బాలల రచయిత, స్టోరీ టెల్లర్‌ ఉమామహేశ్వరరావు.  పిల్లల్లో బాధ్యతారాహిత్యం, ఆత్మన్యూనత, ఆత్మహత్యలు వంటి ధోరణులు బాలసాహిత్యం చదవకపోవడం వల్లనేనని, పిల్లల్లో చదివే అలవాటు పెంచే బాధ్యత తల్లిదండ్రులదేనని అంటారాయన . ఆయన జానపద నవల ‘ఆనందలోకం’ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఉమామహేశ్వరరావు ఇంటర్వ్యూ

విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని మారుమూల పల్లెటూరు గెడ్డలుప్పి మా గ్రామం. 1964నవంబరు 14వ తేదీన బాలల దినోత్సవంనాడు పుట్టి, బాలసాహిత్య రచయితగా ఎదగడం నా అదృష్టం. మా నాన్నగారు నారంశెట్టి గంగయ్య. అమ్మ సావిత్రమ్మ. ఐదుగురు సంతానంలో నేను మూడోవాడిని. ప్రతిరోజు నాటుపడవలెక్కి సువర్ణముఖి నది దాటివెళ్ళి సీతానగరం స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను. నదిలో ఈతలు కొడుతూ, ఆటలాడుతూ శారీరక దారుఢ్యం పెంచుకుంటూ మనోవికాసం పొందాను. బొబ్బిలి ఆర్‌ఎస్‌ఆర్‌కె కళాశాలలో ప్రథమశ్రేణిలో పాసై, ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఏ సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివి, 1986లో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌గా పనిచేస్తున్నాను. 

స్టోరీ టెల్లింగ్‌, తొలి కథ, నవల

ఇంట్లో అమ్మ దిద్దించిన అక్షరాలు, నేర్పిన క్రమశిక్షణతోపాటు, ప్రతిరోజూ మా ఇంట్లో అమ్మానాన్నా రాగయుక్తంగా పురాణకాలక్షేపం చేసేవారు. మేం ఎంతో శ్రద్ధగా వింటూ, స్కూలుకి నడిచివెళ్ళే తోవలో, అలుపు తెలియకుండా ఆ కథలు, పద్యాలు, శ్లోకాలు అనర్గళంగా చెప్పుకునేవాళ్ళం. అలా నాకు తెలియకుండానే స్టోరీ టెల్లింగ్‌ ఎంతో బాగా ప్రాక్టీస్‌ చేశాను. అలా సాహిత్యంమీద నాకు ఆసక్తి పుట్టింది. 

ఏడో తరగతిలోనే గేయాలు, పద్యాలు, కవితలు రాసేవాణ్ణి. నా మొదటి కథ ‘కష్టే ఫలే’. టెన్త్‌లో నేను రాసిన నా మొదటి నవల ‘మేలెరిగిన మనిషి’. 1981లో బాలజ్యోతి అనుబంధ నవలగా వెలువడింది. అలా 75రూపాయలు తొలి పారితోషికం అందుకున్నాను. బాలల రచయితగా స్థిరపడటానికి అదే నాకు పునాది. ఆ తర్వాత చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలభారతి, బాలచంద్రిక, జాబిల్లి, బాల, బాలకిరీటం, బాలరంజని, చిరుమువ్వలు, బాలభారతం, మొలక, శ్రీవాణి పలుకు, బాలబాట, నాని సహా పలు దినపత్రికల అనుబంధాల్లో నా రచనలు విరివిగా ప్రచురితమయ్యాయి.

ఇదీ నా బాల సాహిత్యం

ఇప్పటివరకు నేను రాసిన 1500కి పైగా బాలల కథలు, బాలగేయాలు, గేయ కథలు, అనుబంధ నవలలు, పెద్ద కథలు, సీరియల్‌ నవలలు, వ్యాసాలు, పద్యాలు, పజిల్స్‌, జోక్స్‌, కార్టూన్లు మొదలైనవి అన్ని పత్రికల్లో వచ్చాయి. కథాసంపుటాలు, నవలలు, వ్యవసాయ వాచకాలు 20 పుస్తకాలు వెలువడ్డాయి. మరో 21 పుస్తకాలు ప్రచురణ దశలో ఉన్నాయి. వీటిల్లో పది కథాసంపుటాలు, రెండు నవలలు, మూడు బాలగేయ సంపుటాలు, తెలుగువీర శతకం, కవితా సంపుటి, బాలసాహిత్యం–నేటి అవసరం వ్యాసాలు, హాస్యకథలు, 50 చిన్నకథలు పుస్తకాలుగా రాబోతున్నాయి. 

లాలిపాప్‌ అనే యాప్‌ (గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి) కోసం అనేక కథలు, దేశనాయకుల చరిత్రలు, విజ్ఞాన విశేషాలు, సాంఘిక కథలు, చూడదగ్గ ప్రదేశాలు, జానపద కథలు, జీవిత చరిత్రలు రాశాను. ఇవన్నీ పిల్లలు హాయిగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో చూసుకోవచ్చు. ఐదు రోజుల వ్యవధిలో రాసిన ‘e–తరం కుర్రాడు’ ఆధునిక, వైజ్ఞాన, హాస్య నవలకు తానా నలభైవసంతాల (2017) పోటీల్లో బహుమతి లభించింది. వింత జలం, రైతు సింహాసనం, e-–తరం కుర్రోడు, ఊహలకే రెక్కలు వస్తే, ఆనందలోకం, వింత పెళ్ళి, వెండినాణెంలో వింతరాక్షసుడు, ముసుగువీరుడు...మొత్తం ఎనిమిది బాలల నవలలు రాశాను. 18కథలు, ‘మేలెరిగిన మనిషి’ నవల రెంటినీ కలిపి అదే టైటిల్‌తో నా మొదటి కథాసంకలనం విడుదల చేశాను. దీనికి 2012లో బాల సాహిత్య పరిషత్‌ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. 

తెలుగు రక్షణ వేదిక జాతీయ ప్రధానకార్యదర్శిగా అనేకచోట్ల కవులను పిలిచి కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ, వారి కవితలను సంకలనాలుగా తెస్తున్నాం. అలా మూడు సంకలనాలు తెచ్చాం. 2017 అక్టోబరు 14, 15, 16లలో అనంతపురంలో 33 గంటల44నిమిషాల 55 సెకన్లు నిర్వహించిన ‘ప్రపంచ రికార్డు కవిసమ్మేళనం’లో ఐదు వరల్డ్‌ రికార్డులు (భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆంధ్రా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తానా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఎన్టీఆర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌) నమోదయ్యాయి. 28 గంటలు సభానిర్వహణ చేసి వ్యక్తిగత రికార్డు కూడా సృష్టించాను.   

పిల్లల్ని లైబ్రరీకి పంపండి
అల్లరిచేసినప్పుడు పిల్లల్ని కేకలేసి వదిలేయడం సరైన పద్ధతి కాదు. పిల్లలకోసం తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలి. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, అతిథులను ఆదరించడం వంటి మంచి లక్షణాలు కథలరూపంలో చెప్పాలి. పిల్లల్ని లైబ్రరీకి తీసుకెళ్ళాలి. ఎలాంటి పుస్తకాలు చదవాలో నేర్పాలి. నెలనెలా సరుకులు తెచ్చుకున్నట్టుగానే పిల్లలకు పుస్తకాలు కొనివ్వాలి. మంచి పుస్తకం ఎంపిక చేసుకుని కొని చదువుకోవడం నేర్పాలి. సైన్స్‌ సంగతులపైన, తెలుగు భాషపైన మక్కువ పెంచాలి. అలా పిల్లల్లో బుక్‌ రీడింగ్‌ కెపాసిటీ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 

పుస్తకం చదవడంమీద గ్రిప్‌ వస్తే, స్కూలు పుస్తకాల్ని కూడా సులభంగా చదువగలుగుతారు. పెద్దలతో ఎలా మాట్లాడాలో, సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో, యుక్తిగా, చమత్కారంగా, అనర్గళంగా ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. క్లాసు పుస్తకాలు మాత్రమే చదివేవారికంటే, బాలసాహిత్యం చదివేవారిలో నాలెడ్జి, జ్ఞాపకశక్తి రెండింతలుంటుందని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది.

నారంశెట్టి బాలసాహిత్య పీఠం

పిల్లలకోసం నారంశెట్టి బాలసాహిత్యపీఠం ప్రారంభించాను. వారిని బాలసాహితీవేత్తలుగా తీర్చిదిద్దడం, వారి రచనలు ముద్రించడంతోపాటు బాలరచయితలకు నగదుపురస్కారాలిచ్చి ప్రోత్సహిస్తున్నాం. గత ఏడాది మూడు రాష్ర్టాల నుంచి ముగ్గురికి బాలసాహితీ జాతీయ పురస్కారాలిచ్చాం. ప్రతినెలా స్కూళ్ళకు వెళ్ళి బాలసాహిత్యం చదువుకునేలా విద్యార్థుల్ని మోటివేట్‌ చేస్తున్నాం. కథారచనలో మెళకువలు నేర్పుతున్నాం. 

బాలల ఆకాడమీని  పునరుద్ధరించాలి
సమాజంలో అకృత్యాలు పెరిగిపోవడానికీ, ఆరోగ్యకరమైన మానవసంబంధాలు లేకపోవడానికీ కారణం, బాలసాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. ప్రభుత్వమే బాలసాహిత్యాన్ని చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వం వెంటనే బాలల అకాడమీని, ‘బాలచంద్రిక’ పత్రికను పునరుద్ధరించాలి. నిర్మలమైన మనసు, మల్లెపూవంత స్వచ్ఛత చిన్నారుల సొంతం. అలాంటి పిల్లల్లో నీతి నిజాయతీ, ధైర్యం, మానవత్వం, సమాజంపట్ల భక్తిభావం కలిగించి, వారిలో పిరికితనం పోగొట్టి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతోనే నేను బాలలకోసం రచనలు చేస్తున్నాను. ఇప్పటి పిల్లలకు సరికొత్త ఆలోచనాపంథాలో కాల్పనిక సాహిత్యం అందించాలి. వారి వ్యక్తిత్వం వికసించేలా తార్కికజ్ఞానం, ఊహాశక్తి, భావుకత పెంపొందించేలా రచనలు చెయ్యాలి.

పిల్లల ఆత్మహత్యలు నివారించేది  బాలసాహిత్యం

ఇప్పటి పిల్లల్లో భయం, భక్తీ లేవు. పెద్దలపట్ల, గురువులపట్ల గౌరవమర్యాదలు పోతున్నాయి. టెక్నాలజీ నాలెడ్జ్‌ పెరిగేకొద్దీ, బాలసాహిత్యానికీ, మానవసంబంధాలకూ వారు దూరమవుతున్నారు. దీనివల్ల కొందరు పిల్లలు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుంటే, మరికొందరు పిల్లలు మార్కులు, మందలింపుల పేరిట ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలతో బాలసాహిత్యం చదివించడమే ఈ సమస్యలన్నింటికీ సులభ పరిష్కారం. దానివల్ల వారికి నిర్ణయ సామర్థ్యంతోపాటు కష్టపడి ఉన్నత స్థానానికి వెళ్ళాలనే దృక్పథం అలవడుతుంది.

కుటుంబం

1990ఫిబ్రవరిలో నా వివాహం జరిగింది. నా జీవన సహచరి అమ్మాజీ. ఉపాధ్యాయురాలు. నా మొదటి పాఠకురాలు. నా రచనా వ్యాసంగానికి సంపూర్ణ సహాయ సహకారాలందించే నా భాగస్వామి. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి నివేశ్‌. అమెజాన్‌లో ఉద్యోగం. అమ్మాయి సూర్యనిఖిత. అమెరికా ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌ చేస్తోంది. 

పురస్కారాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ ప్రతిభాపురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాతృభాషసేవా విశిష్ట పురస్కారం, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా గిడుగు అవార్డు అందుకున్నాను. 
‘కొలసాని చక్రపాణి’, ‘బాలనేస్తం’, ‘బాలబంధువు’ పురస్కారాలు, అమరావతీ విశిష్ట పురస్కారం, మంచుపల్లి సత్యవతి జాతీయ బాలసాహిత్య పురస్కారం, బాల సాహితీభూషణ్‌ బిరుదు, సమతారావు అవార్డు(తెనాలి) వంటివెన్నో లెక్కకు మిక్కిలిగా అవార్డులు లభించాయి. 
తెలుగు రక్షణ వేదిక జాతీయ ప్రధానకార్యదర్శిగా, ఉత్తరాంధ్ర రచయితల వేదిక అధ్యక్షునిగా, నారంశెట్టి బాలసాహిత్యపీఠం అధ్యక్షునిగా, బాలసాహిత్య పరిషత్‌ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తూ తెలుగుభాషకు సేవలు అందిస్తున్నాను.