దేశవిదేశాల్లో గుర్తింపుపొందిన ప్రఖ్యాత నాట్య కళాకారిణి, సినీనటి, కథానవలా రచయిత్రికోసూరి ఉమాభారతి.. పలు నృత్య రూపకాలతో కొత్త తరం గురువుగా పేరొందారు .నాట్యకళతో మనిషికి క్రమశిక్షణ , శ్రద్ధ, అలవడతాయనీ, మానసిక పరిణతి లభిస్తుందనీ అంటారామె.నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడిన ఉమాభారతి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆమె ఇంటర్వ్యూ..

గుంటూరులో 1958లో నేను జన్మించాను. మేం నలుగురు సంతానం. తమ్ముడు నాగేంద్రప్రసాద్‌, చెల్లెళ్ళు వైజయంతి, అనూరాధ. మా నాన్నగారు సత్యనారాయణ ఆర్మీ మేజర్‌. అమ్మ శారద. నాన్నగారు కళాకారులు. పద్యాలు, పాటలు పాడేవారు. నా అభివృద్ధికెంతో చేయూతనిచ్చారు. ఊహ తెలిసినప్పటినుంచీ నృత్య సంగీతాలను ఆరాధించాను. మద్రాసు టి.నగర్‌లో ఉన్నప్పుడు మా కింద వాటాలో పద్మశ్రీ వెంపటి చినసత్యంగారు కూచిపూడి నృత్యకళాశాల నడిపేవారు. అలా నా ఐదవ ఏట ఆయన దగ్గర చేరాను. సినీనటి రేఖ, చంద్రకళ, పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ....అనే పాటకు నాట్యం చేసిన సుజాత లాంటివారంతా శిక్షణ పొందేవారు. వేదాంతం జగన్నాథశర్మ, ఫకీర్‌స్వామి పిళ్ళై, కళైమామణి టి.ఆర్‌.రాధాకృష్ణన్‌ల దగ్గర కూడా నాట్యాభ్యాసం చేశాను. 1970లో అరంగేట్రం చేసి, దేశవ్యాప్తంగా వందలాది నాట్య ప్రదర్శనలిచ్చాను. అఖిలభారత నృత్యపోటీల్లో ప్రథమస్థానంలో నిలిచాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేశాను.

వేలాది నాట్య ప్రదర్శనలు

కళను ధనార్జనకోసం కాదని నాన్నగారనేవారు. అందుకే వివాహానంతరం అమెరికా వెళ్ళాక, అక్కడ పలు రాష్ర్టాలలో ఆలయాల నిర్మాణంలో నిధుల సేకరణ కోసం నాట్య ప్రదర్శనలు చేశాను. దానికోసం ‘దేవీ స్తోత్రమాలిక’, ‘గురవేనమః’, ‘మానసపుత్రి’, ‘కన్య’ అనే నాలుగు నృత్యనాటికలు రాసి లార్జ్‌స్కేల్‌లో ప్రదర్శనలిచ్చి, సుమారు 35 ఆలయాల నిర్మాణాలకు నిధుల సేకరించాను. అలా నా నృత్యాన్ని సామాజిక ప్రయోజనాలకు కంట్రిబ్యూట్‌ చేశాను. పిట్స్‌బర్గ్‌ వెంకటేశ్వరాలయం, హ్యూస్టన్‌లో మీనాక్షి ఆలయం, చిన్మయ మిషన్‌, అట్లాంటాలో అమ్మవారిగుడి, వాషింగ్టన్‌లో శివ–విష్ణు ఆలయం, చికాగోలో రామాలయం, జార్జియా హిందూ ఆలయం...వీటన్నింటి నిర్మాణంలో నా కంట్రిబ్యూషన్‌ ఉంది.పలు దేశాల్లో నృత్యప్రదర్శనలిచ్చి, రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు ఫండ్‌ రైజింగ్‌ చేశాను. వివి.గిరి, టి.అంజయ్యలాంటి ప్రముఖుల మనన్ననలు పొందాను. ఆమెరికాలోని 22రాష్ర్టాలతోపాటు మారిషస్‌, మలేసియా, సింగపూర్‌ సహా, దక్షిణాఫ్రికాలోని 30 నగరాల్లో ‘ఉమాభారతి షో’ పేరిట విస్తారంగా నాట్య ప్రదర్శనలిచ్చాను. 2009లో ప్రపంచ కూచిపూడి సదస్సులో పాల్గొన్నాను.

నాట్యకళతో మానసిక పరిణతి

నాట్యంవల్ల క్రమశిక్షణ, శ్రద్ధ, ఆహారనియంత్రణ అలవడుతుంది. బ్రెయిన్‌కూ, శరీరానికి నాట్యం ఒక గొప్ప వ్యాయామం. కళాకారులు, ప్రతిపాత్రను అర్థంచేసుకుని ప్రదర్శనలివ్వడంవల్ల వారిలో దయాగుణం, ఓర్పు పెంపొందడమేకాదు, సామాజిక దృక్పథం, మానసిక పరిణతి వస్తుంది. మన సంస్కృతిని, నృత్యాలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు.అందుకే హ్యూస్టన్‌లో ‘అర్చనా ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ’ ప్రారంభించి సుమారు 250మందికి నాట్యశిక్షణ ఇచ్చాను. ఎన్నో Outstanding performence Awards పొందాను. నా స్వీయ రచనాదర్శకత్వంలో రూపొందిన ‘భరతముని భూలోకపర్యటన’ ఫాంటసీ నృత్యనాటిక1997లో ‘తానా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు పొందింది. ఆంధ్రప్రదేశ్‌చలనచిత్ర మండలి సత్కారం, ప్రతిష్టాత్మకమైన ఎల్‌.వి.ఆర్‌ ఫౌండేషన్‌, రాజ్యలక్ష్మీ పౌండేషన్‌ అవార్డులు, ఏషియన్‌ ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, జ్యోతిబా ఫూలే అవార్డు, తానా అవార్డు, ‘వంశీబర్కిటీ మిలీనియం అవార్డు, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు నాకొచ్చిన వాటిల్లో కొన్ని.