నాటికీ నేటికీ ఎక్కువ మంది ప్రజలను, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనం సినిమాయే. ఈ రంగంలో దిగ్గజాలైన సినీ ప్రముఖులెందరో ఉంటారు. బాధ్యత గల ఒక ఫిలిమ్‌ జర్నలిస్టుగా వారందరితో కలిసి పనిచేసి తెలుగు సినీ పరిశ్రమ స్వర్ణయుగ చరిత్రలో తానూ ఒక శిలాక్షరమై ప్రయాణించినవారు బి.కె.ఈశ్వర్‌. ఒకవైపు సినీ జర్నలిస్టుగా మరోవైపు కథ, నవలా రచయితగా, పాటలు, మాటల రచయితగా కేంద్ర సాహిత్య అకాడమీ సత్కారం, బహుమతులు కూడా అందుకున్న ఈశ్వర్‌, విలువల కోసం తపనపడే పత్రికా రచయిత.కొన్ని సందర్భాల్లో ‘నొప్పింపక, తానొవ్వక....’ అన్నట్టుగా ప్రవర్తించినా, పాఠకులలో చవకబారు అభిరుచులు పెంపొందించేందుకు సినిమా జర్నలిజంలో ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదంటున్న బి.కె.ఈశ్వర్‌కు ఈ వారం నవ్య నీరాజనం.

బాల్యం

మా ఊరు విజయవాడ. 1948 ఏప్రిల్‌ 9వ తేదీన విజయవాడ మహంతీపురంలో నేను పుట్టాను. మా నాన్నగారు భైరతి పెంటయ్య, అమ్మ సూరమ్మ. ఒక అన్నయ్య, అక్కయ్య తర్వాత నేను పుట్టాను. నాకు అమ్మా నాన్నా పెట్టిన పేరు భైరతి కోటేశ్వరరావు. అదే సంక్షిప్త రూపంలో నా కలం పేరు బి.కె.ఈశ్వర్‌.మా నాన్నగారు అయ్యదేవర కాళేశ్వరరావు మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం చేసేవారు. మా అన్నయ్య విజయవాడ రైల్వే స్టేషన్‌లో కేటరింగ్‌ నడిపేవారు. ఎలాంటి సాహిత్య సుగంధం సోకని కుటుంబం మాది. అలాంటి కుటుంబం లోంచి ఎదిగిన నాకు ప్రపంచం అంటే ఏమిటో చూపించారు ఎర్రా నాగరాజుగారు.

విద్యాభ్యాసం

చాలా సాదాసీదాగా గడిపిన బాల్యం నాది. విజయవాడ ఒన్‌టౌన్‌లోని గాంధీజీ మున్సిపల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూలులోనే నా చదువు కొనసాగింది. మేం చదువుకునే రోజుల్లో వేదాంతం సుబ్రహ్మణ్యం అని మాకు అసిస్టెంట్‌ హెడ్మాష్టర్‌ ఉండేవారు. ఆయన ఎన్‌.టి.రామారావుకు కూడా గురువే. ఆయనలోని ప్రతిభను చూసినప్పుడు మా విద్యార్థులమంతా అబ్బురపడిపోయేవాళ్ళం. ఆయన ఎన్నో క్రీడలు ఆడేవాడు. మా చేత ఆటలు ఆడించేవాడు. పిల్లలకు అన్ని సబ్జెక్టుల పాఠాలు బోధించేవాడు. ఏ టీచరు సెలవు పెట్టినా ఆ రోజు ఆయన ఆ క్లాసుకు వెళ్ళి ఆ పాఠాలు చెప్పేవాడు.

కథలపట్ల అభిరుచి

అప్పట్లో మాకు స్కూల్లో నీతి బోధించడానికి ఒక పీరియడ్‌ ప్రత్యేకంగా ఉండేది. ఆ క్లాసుకు సుబ్రహ్మణ్యం మాష్టారే వచ్చేవారు. ఎన్నో కథలు చెప్పేవారు. తమకు తెలిసిన కథలు చెప్పమని పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఎవరూ ధైర్యంగా లేచి నిలబడేవారు కాదు. నేను లేచి నాకు తెలిసిన కథ చెప్పినప్పుడు..‘అదీ... అలా ధైర్యంగా కథ చెప్పడం నేర్చుకోవాలి’ అంటూ వెన్నుతట్టేవారు. ఆయన ప్రోత్సాహంతో అలా కథలు చదవడం ప్రారంభించాను. అలా చదువుతూ చదువుతూ బెంగుళూరు నుంచి వచ్చే ‘ప్రజామత’ పత్రికకు ధైర్యం చేసి ఒక కథ రాసి పంపించాను. రెండు వారాల తర్వాత అది ప్రచురితమైంది. అలా హైస్కూలు రోజుల్లోనే ఆ కథ అచ్చుకావడం నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.

నన్ను మద్రాసు చేర్చిన మార్గదర్శి

ఎస్‌ ఎస్‌ ఎల్‌ సి పూర్తి చేసిన తరువాత ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాను. ఆ సమయంలో నాకు తారసపడి నన్ను తీర్చిదిద్దారు నాగరాజుగారు. ఆయన సిల్కు బట్టల వ్యాపారి. ఆయన కొత్తగా చెరకు మొలాసిస్‌ వ్యాపారం ప్రారంభించారు. అప్పట్లో నాకు ఊళ్ళు తిరగాలని ఎంతో సరదాగా ఉండేది. తనతోపాటే నన్ను వెంట పెట్టుకుని ఊళ్ళు తిప్పేవారాయన. అలా చెన్నైలో ఆయన ప్రారంభించిన కొత్త వ్యాపారంలో 15, 16 యేళ్ళ వయసుకే సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా జేరాను. ఆయనే నన్ను సినిమాలకు తీసుకువెళ్ళేవాడు. లోకం పోకడ చెప్పేవాడు. ఒకసారి హిచ్‌కాక్‌ సైకో సినిమాకి వెళితే మరీ చిన్న కుర్రాణ్ణని నన్ను థియేటర్‌లోకి పంపకపోయేసరికి ఆయన గొడవ పెట్టుకుని మరీ నన్ను లోపలికి తీసుకెళ్ళి సినిమా చూపించారు.