జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమంటున్న మాధవ్‌

16-02-2018: కృతులైనా... సంకీర్తనలైనా ఇట్టే పట్టేస్తాడు...ఒక్కసారి పాట వింటే అసలు గాయకులను మైమరపిస్తాడు...23 ఏళ్ళకే 900 కార్యక్రమాలను నిర్వహించిన ఘనుడు.  పాట ఏదైనా అతని స్వరం నుంచి వెలువడితే మాతృక పాడిన గాయకుడే వచ్చి పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే.. కఠిన పదాలతో కూడిన చరకాలు అయినా పద్యాలైనా... సంకీర్తనలైనా.. కృతులైనా అతను ఆలపిస్తే మైమరచి పోవాల్సిందే... చూపు లేకపోయినా జ్ఞాపకశక్తినే ఆయుధంగా గ్రాహక శక్తిగా మలుచుకుని వందల సంఖ్యలో తెలుగు, హిందీ సినీ గీతాలను అక్షరం పొల్లుబోకుండా శ్రావ్యమైన కంఠస్వరంతో పాడుతూ సినీ దిగ్గజాల నుంచి, రాజకీయ నేతలనుంచి మెప్పు పొందాడు. గానంతోపాటు సంగీత దర్శకత్వం కూడా నిర్వహిస్తూ భవిష్యత్తులో సంగీతప్రపంచంలో, సినీ వినీలాకాశంలో ఎదిగేందుకు అతను చేస్తున్న కృషి అద్వితీయం. అతనే అంధ యువగాయకుడు సూరావర్జల మాధవ్‌. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న అతనిపై ఆంధ్రజ్యోతి’ కథనం...

మాధవ్‌కు జ్ఞాపకశక్తి అమోఘం. ఒక పాటను రెండుసార్లు విన్నారంటే దానిని కంఠతా పాడే సత్తా మాధవ్‌ది. అలా తెలుగులో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, హిందీ గాయకులు కిశోర్‌కుమార్‌, మహ్మద్‌ రఫీలతోపాటు సంగీత దర్శకులు ఏఆర్‌ రహమాన్‌, ఇళయరాజా తదితర గాయకులు, సంగీతదర్శకులకు సంబంధించిన కొన్ని వందల కొత్త, పాత చిత్రాల గీతాలను తన జ్ఞాపకశక్తితో ఎలాంటి పొల్లుపోకుండా పాడగల ప్రతిభను మాధవ్‌ తన సొంతం చేసుకున్నారు. అదేవిధంగా మన దేశంలోని పలు రాష్ట్రాల్లో దాదాపు 900 కార్యక్రమాలను నిర్వహించారు. సంగీతమే తన ప్రపంచం అనుకునే మాధవ్‌ కుటుంబనేపథ్యం అతనికి పాటలు, సంగీతంపై కలిగిన అభిమానానికి సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ విజయనగరంలో నివసించే సూరావర్జల రామచంద్ర, సూరవర్జల విజయలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్దార్థ కాగా చిన్న కుమారుడు మాధవ్‌. 1994 సెప్టెంబర్‌ 10న పుట్టిన మాధవ్‌కు ఎనిమిదవ ఏటనే అంటే మూడో తరగతి చదివే సమయంలోనే రెటీనైటిస్‌ పిగ్మెంటోస వ్యాధి సోకింది. కళ్ళు మసకమసకగా కనిపించడం మొదలైంది. ఆ వ్యాధికి ఎలాంటి వైద్యం లేకపోవడంతో ఇక చేసేదేమీలేక మాధవ్‌ తన జ్ఞాపకశక్తినే ఆయుధంగా చేసుకున్నారు. గీతాలతోపాటు తను చదువుకునే తరగతి పుస్తకాలలోని పాఠాలను, ప్రశ్నలకు జవాబులను కూడా ఒకటికి రెండుసార్లు వినేవారు. తండ్రి రామచంద్ర ప్రతి తరగతిలో సబ్జెక్టుల పుస్తకాలలోని పాఠాలను చదివి వినిపిస్తే వాటిని గుర్తుపెట్టుకుని త్రైమాసిక, అర్ధసంవత్సర, వార్షిక పరీక్షలు రాసేవారు. అదే క్రమంలో 2009లో పదో తరగతి పరీక్ష రాసే సమయంలో మాధవ్‌ విషయం తెలుసుకున్న ప్రభుత్వం అతనికి స్కైబర్‌ అవకాశాన్ని కల్పించింది. అలా అతను పదో తరగతిలో ఫస్ట్‌ డివిజన్‌లో పాస్‌ అయి అందరి ప్రశంసలు అందుకున్నారు.

అనంతరం విజయనగరం మహరాజా కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ కాలేజీలో చేరి 2010లో గాత్రసంగీతంలో డిప్లొమా పూర్తిచేశారు. 2009లోనే ఓ ప్రయివేట్‌ ఛానల్‌ వారు విజువల్లీ ఛాలెంజ్‌డ్‌ వారికోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు విజేతల్లో ఒకరుగా నిలిచి సినీ దర్శకులు కె.విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు, సినీనటి లయ, సినీ గేయరచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరామ్‌, ప్రముఖ గాయకులు డీవీ మోహనకృష్ణ, యాంకర్‌ ఝాన్సీ, సినీ దర్శకులు కృష్ణవంశీ, సినీనటుడు తరుణ్‌లచే ప్రశంసలు అందుకున్నారు.