కవి, కథకుడు, నవలావ్యాస రచయిత అడపా రామకృష్ణ. అక్షరానికి ఆత్మబంధువు, మృదుభాషి, నిరాడంబర వ్యక్తి. సామాన్య మానవుడి కష్టాలు, కడగండ్లే ఆయన కథావస్తువులు. సమాజ రుగ్మతలను తన కథల్లో ప్రశ్నిస్తారాయన. మానవ మనుగడకు నీతి నిజాయతీలే మూలస్తంభాలంటున్న అడపా రామకృష్ణ ఇంటర్వ్యూ..

రామకృష్ణ తండ్రి అడపా అప్పారావు స్వంత ఊరు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు. తల్లి సరస్వతమ్మ. 1951 అక్టోబరు 31వ తేదీన జన్మించారు రామకృష్ణ. పదవ తరగతిలో ఉండగానే ఆయనలోని సాహిత్యాభిరుచి వెలుగుచూసింది. అప్పటినుంచే కవితలు రాయడం ప్రారంభించారు. ‘వేదాంతభేరి’ పత్రికలో ఆయన రాసిన అనేక కవితలు ప్రచురితమయ్యేవి. ‘నాకేటి ఎరుక మట్టిబెడ్డ పిసికెటోణ్ణి, వానొస్తే యేటిలో ఈడేవోణ్ణి, మాయదారి రోగమొస్తె అమ్మోరి కాలికి మొక్కుతా....అంటూ బాలల వేడకల గురించి బాలలకే తెలియదంటూ, బాలల దినోత్సవం సందర్భంగా 1979లో ఆయన రాసిన ‘సిన్నోడి మాట’ కవిత అందరిదృష్టినీ ఆకర్షించింది. ఆకాశవాణి కేంద్రం యువవాణి కార్యక్రమాల్లో కూడా ఆయన కవితలు ప్రసారమయ్యేవి.‘ఎక్కడ సుమాని కబళించిందో అక్కడే మన సర్వస్వాన్నీ చేజిక్కించుకుందాం...’ అంటూ సునామి వచ్చినప్పుడు 2004లో ఆయన రాసిన కవిత హెదరాబాద్‌ సాంస్కృతిక సంస్థ ముద్రించిన సంకలనంలో చోటు సంపాదించింది.

అవినీతిపై కవితాశంఖారావం

విలువలకు కట్టుబడిన రచయితగా అడపారామకృష్ణ, ‘వాడిని జయించాలి’ అంటూ దేశాన్ని పీడిస్తున్న అవినీతిపై కవితాశంఖారావం ప్రకటించారు. ఆ దీర్ఘకవిత ఆయన సాహిత్యంలో ఒక మైలురాయి. ‘వాడి’ని జయించడమంటే అవినీతిని ఓడించడమే...అంటారు రామకృష్ణ.‘ఉత్తరాంధ్ర చైతన్య స్వరాలు’ కవితా సంకలనంలో ప్రచురితమైన ఈ కవితను చూసిన ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు ‘వాడు’ పదానికి వర్గశత్రువు, అవినీతిపరుల ముఠా’ అనే సంకేతంగా రామకృష్ణ కవి ఉపయోగించారని తన ముందుమాటలో పేర్కొన్నారు. సామ్రాజ్యవాది, పెట్టుబడిదారుడు, దోపిడిదారుడు, వాడే అవినీతికి మూలపురుషుడు, నీతికి శత్రువు...వాడిని జయించడం స్వేద జీవుల ప్రధమ కర్తవ్యంగా కవి పేర్కొంటాడు.‘బహుళ జాతులతో మిత్రత్వం/కొత్త పంథాలో దాతృత్వం/కొలిక్కిరాని పంచతంత్రం/బడా బూర్జువాల భుజాలెక్కి/ఒకే గొడుగు కింద నక్కి/భిన్న సంకేతాలిచ్చే విన్యాసాలు /చీకటి వ్యాపారాల్లో విచిత్రాలు/అడ్డదారిలో వ్యాపార చిద్విలాసాలు......’ ఇలా సాగిపోతుంది ఆ దీర్ఘ కవిత.

పేద మధ్యతరగతి వర్గాలను పట్టిపీడిస్తున్న అవినీతి అంశాన్ని చదువరి హృదయంలో బలమైన భావోద్వేగాలు రగిలించేలా వాస్తవిక దృక్పథాన్ని తన కవితలో కళ్ళముందు ఆవిష్కరించారు రామకృష్ణ. ఈ దీర్ఘ కవితను శ్రీమతి పారనంది నిర్మల హిందీలోకి అనువదించగా, అనంతపురం కవి డా.రమేష్‌ నారాయణ ‘He is to be concord’ అనే టైటిల్‌తో ఆంగ్లంలోకి అనువదించి ‘వాడిని జయించాలి’ కవితకు ఎల్లలు దాటిన వన్నె తెచ్చారు. ఆయన రాసిన ‘ధీరోదాత్త దాశరథి’ కవితను వరంగల్‌ తెలంగాణ సాహితీమిత్రమండలి కవితాసంకలనంలో ప్రచురితమై ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. అవినీతి నిరోధకోద్యమానికి అండగా నిలబడటం, అవినీతిపై గళమెత్తి నిరసించడం, వాటిని కవిత్వంగా, కథలుగా మలిచి పాఠకచైతన్యానికి దోహదం చేయడమే కర్తవ్యంగా చేపట్టారు రామకృష్ణ.

కవిత్వం అంటే....

‘అమృతాన్ని చిలికించేదీ, హాలాహలాన్ని హరించేదీ, జాతికి మార్గదర్శకత్వంగా నిలిచేదీ, స్వర్ణయుగాన్ని ఆవిష్కరించేదీ కవిత్వం.....కవితత్వం....’ అంటారు రామకృష్ణ. ఆయన ప్రతి అక్షరంలో సామాజిక ప్రయోజనం కనిపిస్తుంది. తనుండే విశాఖపట్నం రహదారులు, స్కూలు ఆటోలు, ప్లాస్టిక్‌ కాలుష్యం, టీవీ సీరియల్స్‌, ప్రకృతి విలయాలు, ప్రకృతి పర్యాటకం, బాల్యం, సైనిక పాటవం. మద్యం, వాన రాకడ...ఇలా ఎన్నో కవితలు ఆయన ఆలోచనాదృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి.