ప్రముఖ కవి శిఖామణి. (సంజీవరావు). కవి సంధ్య పత్రిక స్థాపకులు, యానాం పొయిట్రీ ఫెష్టివల్‌ ద్వారా కొత్త కలాల్ని ప్రోత్సహిస్తూ , కవిత్వానికి వన్నె తెస్తున్నారు . భూమికి ఓజోన్‌ పొరలా, మనిషి మనుగడకు ,ఉన్నతికి కవిత్వం ఓ రక్షణ కవచం అంటున్న శిఖామణి ఇంటర్వ్యూ .....

మాది కేంద్రపాలిత ప్రాంతం యానాం (తూర్పుగోదావరిజిల్లా). అక్కడే 1957 అక్టోబరు 30న పుట్టాను. మా అమ్మ కర్రి ఆదిలక్ష్మి, నాన్న సూర్యనారాయణ. మేం నలుగురు సంతానం. పుట్టిన ఆరునెల్లకే అమ్మను కోల్పోయాను. నాన్నగారు మా ముగ్గురు అన్నదమ్ముల సంరక్షణ తన ప్రియ మిత్రుడు జి.రత్నశిఖామణిగారికి అప్పగించి, అక్కను తీసుకుని ఉద్యోగరీత్యా పూనాలో ఉండేవారు. నాన్నగారు, శిఖామణిగారు ఇద్దరూ రంగస్థల నటులే. బర్మాలో ఉన్నప్పుడే ఎన్నో నాటకాలు వేసేవారు. నాన్న రచయిత కూడా. వారిద్దరి స్నేహస్ఫూర్తే బాల్యంలో నాతో కథ రాయించింది.నన్ను ప్రాణప్రదంగా పెంచి పెద్దచేశారు శిఖామణి. నేను అమ్మ అని పిలిచింది ఆయన్నే. ఈ నా జీవితం ఆయన పెట్టిన భిక్షే. అందుకే ఆయన పేరునే కలంపేరుగా పెట్టుకున్నాను.

మా నాన్న చెల్లెలు మీరమ్మ గురించి తర్వాతి కాలంలో నేను రాసిన ‘మాబాప్ప’ కవిత దళిత సాహిత్యంలో, స్ర్తీల పరంగా నాకెంతో గుర్తింపు తెచ్చింది.సాహిత్యం పై అనురక్తిశిఖామణిగారు నాటకాలు, సినిమాలు, సర్కస్‌లు చూపిస్తూ మాలో గొప్ప అభిరుచుల్ని పెంపొందించారు. ఒకసారి ఇంట్లో కట్టెలమ్మి ఆ తడబ్బుతో మమ్మల్ని తీసుకెళ్ళి ‘రక్తకన్నీరు’ నాటకం చూపించారు. యానాంలో గొప్పగొప్ప నాటకప్రదర్శనలు, పురాణ ప్రవచనాలు, ఇంట్లో పుస్తకాల ప్రభావం నాపై బలంగా పడింది.నా కన్నతల్లిని నేను ఏనాడూ చూడకపోవడంవల్ల, నాటకాలు, సినిమాలలో తల్లికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తే పొగిలి పొగిలి ఏడ్చేవాణ్ణి. పండుగరోజుల్లో అందరూ కొత్త బట్టలేసుకుని తిరుగుతుంటే, అమ్మ లేదనే బాధతో నేను చీకటిగదిలో కూర్చునేవాడిని.

ఆ సున్నిత మనస్తత్వమే సృజనపట్ల నాలో ఆసక్తి రేకెత్తించిందనుకుంటాను.పదో తరగతిలో ‘శవం తేలింది’ కథ రాశాను. ఇంటర్మీడియట్‌లో కవిత్వం రాయడం ప్రారంభించాను. నాటకాలు వేస్తూ, ఉత్తమ నటుడు అవార్డులు పొందేవాణ్ణి.కాకినాడ పి.ఆర్‌. కాలేజీలో బి.ఏ స్పెషల్‌ తెలుగులో చేరాను. అప్పుడే నా తొలి కవిత ‘హోరుగాలి’, ‘నో థాంక్స్‌’ కథ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. ఆ కాలేజీలో ఉన్న గొప్ప గ్రంథాలయంలోనే సుప్రసిద్ధ గ్రంథాలన్నీ చదివాను. కాలేజీ లోపలా బయటా కవిత్వ వాతావరణమే. కనకప్రవాసి, దేవరకొండ శేషగిరిరావు, నందుల గోపాలకృష్ణ లాంటి గొప్ప ఉపాధ్యాయులు, జిల్లా గ్రంథాలయంలో కవిసమ్మేళనాల్లో ఆవంత్స, అద్దేపల్లి, చిరంజీవినీ కుమారి, ఇస్మాయిల్‌, జ్ఞానానందకవి లాంటి సాహితీదిట్టలు, పెద్దలతో నా సాంగత్వం కొనసాగింది.

మరోవైపు బాహుబలి సినిమా పాటల రచయిత చైతన్య ప్రసాద్‌, విన్నకోట రవిశంకర్‌ లాంటి యువకవి మిత్రులుండేవారు. గోపాలకృష్ణగారి సలహాతో ఆంధ్రాయూనివర్సిటీ (ఆంధ్రవిశ్వకళాపరిషత్‌) లో ఎం.ఏ చేశాను. మొదట ఇంటర్మీడియట్‌లో కందర్ప వెంకట నర్సమ్మగారు నా భాషా ప్రతిభ గుర్తించి మార్గదర్శకత్వం చేసి సాహిత్య బీజవాపనం చేస్తే, ఆంధ్రాయూనివర్సిటీలో అత్తలూరి నరసింహారావుగారు నన్ను గైడ్‌ చేసి ఒక కవిగా నన్ను డిస్కవర్‌ చేశారు. నా కవిత్వానికి ఒక రూపం ఏర్పడుతోందని మొదట గుర్తించింది ఆయనే.