ఉమ్మడి రాష్ట్రంలో మన కళారూపాలకు గుర్తింపు దక్కలేదు
ప్రత్యేక రాష్ట్రంలో సాంస్కృతిక ప్రతీకలకు జేజేలు
కళాకారుడు బతికితేనే కళ బతుకుతుంది
‘తెలంగాణ కళారాధన’తో కళను నిలబెడుతున్నాం
తెలుగు భాషా పీఠం మైసూరు నుంచి త్వరలో హైదరాబాద్‌కు

భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి):తెలంగాణ ఉద్యమం మొదలైందే సాంస్కృతిక మూలాల మీద. ప్ర త్యేక రాష్ట్ర ఉద్యమ రోజుల్లో తెలంగాణ కళలు, కళారూపాలు, సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చి, ప్రజలను జా గృతులను చేసినవారిలో భాషా సాంస్కృతిక శాఖ సం చాలకులు మామిడి హరికృష్ణ ఒకరు. ఉమ్మడి రాష్ట్రం లో గత 60 ఏళ్లలో తెలంగాణ కళలు, కళారూపాలు, కళాకారులు, సాహిత్యం, కవులకు గుర్తింపు దక్కలేదని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వా త మన సాంస్కృతిక ప్రతీకలకు జేజేలు పలుకుతున్నామన్నారు. తెలంగాణ బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీ యస్థాయిలో తీసుకెళ్లేందుకు కళాకారులే బ్రాండ్‌ అం బాసిడర్‌లు అన్నారు. తెలంగాణ తేజో మూర్తుల విగ్రహాలు, తైలవర్ణ చిత్రపటాలను ఆవిష్కరించిన నేపథ్యం లో మామిడి హరికృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు..
 
మరుగున పడుతున్న తెలంగాణ ప్రాచీన సాంస్కృతిక కళలను నిలబెట్టేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? 
తెలంగాణలో చిందు యక్షగానం, ఒగ్గుకథ, ఒగ్గుడో లు, హరికథ, బుర్రకథ, సాధనా శూరులు, పటంకథ లు, చెక్కబొమ్మలాట, కొమ్ముకోయ, గుస్సాడి, లంబాడి, మాధురి వంటి ఎన్నో కళారూపాలున్నాయి. వీటన్నింటి కి సంబంధించి కళాకారుడు బతికితేనే కళ బతుకుతుంది అనే నిర్ణయానికి వచ్చాం. చిందు యక్షగానాన్ని ‘మన ఊరు-మన చెరువు’ కార్యక్రమానికి అనుసంధా నం చేసి 129 బృందాలను ఏర్పాటుచేసి కళాకారులకు అవకాశం ఇచ్చాం. ‘తెలంగాణ కళారాధన’ పేరుతో రవీంద్రభారతిలో జానపద, గ్రామీణ, గిరిజన కళారూపాలను ప్రదర్శించాం. జిల్లాల్లోనూ చేస్తున్నాం.
 
భాషా సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యం తగ్గిందన్న విమర్శలపై మీరేమంటారు? 
భాషా సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యం తగ్గలేదు. సీఎం కేసీఆర్‌ సాహిత్యం తెలిసిన గొప్ప మనిషి. ఇప్పు డు భాషా సాంస్కృతిక శాఖ లేకుండా ఒక్క కార్యక్ర మం లేదు. శివరాత్రి రోజున వేములవాడలో 12 గంటలపాటు నిరంతరాయంగా శివార్చన పేరుతో సాంస్కృతిక జాగరణ షో నిర్వహించాం. బతుకమ్మను 9 రోజులు, బోనాలను నెల రోజులు నిర్వహిస్తున్నాం.
 
బతుకమ్మ, కోలాటం, బోనాలను అందరూ ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారా? 
వీటికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వేదికలపై ప్రద ర్శిస్తున్నాం. ఇంకా 12మెట్ల కిన్నెర, కూనపులిపఠం కథ, సాధానాశూరులు, చెక్కబొమ్మలకథ వంటి కళారూపాలపై డాక్యుమెంటరీ రూపొందిం చాం. అలాగే ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య మీద డాక్యుమెంటరీ చేశాం. భవిష్యత్తులో ఇంకా చే స్తాం. సాంస్కృతిక శాఖ పరంగా తెలుగు భాషా పరిరక్షణకు సాహితీ కార్యక్రమాలు, చర్చాగోష్ఠులు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం.
 
రాష్ట్రంలో ఎంతమంది కళాకారులను గుర్తించారు? వారికి అందిస్తున్న సహాయ సహకారాలేమిటి? 
రాష్ట్రంలో 72 వేల మంది కళాకారులు ఉన్నట్లు అంచనాకు వచ్చాం. 2,049 మంది కళాకారులకు నెలకు రూ.1,500 చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. త్వరలో 1,200 మంది కళాకారులకు పెన్షన్లు ఇచ్చేందుకు బడ్జెట్‌ అప్రూవల్‌ తెచ్చుకున్నాం. దేశంలో మరెక్కడా ఇంతపెద్ద మొత్తంలో కళాకారులకు పెన్షన్ ఇస్తున్న దాఖలా లేదు. జూన్ నాటికి కళాకారులందరికీ గుర్తింపు కార్డులి చ్చేందుకు వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాం. గ్రామీణ, జానపద కళాకారులకు రవీంద్రభారతి వేదికైంది. ఇక్కడ కళాప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకి జాతీయస్థాయి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నాం.
 
సాంస్కృతిక సారథిలోని కళాకారుల గురించి వివరిస్తారా? 
సాంస్కృతిక సారథిలో 550 మంది కళాకారులున్నా రు. ప్రభుత్వ కార్యక్రమాలను వారు ప్రచారం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులందరికి సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించాం. వారు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఒక్కొక్కరికి నెలకు రూ.24 వేల వేతనం ఇస్తున్నారు. అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఆరు మ్యూజిక్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 4వేల మంది విద్యార్థులున్నారు. వాద్య సంగీతం, గాత్ర సంగీతం, నృత్యం వంటి పలు కోర్సులు ఉన్నాయి
 
తెలంగాణకే ప్రత్యేకమైన పేరిణి నృత్యం పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? 
పేరిణి నృత్యం 11వ శతాబ్దంలో ప్రారంభమై 13వ శతాబ్దంలో కనుమరుగైంది. 1980 ప్రాంతంలో డాక్టర్‌ నటరాజ రామకృష్ణన పరిశోధన వల్ల మళ్లీ పేరిణి నృ త్యం పునరుద్ధరణకు నోచుకుంది. 1985లో 108 మంది తో ఓ ప్రదర్శన చేశారు. 1990 నుంచి ప్రోత్సాహం లేక మళ్లీ కనుమరుగైంది. తెలంగాణ ఏర్పడ్డాక 12 మంది పేరిణి కళాకారులు ఉన్నారని గుర్తించాం. ప్రభుత్వ పరంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. 2016 జూన 2 నాటికి 256 మంది పేరిణి కళాకారులను తయారుచేసి వారితో లలితకళాతోరణంలో పేరిణి మహా నృత్య ప్రదర్శన చేశాం. మ్యూజిక్‌ కళాశాలలో పేరిణి నృత్యాన్ని ఒక కోర్సుగా పెట్టాం. వెయ్యి మందితో వేయి స్తంభాల గుడిలో పేరిణి మహా నృత్య ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో ఉన్నాం.
 
తెలుగును ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? 
తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడం వల్ల విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు అవుతుంది. ఆ సంస్ధ పరిశోధన, డాక్యుమెంటేషన, వివిధ రకాల సెమినార్‌లు, చర్చాగోష్ఠులను ఏర్పాటుచేయడం ద్వారా సాహితీ అంశాల నుంచి చరిత్రను నిర్మించడం జరుగుతుంది.
 
తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడంలో మీ పాత్ర ఉంది దీనికి మీరెలా ఫీలవుతున్నారు? 
అమ్మకు సేవ చేసిన విధంగానే ఫీలవుతున్నా. తెలుగు భాషను కాపాడుకోవడం కోసం తెలంగాణనే ఆధారమైంది. తెలుగు భాషకు ప్రాచీన హోదాపై 2009లో కేసు వేస్తే 2015 వరకు అడుగు కూడా ముందుకు కదల్లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక డైనోసర్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో జీవులు సంచరించాయనే ఆధారాలు మనకు దొరికాయి. తెలంగాణ ఉద్యమం.. మన మూలాలను మనం వెతుక్కునేందుకు చరిత్రను తవ్వుకునేలా, గత వైభవాన్ని స్మరించుకునేలా చేసింది.
 
తెలుగు భాషా పీఠాన్ని మైసూరులో ఏర్పాటు చేశారు? హైదరాబాద్‌కు ఎప్పుడు తెస్తారు? 
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన లాంగ్వేజెస్‌ అనే సంస్థ మైసూరులో ఉంది. అక్కడ తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో ఈ పీఠాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కృషి చేస్తున్నారు.
 
భవిష్యత్తులో కొత్త ప్రాజెక్టులపై ప్రణాళికలున్నాయా? 
ఇతర రాష్ర్టాలకు మనకు మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ బ్రాండ్‌ని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. తెలంగాణ కవితా రూపాలను ఇతర రాష్ర్టాలకు తీసుకెళ్లడం, తెలంగాణ కవితా సంకలనాలను ఇంగ్లిషు, హిందీ భాషల్లోకి అనువదించి జాతీయస్థాయిలో తెలంగాణ కవిత్వాన్ని పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. నాటకరంగం అభివృద్ధి, వికాసం కోసం ఆరు అంచెల వ్యూహంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. అలాగే యువత కోసం ప్రతి శనివారం రవీంద్రభారతిలో ‘సినీవారం’ పేరిట షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. జిల్లాల్లో యువనాటకోత్సవాలను చేస్తున్నాం.