అభ్యుదయ కవి, సీనియర్‌ జర్నలిస్టు శశికాంత శాతకర్ణి.పాఠకుడి మనసును హత్తుకోవాలంటే , కవికి భాషావైదుష్యంతోపాటు భావ తీవ్రత, శబ్దశక్తి ఉండాలని, అప్పుడే కవిత్వానికి సార్థకత చేకూరుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారాయన . కవి కీర్తిమీద వ్యామోహం కంటే కవిత్వం మీద ప్రేమతో మంచి కవిత్వం కోసం తపన చెందాలంటున్న శశికాంత శాతకర్ణి ఇంటర్వ్యూ..

నేను పుట్టింది పెరిగింది, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పిఠాపురంలోనే. అదే మా ఊరు.మా తండ్రిగారు విఖ్యాత వజ్రాయుధ కవి ఆవంత్స సోమసుందర్‌. తల్లి వేంకట రమణమ్మ. నాన్నగారి నిరంతర సాహిత్యాధ్యయనం, రచనా వ్యాసంగం, సాహిత్యవేత్తల చర్చలతో మా ఇల్లంతా పుస్తకాల వాతావరణంలో ఉండేది. ఆ కారణంగా నాకు చిన్నతనంలోనే పుస్తకాలంటే ప్రేమ, భాష అంటే మక్కువ ఏర్పడ్డాయి. ఆరోఏటనే జానపద సాహిత్యం చదివేవాణ్ణి. తిలక్‌ కవిత్వం ఎక్కువ చదివడంవల్ల భాషలో, భావ వ్యక్తీకరణలో పదాల ఒడుపులో తిలక్‌నే అనుసరించాలనే బలమైన కోరిక ఉండేది. భాష, పదాల పట్ల నాకు ప్రేమ, అనురక్తి పుట్టింది తిలక్‌ కవిత్వం వల్లనే. ఆయనే నా ఆదర్శం.

నాన్నగారు, తిలక్‌ సన్నిహితంగా ఉండేవారు. తిలక్‌ హఠాన్మరణంతో నాన్నగారు ఆయనపై అనేక వ్యాసాలు రాసి విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురించారు. ఆయన డిక్టేట్‌ చేస్తుంటే నేను రాసేవాడిని. అలా తిలక్‌ కవిత్వంతో మరింత గాఢానుబంధం ఏర్పడింది. శరత్‌ సాహిత్యం, ఆస్కార్‌వైల్డ్‌ నవలలు బాగా చదివాను. ‘పిక్చర్‌ ఆఫ్‌ ద డోరియన్‌ గ్రే’ నవల నాకు బాగా నచ్చింది. పదాలు విరిచి కొత్త అర్థాలు స్ఫురించేలా రాయడంలో ఆస్కార్‌వైల్డ్‌ అందెవేసిన చేయి. ఆయన రచనాపద్ధతి నాకు బాగా నచ్చింది. నాన్నగారు కమ్యూనిస్టుపార్టీ సభ్యులు కావడంవల్ల ఆ ప్రగతిశీల భావజాల ప్రభావం నా పైన ఉండేది.

పత్రికలో మొదటి కవిత

కాకినాడలో బిఎస్సీ చదువుతున్నప్పుడు, అమ్మాయిలను మానసిక వేధింపులకు గురిచేసే అబ్బాయిల గురించి కాలేజీ మ్యాగ్జైన్‌లో తిలక్‌ కవితకు అనుకరణగా, ‘ప్రేయర్‌’ కవిత రాశాను. ఆ కవిత మా కాలేజీలో నేను కోరుకున్న ప్రభావం చూపించింది. ‘కార్లెయిల్‌ డివైన్‌ కామెడీ’ ఆంగ్లపాఠం చదివి శాస్త్రీయ సంగీతంపై అభిరుచి పెంచుకుని ‘నిశ్శబ్ద సంగీతం’ అనే కవిత రాశాను. పురాణంవారు ఆ కవితను 1967లో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురించారు. పత్రికలో ప్రచురితమైన నా మొదటి కవిత అదే. ఆధునిక మానవుడు దారిద్ర్య మంటల్లో దగ్ధమైపోతున్నాడనే భావంతో రాసిన మరో కవిత ‘లంకా దహనం’ కూడా వెంటనే ప్రచురించారు.

ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఏ ఫిలాసఫీ చేస్తూ, అక్కడి గ్రంథాలయానికే అంకితమైపోయాను. క్లాసులు ఎగ్గొట్టి, టి.ఎస్‌.ఇలియట్‌, సిసిల్‌డేలూయీ, స్టీఫెన్‌ స్పెండర్‌ వంటి ఎంతోమంది కవుల కవిత్వం చదివేవాణ్ణి. దివిసీమ తుపాను భీభత్సంపై ‘జీవనౌకకు జలసమాథి’ అనే నా కవిత ఆంధ్రజ్యోతిలో నండూరి రామ్మోహనరావుగారు ప్రత్యేకంగా ప్రచురించారు. ఆ కవిత్వంలోని అత్యాధునిక వ్యక్తీకరణలపై నేను చదివిన ఆంగ్లకవుల ప్రభావం ఉంది.

తొలి కవితా సంకలనానికి ప్రముఖుల ప్రశంసలు

నా తొలి కవితా సంకలనం ‘చంద్రజ్యోతి’ 1979లో వెలువడింది. ‘బాగాయెనయ్యా నీ మాయలన్నీ...’ అనే త్యాగరాజకృతిని బాలమురళీకృష్ణ చంద్రజ్యోతి రాగంలో ఆలపించారు. నా కవితా సంకలనానికి ఆ రాగం పేరే పెట్టాను. ఈ సంకలనానికి ఎన్నో ప్రశంసలు లభించాయి. పురిపండా అప్పలస్వామిగారు దీనిని ‘పైకెగిరే పక్షుల గుంపుల్లాంటి పద చిత్రాలు’ అని ప్రశంసిస్తే, ‘కవిత్వంలో ఇది ఆమని వేకువ’ అని రోణంకి అప్పలస్వామిగారు ప్రశంసించారు.