కవికి రెండు జీవితాలు ఉండకూడదు: –సిద్ధార్థ
కవి, సినీ రచయిత సిద్ధార్థం. ఆయన జీవితమే ఆయన కవిత్వం. మానవత్వానికీ, మనిషితనానికీ దగ్గరగా ఉంటుంది నా కవిత్వం అంటారు ఆయన. కవికి రెండు జీవితాలు ఉండకూడదు అని విస్పష్టంగా చెబుతున్న సిద్ధార్థ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే..
నల్గొండజిల్లా పొచంపల్లి సమీపంలోని చినరావులపల్లి మా ఊరు. నాన్నగారు బొమ్మగౌని శ్రీనివాస్. అమ్మ సుశీల. నాన్నగారు బ్రూక్‌బాండ్ ఇండియా ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేసేవారు. నా అసలు పేరు వెంకటేశ్వర్లు. 1961లో జన్మించాను. మేం ముగ్గురు సంతానం. నాన్నకు ఆంగ్ల సాహిత్యం ఇష్టం. అమ్మకు కవిత్వం, సంప్రదాయ సాహిత్యం ఎంతో ఇష్టం. బాల్యం నుంచీ అమ్మ ప్రభావమే నా మీద చాలా ఎక్కువ. అమ్మ ఎంతో కవితాత్మకంగా, అద్భుతంగా డైరీలు రాసుకునేది. నాకు చదివి వినిపించేది. అమ్మ మంచి గాయకురాలు. తిరుప్పావై రచనల్ని తెలుగులోకి అనువదించింది. అమ్మకు ఇంట్లో లైబ్రరీ ఉండేది. ఆ సాహిత్యం నేను చదివేవాణ్ణి.
చదువు, సాహిత్య పఠనం
హైదరాబాద్ చిక్కడపల్లిలో మేనమామగారింట్లో ఉండి చదువుకున్నాను. ఉస్మానియాలో డబుల్ పీజీ చేశాను. హిందుస్థానీ సంగీతంలో డిప్లమో చేశాను. సితారవాద్యం నేర్చుకున్నాను. నేను మొదట చదివింది శరత్ సాహిత్యమే. సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుకునేవాణ్ణి. అలా బాల్యం నుంచీ నా సాంగత్యం హైదరాబాద్‌తోనే. రకరకాల భాషలు, దృక్పథాలు, సాహిత్యాలతో అనుబంధం ఏర్పడింది. రేడియోలో కవిత్వం చదివేవాణ్ణి. ఇంటర్మీడియట్లో కాలేజీ మ్యాగజైన్స్‌కు నేనే ఎడిటర్ని. అప్పుడే వ్యాసాలు రాయడం మొదలెట్టాను. సాహిత్య సమావేశాలకు వెళుతూ, దాశరథి, నగ్నముని, శేషేంద్ర, శివారెడ్డి, మోహన్‌ప్రసాద్, సీతారాం లాంటి ప్రముఖులతో ఇంటరాక్టయ్యేవాణ్ణి.
చలం, తిలక్, బుచ్చిబాబు, గోపీచంద్, నిశికవుల సంకలనాలు, వేగుంట మోహన్‌ప్రసాద్, శేషేంద్ర సాహిత్యం ఇంటర్మీడియట్లోనే చదివాను. డిగ్రీలో కొంతకాలం విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి, విప్లవ సాహిత్యంవైపు వెళ్ళినా తర్వాత బయటపడి, వడ్డెర చండీదాస్, త్రిపుర, భమిడిపాటి జగన్నాథంగారు, అంపశయ్య నవీన్‌లతోపాటు, ఇంగ్లీష్ మోడ్రన్ పొయట్స్లో టి.ఎస్.ఇలియట్, ఎజ్రాపౌండ్, రేనామారియా రిల్కే, మైకోవస్కీ, అలెగ్జాండర్ బ్లాక్, నికొలాయ్ గొగోయ్...లాంటివారందరినీ చదివాను. బోదలేర్ అంటే నాకిష్టం. చాలా గాఢమైన, అంతర్ముఖ కవిత్వం ఆయనది. జీవితంలో ఉండే హింస, దాడి, అణచివేతను బోదలేర్ చెప్పాడు. నా మీద శేషేంద్రశర్మ ప్రభావం ఉంది. ఆయన భాష, డిక్షన్ ప్రత్యేకమైనది. ‘నువ్వు ఆవకాయ కవిత్వం, ఆకలి కవిత్వం ఏదైనారాయిగానీ, కవిత్వమే రాయి’ అన్నాడు శేషేంద్ర.