలు చూడటానికి బస్సుల్లో వచ్చేవారు కూడా ఉంటారు. వారికి ఆనందం కలిగితేనే కదా.. డబ్బులు పెట్టి టిక్కెట్టు కొనుక్కొని నాటకానికి వచ్చేది..’’ అంటారు బేగ్‌. ప్రతి ఏడాది వీరి ఫౌండేషన్‌ నిర్వహించే వార్షిక కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. ప్రసిద్ధ కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొని.. నాటకాలు ప్రదర్శిస్తుంటారు. వీటిలో కొన్ని తెలుగు నాటకాలు కూడా ఉంటాయి. నాటక రంగానికి చేసిన సేవలకు గాను.. పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారాయన. మహ్మద్‌కు తెలుగు రాయటం చదవటం వచ్చు. కానీ ఇప్పటి దాకా ఒక్క తెలుగు నాటకానికి కూడా దర్శకత్వం వహించలేదు. ‘‘భవిష్యత్తులో తప్పనిసరిగా చేస్తా’’నంటారు ఆయన. 
 
‘‘మన దేశంలో నాటకానికి ఎక్కువ ఆదరణ లేదు. డబ్బులు కూడా తక్కువే వస్తాయి. హాలీవుడ్‌ బ్రాడ్‌వేలో పనిచేసే వారందరికి ఈ సమస్య ఉండదు. ఒక బాలీవుడ్‌ నటుడు ఒక ఏడాది బ్రేక్‌ తీసుకొని నాటకంలో నటించటం అసలు ఊహించలేం. మన దగ్గర నాటకాల నుంచి సినిమాలకు నటులు సునాయాసంగా వెళ్తారు. కానీ సినిమా నటులు నాటకాల్లో నటించటం అతి తక్కువ..’’ 
- మహమ్మద్‌ అలీబేగ్‌
 
అలీ ట్రూప్‌ నాటక రత్నాలు.. 
తారామతి- ది లిజండ్‌ ఆఫ్‌ యాన్‌ ఆర్టిస్ట్‌, హిజ్‌ ఎక్సేల్టెడ్‌ హైనెస్‌, రాత ఫూలోంకి, ఆయినా, రేషంకి దోర్‌, పాంక్‌దియాన్‌, ఫార్టివింక్స్‌, కాఫియత, దాదా సాహేబ్‌ ఫాల్కే, కులీ: దిలోంకా షహజాదా, సావన్‌ కి హయత, స్పేసెస్‌, 1857-తుర్బాజ్‌ ఖాన్‌. 
 
‘చిరు’ కోరిక 
ఒకసారి మహమ్మద్‌ అప్పటి కేంద్ర టూరిజం శాఖ మంత్రి చిరంజీవిని కలిశారు. అప్పుడాయన ‘కులీ కుతుబ్‌షా నాటకాన్ని రూపొందించి, ప్రదర్శిస్తే బాగుంటుంద’ని సూచించారు. చిరు కోరిక మేరకు ‘కులీ కుతుబ్‌షా’ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు మహమ్మద్‌. 
మాధవీ తాతా