కథా ప్రచారానికే జీవితం అంకితం చేసిన రచయిత, ఓరల్‌ స్టోరీ టెల్లర్‌ కిరణ్.దేశ విదేశీ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన సాహిత్య కార్యకర్త.. ‘మనిషి తలరాత మార్చేది సాహిత్యమే.. అంతటిశక్తి డబ్బుకీ, అధికారానికీ దేనికీ లేదంటారాయన.. పుస్తక జ్ఞానం లేకుండా ఏదీ సాధించలేం . తెలుగునాట గొప్ప కథకులు–కథలు పుట్టాలంటే పిల్లలు , పెద్దలందరితో ప్రపంచ సాహిత్యం చదివించాలి, ఈ లక్ష్యసాధన కోసమే ‘కథా ప్రపంచం ’ వెబ్‌సైట్‌ ప్రారంభించానంటున్న కిరణ్‌ అంతరంగం.....

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి మా ఊరు. మా ఇంటిపేరు కూడా అదే. మా నాన్నగారు చెంగళ్‌రాయుడు. తి.తి.దే సాధారణ ఉద్యోగి. అమ్మ నాగరత్నమ్మ. 1984మే 19న నేను పుట్టాను. మేం ముగ్గురు సంతానం. మా అక్క భానుప్రియ, అన్నయ్య జగదీశ్‌. కథను నాకు పరిచయం చేసింది మా నాయనమ్మ, అక్కయ్యలే. వాళ్ళు చెప్పిన జానపద కథలన్నీ నాకు బాగా ఒంటబట్టాయి. కథలు చదివి వినిపించేది అక్కయ్య. వినడం, చదవడమనే ఆ రెండు విద్యలూ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.తిరుపతిలో నేను చదివిన నవభారత్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూలులో పెద్ద గ్రంథాలయం ఉండేది. అది నన్ను వశంచేసుకుని, నన్నొక పుస్తకప్రేమికుడిగా, రచయితగా తీర్చిదిద్దింది. ఫిఫ్త్‌ క్లాస్‌నాటికే హిందూపత్రిక యంగ్‌వరల్డ్‌పేజీ, టింకిల్‌ బుక్స్‌, హిందూపత్రిక పాత సంచికలు, రీడర్స్‌ డైజెస్ట్‌ చదివేవాణ్ణి. బాలమిత్ర, బాలజ్యోతి చదవేవాణ్ణి.

శంకరమంచి అమరావతి కథలు, కొమ్మూరి రచనలు, ఓ హెన్రీ, విక్టర్‌హ్యూగో, హెచ్‌.జి.వెల్స్‌, గైడిమపాస, అగథాక్రిష్టీ, సాహిత్యం చదివేవాణ్ణి. ఆర్కే నారాయణన్‌, రస్కిన్‌బాండ్‌, టాల్‌స్టాయ్‌ నన్ను తీవ్రంగా ప్రభావితం చేశారు. అలా బాల్యనుంచే దేశ,విదేశీ సాహిత్యంపట్ల ఆపేక్ష పెంచుకున్నాను. ఇవన్నీ నా జీవిత శైలిని మార్చేశాయి.చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న పిలకాగణపతిశాస్త్రి ఫొటోను ఇప్పటికీ నేను భద్రపరిచి ఉంచాను. ఆయన తెలుగులో ఎంతో తియ్యందనం ఉంటుంది. ఒక్కసారి ఆయన ‘ప్రాచీన గాథాలహరి’ చదివితే ఇక వదిలిపెట్టలేం. ఆయన పుట్టిన తెలుగుదేశంలో నేనుకూడా పుట్టడం అదృష్టంగా భావిస్తాను.చదువులో వెనకబెంచీబాలమిత్రలో ‘ఆపదమొక్కులవాడు’ తో ప్రారంభించి సుమారు పది కథలు పైనే రాశాను. బాలజ్యోతి, ఆంధ్రజ్యోతిలో పిల్లల వ్యాసాలు కథలు రాసేవాణ్ణి. కార్టూన్లు, బొమ్మలు గీసేవాణ్ణి.

ఈ వ్యామోహంవల్ల టెన్త్‌ లెక్కల పరీక్ష ఒక్కమార్కులో తప్పాను. ఇంటర్మీడియట్లో ‘ప్రియదత్త’ వారపత్రికలో రాసిన నా తొలికథ ‘తనదాకావస్తే’ నాటకాలు కూడా రాసేవాణ్ణి.చదువులో, క్లాసులో నాదెప్పుడూ వెనకబెంచీనే. వెనకబెంచీలో కూర్చుని కథలు, కవితలు, వ్యాసాలు రాసుకునేవాణ్ణి. బొమ్మలు గీసుకునేవాణ్ణి. అవి పబ్లిష్‌ అవుతుంటే, ఇంకా ఇంకా చదువుతూ ఆ లోకంలోనే బతికేవాణ్ణి. పాన్‌షాపుల దగ్గర నిలబడి అక్కడున్న పుస్తకాలు పేజీలు తిప్పిచూస్తూ వాళ్ళతో తిట్లు తినేవాణ్ణి.ఇంజనీరు, డాక్టరు అనే కోరికలు నన్నాకర్షించేవికావు. మా ఇంగ్లీష్‌ టీచర్‌ సురేష్‌ మాత్రం నా ప్రతిభ గుర్తించి, నన్నొక ఆదర్శ విద్యార్థిగా, నా గొప్పతనాన్ని స్కూలు ప్రేయర్‌లో అందరికీ పరిచయం చేశాడు.

ఆ రోజు నేను కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేశాను. అప్పటినుంచి స్కూల్లో నాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. నన్ను వెలుగులోకి తెచ్చిన ఆ టీచర్‌ స్ఫూర్తితో జీవితంలో నేను ఎన్నో సాధించగలిగాను. తెలుగుభాషా సమితి అధ్యక్షులు శాకం నాగరాజుగారు కూడా నా టేలంట్‌ గుర్తించి ఎన్నో పుస్తకాలు నాతో చదివించారు. రచయిత వక్కంతం సూర్యనారాయణగారి ‘దిష్టిబొమ్మ’ నాటకంలో వికలాంగుడిపాత్ర, ఆయన స్వీయ దర్శకత్వంలో ‘సత్యహరిశ్చంద్ర’ లో నక్షత్రకుడిపాత్రలో హాస్యం పండించి అలరించేవాణ్ణి.