ఆమె కథ చెబుతుంటే దృశ్యం మన కళ్ల ముందు కదలాడినట్టే ఉంటుంది. రాత్రిపూట నాన్న చెప్పే కథలు వింటూ... వివిధ సంస్కృతులు, కళలు, వైవిధ్యమైన జీవనశైలి పట్ల ఉన్న ఆసక్తిని ఆకళింపచేసుకుంటూ పెరిగిన దీపా కిరణ్‌ ఎనిమిదేళ్లకే స్టోరీ టెల్లర్‌ అవ్వాలని తన డైరీలో రాసుకున్నారట! కళలను, స్టోరీ టెల్లింగ్‌ను విడదీసి చూడలేననే ఈ గ్లోబల్‌ స్టోరీ టెల్లర్‌ ఈ కళకు సామాజిక బాధ్యతను ముడిపెట్టి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కథలు చెప్పే కళ ఎలా అబ్బిందో ఆమె మాటల్లోనే ..

నా దగ్గరకు ఒకరోజు ఒక చిన్నారి వచ్చింది. ‘మీతో ఒక విషయం చెప్పాలి ఆంటీ’ అంది. ఆ చిన్నారి చెప్పిన విషయం నన్ను విస్మయానికి గురి చేసింది. ఆ పాప చెప్పిన విషయం ఏమిటో తెలుసా... తనపై ఒక వ్యక్తి లైంగికంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని!! ఇంత సీరియస్‌ విషయాన్ని ఆ చిన్నారి తన అమ్మానాన్నలకు చెప్పలేదు. నా దగ్గరకు వచ్చి మరీ చెప్పింది...!! ఎందుకో తెలుసా.. ఆ పాపకు నా మీద విశ్వాసం, నమ్మకం కలిగింది కనుక. నాపై ఇంత నమ్మకాన్ని ఆ చిన్నారిలో కలిగించింది ఏమిటో తెలుసా? నా స్టోరీ టెల్లింగ్‌ కళే!!
 
ప్రతిష్ఠాత్మక స్కూలులో ఒక పిల్లాడు చదువు తున్నాడు. వాడి స్కూలు చుట్టూ రాళ్లు, గుట్టలు, కొండలు...! అవంటే ఆ పిల్లాడికి ఇష్టం లేదు. అందుకే అక్కడఆడుకునే వాడు కాదు. ఒకరోజు నేను రాక్స్‌ మధ్య వాటి గురించే పిల్లలకు ఒక స్టోరీ చెప్పాను. అక్కడికి ఆ బాలుడిని కూడా తల్లి తీసుకువచ్చింది. కొండలూ, రాళ్ల గురించి నేను చెప్పిన కథను ఆ పిల్లాడు బాగా ఎంజాయ్‌ చేశాడు. ఆ మర్నాడు స్నేహితులతో కలిసి తన స్కూలు సమీపంలోని కొండలు, గుట్టల మధ్య ఆడుకోవడానికి వెళ్లాడు. నేను చెప్పిన కథలోని పర్యావరణ సందేశం ఆ చిన్నారికి నచ్చింది.
 
ఇవి దీపాకిరణ్‌ చెప్పిన కొన్ని సంఘటనలు. చిన్నారులపై స్టోరీ టెల్లింగ్‌ ప్రభావం ఎంత శక్తివంతంగా ఉంటుందనే దానికి ఇవి కొన్ని మచ్చుతునకలు.
 
అందరినీ ఆకట్టుకునేలా...
దీపా కిరణ్‌ స్టోరీ టెల్లింగ్‌లో మాటల పొందిక, సౌందర్యం, చమక్కులతోపాటు నాట్యం, గానం, చిత్రలేఖనం, నాటకం వంటి లలితకళల మేళవింపు ఉంటుంది. వీటన్నింటి సమ్మిళితంతో దీప కథను చెబుతుంటే చిన్నారులు ఆమె వంక కళ్లప్పగించి చూస్తూ కథలో లీనమైపోతారు. ఆమె కథలు చెప్పే తీరులో ‘పెర్ఫార్మెన్స్‌ ఆర్ట్‌’ ప్రతిఫలిస్తుంది. కథలకు అనుగుణంగా అంతర్లీనంగా నర్మగర్భమైన సూచనలూ వాటిల్లో ఉంటాయి. సామాజిక సమస్యల మీద సైతం ‘స్పందనలు, సందేశాలు’ ఆమె స్టోరీ టెల్లింగ్‌లో తళుక్కుమంటాయి.
 
వన్నె తగ్గని మాటల ‘పసితనం’ ఆమె కథల్లో కనిపిస్తుంది. దీప కథలు చెప్పే విధానం ఆకట్టుకునేలా ఉండడానికి ఆమెలోని బహుముఖాలు కూడా ఒక కారణమే. ఆమె భరతనాట్య కళాకారిణి. గాయకురాలు, భాషావేత్త, బహు భాషల్లో ప్రవేశంతో పాటు ఎడ్యుకేషనిస్టు, వాయిస్‌ఓవర్‌ ఆర్టిస్టు కూడా. అలాగే చిన్నతనం నుంచి రచనలు చేసే అలవాటు కూడా దీపకు ఉంది. మంచి పుస్తక ప్రేమికురాలు. ఇవన్నీ ఆమె స్టోరీ టెల్లింగ్‌ కళా ప్రతిభను సానబెట్టాయి. అందుకే సంగీతం, నృత్యం, డ్రాయింగ్స్‌, డ్రామా అన్నింటి కలబోతగా ‘స్టోరీ టెల్లింగ్‌ ఉండాలి. మధ్యమధ్యలో శ్రోతలతో మాట్లాడుతూ...అందులో వారినీ భాగస్వా ములు చేస్తూ కథను ఆకర్షణీయంగా కొనసాగించాలి’ అంటారు దీప.
 
కథలంటే అంత ప్రేమేంటీ...
అసలు స్టోరీ టెల్లింగ్‌ వైపు దీప దృష్టి ఎలా మళ్లింది? ఇదే ప్రశ్న ఆమెను అడిగితే ‘కథల పట్ల ప్రేమ నా మనసులో ఎలా నాటుకుపోయిందో చెప్పడం కష్టమే. నాకు ఎనిమిదేళ్ల ప్రాయంలో నా డైరీలో ‘ఏదో ఒకరోజు నేను స్టోరీ టెల్లర్‌ను కావాలి’ అని రాసుకున్నాను. ఆ తర్వాత దాన్ని మర్చిపోయాను కూడా. కానీ నా జీవితం అటువైపే మళ్లడం విచిత్రం. అది కూడా అనుకోని మలుపులు తిరిగే అందమైన ‘కథ’ లాంటిదే. జీవితంలోని ప్రతి మలుపు, ఘటన, మాట, పాట, అనుబంధాలు, సంస్కృతి, కళలు, పరిసరాలు, కష్టాలు, కన్నీళ్లు, ఆశలు, లక్ష్యాలు అన్నింట్లోనూ అద్భుతమైన కథలు దాగున్నాయి. వాటిని గుండెతో ఒడిసి పట్టుకోవాలి. సరళమైన మాటల్లో పొదగాలి. పెర్ఫార్మెన్స్‌తో కథను చెప్పాలి’ అంటారామె.
 
బాల్యం నుంచీ దీప జీవితం బహుళ సంస్కృతుల మధ్యలో, వివిధ భాషలవారి మధ్య గడిచింది. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో తిరుగుతుండడం వల్ల పలు ప్రాంతాల ప్రజల జీవనశైలి తెలుసుకోగలిగారు. దీప చదివింది లిటరేచర్‌. వాళ్ల ఇంటి నిండా పుస్తకాలే. దీప నాన్న పుస్తక అభిమాని. ఆయన నుంచే పుస్తకాలు చదివే లక్షణం దీపకు అలవడింది. ఏ కొద్ది సమయం దొరికినా చాలు పుస్తకాలు పట్టుకుని కూర్చుంటారామె.
 
దాంతో భాషపై పట్టు, పద వైవిధ్యంతోపాటు, పదసౌందర్యాలను బాగా వంటబట్టించుకున్నారు. వివిధ రచయితల రచనలు ఆమె ఆలోచనా పరిధిని విస్తృతపరిచాయి. వరల్డ్‌ సినిమాలు, నాటకాలు, నృత్యప్రదర్శనలకు వెళ్లేవారు.
అలాంటి సృజనాత్మక వాతావరణం మధ్యన పెరగడం వల్లే నేడు దీప గ్లోబల్‌ స్టోరీ టెల్లర్‌గా ఎదిగారు. దీప గురించి చెప్పాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా అమ్మలు పిల్లలకు రాత్రిపూట కథలు చెబుతూ నిద్రపుచ్చుతారు. కానీ దీప విషయంలో ఇది రివర్స్‌ అయింది.
 
దీప నాన్నగారు ప్రతి రోజు రాత్రి ఆమెకి కథలు చెప్పేవారట. ‘మా అమ్మ భవానీకి కళలు, వివిధ సంస్కృతులంటే ఇష్టం. చాలా సెన్సిబుల్‌ వ్యక్తి. నేను కళలు నేర్చుకోవడంలో, వివిధ సంస్కృతులను వంటబట్టించుకోవడంలో ఆమే నాకు స్ఫూర్తి. నాన్న బాలసుబ్రమణ్యన్‌ నాకెన్నో సృజనాత్మక ఐడియాలు ఇచ్చేవారు’ అని తను పెరిగిన వాతావరణాన్ని దీప చెప్పుకొచ్చారు.
 
జానపద కథలు ఎక్కువ చెప్తా...
కథల పుస్తకాల గురించి మాట్లాడుతూ ‘ఇప్పటిలా మా చిన్నప్పుడు కథల పుస్తకాలు ఉండేవి కావు. నేను ఎక్కువగా పాశ్చత్య సాహిత్యం చదివాను. అమర చిత్ర కథ, ట్వింకిల్‌, కామిక్స్‌, రస్కిన్‌బాండ్‌ పుస్తకాలు, రష్యన్‌ పిల్లల సాహిత్యాన్ని బాగా చదివాను.
 
హిందూ యంగ్‌ వరల్డ్‌ నుంచి ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌ రచనలు చదివాను. నాకు చదవడం అంటే ఎంత పిచ్చి అంటే ఏ పుస్తకం లేకపోతే డిక్షనరీనైనా చదివేసేదాన్ని. పిల్లలకు కథలు చెప్పేటప్పుడు నేను తెలుసుకున్న పదసంపద ఎంతో ఉపయోగపడేది. దీనివల్ల పిల్లలకు క్లిష్టమైన కథను కూడా సింపుల్‌గా చెప్పగలగడం నేర్చుకున్నా’ అన్నారు.
 
చిన్నపిల్లలకు సులభంగా అర్థమయ్యేందుకు జంతువుల, మేజికల్‌ థీమ్స్‌తో ఉన్న కథలు... సీనియర్‌ సిటిజన్స్‌కు కాంప్లెక్స్‌ స్టోరీలు, మైండ్‌కు ఛాలెంజింగ్‌గా ఉండేవి... అడల్ట్స్‌కు రిఫ్లెక్టివ్‌ స్టోరీలు దీప చెప్తుంటారు. శ్రోతలు ఎవరన్న దాన్ని బట్టి కథ ‘ట్రీట్‌మెంట్‌’ ఉంటుందంటారామె. దీనిపై మాట్లాడుతూ ‘నా అభిప్రాయం ప్రకారం కథంటే ‘వే ఆఫ్‌ లైఫ్‌...’ అంటే మన జీవిత విధానాన్ని చెప్పేది. జీవితంలోని ఎన్నో అంతర్లీనమైన, సంక్లిష్టమైన విషయాలను తెలిపేది.
 
ప్రధానంగా జానపద కథలు ఎక్కువ చెప్తుంటాను. అవంటే నాకు చాలా ఇష్టం. అవి జనం నుంచి పుట్టిన కథలు. వారి వివేకాన్ని, జ్ఞానాన్ని అవి చాటుతాయి. జీవితం మనం అనుకున్నట్టు ఉండదు.
 
ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. పైగా జానపద కథలు నీతి సలహాలు ఇవ్వవు. జీవిత గమనాన్ని చెపుతూ అంతర్లీనంగా జీవించడమెలాగో చెప్తాయి. జీవితం ఎలా ఉంటే అలానే ఈ కథలు ఆవిష్కరిస్తాయి. జీవితంలోంచి పుట్టుకొచ్చిన సామెతలు వీటిల్లో ఉంటాయి. వాటిని నా స్టోరీ టెల్లింగ్‌లో ఉపయోగిస్తుంటాను. సూఫీ కాన్సెప్టును కూడా కథల్లో వాడతాను. మీరా, కబీర్‌ గీతాలను పాడుతూ కథా వర్ణన చేస్తాను. ఇవి కాకుండా సాహిత్య సంబంధమైనవి, పర్యావరణ సంబంధమైనవి, పక్షులు, వన్యప్రాణుల సంబంధమైనవి, నీరు, రాళ్లు వంటి ఎకాలజీకి సంబంధించిన అంశాలపై కూడా కథలు చెపుతాను. స్టోరీ టెల్లింగ్‌లో స్త్రీలు, పిల్లల సమస్యలపై సామాజిక కోణంలోంచి కూడా పరోక్షంగా తెలియజెబుతుంటాను’ అన్నారామె.
 
కథలు చెప్పడం గురించి చెబుతూ ‘స్టోరీ టెల్లింగ్‌ను చిన్నా, పెద్ద ఫన్‌లా ఆస్వాదిస్తారు. ఇటీవల స్కాట్‌లాండ్‌ కథోత్సవంలో భారత్‌ తరపున నేనొక్కదాన్నే పాల్గొనే అవకాశం దక్కింది. అతి పురాతన కాలం నుంచీ క్రమం తప్పకుండా అక్కడ ఈ అద్భుతమైన కథోత్సవం జరుగుతోంది. అలాంటి దాంట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పదకొండు రోజులు జరిగిన ఉత్సవంలో ఎనిమిది ప్రదర్శనలు ఇచ్చాను. గతంలో కూడా ఇరాన్‌, ఆస్ట్రియా, నార్వే, థాయ్‌లాండ్‌ వంటి పలు దేశాల్లో కథోత్సవాల్లో పాల్గొన్నాను. నాకు స్టోరీ టెల్లింగ్‌ అంటే ఎంత ఇష్టమంటే.... బేబీకి టాయ్‌ ఇచ్చినంత’ అన్నారు.
 
దీప గురించి మరికొంత...
అంతర్జాతీయంగా పేరొందిన ప్రొఫెషనల్‌ స్టోరీ టెల్లర్‌.
‘స్టోరీ ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థాపకురాలు.
న్యూట్రిషన్‌ అండ్‌ క్లినికల్‌ డయటిక్స్‌లో బ్యాచిలర్‌.
నాన్‌-ఎకడమిక్స్‌లో భరతనాట్యం కోర్సు చేశారు.
భారత్‌లోని పలు స్కూళ్లల్లో శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు.
ఆస్ట్రియా, గ్రీస్‌, స్కాట్‌లాండ్‌, ఇరాన్‌లలో స్టోరీ టెల్లింగ్‌ ఉత్సవాలకు వెళ్లిన తొలి భారతీయురాలు.