‘పువ్వు పుట్టగనే పరిమళించును’ అన్నట్టుగా చిత్రకళను ప్రకృతివరంగా పొందిన చిత్రకారుడు పూరి వెంకట రమణమూర్తిరాజు .పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న రాజు శ్రీశ్రీ మెచ్చిన కార్టూనిస్టు కావడం విశేషం.బాల్యం నుంచీ కలలో, ఇలలో, ఆహార విహారాల్లో కూడా చిత్రకళే పరమావధిగా ఎంచి నిరంతర సాధనతో మంచి కార్టూనిస్టుగా, పెయింటర్‌గా ఎదిగిన రాజు ఇంటర్వ్యూ ...

చిత్రకారుడు కావచ్చు లేదా ఏ ఇతర కళాకారుడైనాగానీ సంస్కృతిని ప్రతిబింబిస్తాడు. అతడి కృషి చిత్రకళ రూపంలో చరిత్రలో నిక్షిప్తమైపోతుంది. సమకాలీన సమాజచిత్రణను భవిష్యత్‌ తరాలకు అందిస్తాడు చిత్రకళాకారుడు. ఏ కళ అయినా వచ్చేది పల్లె జీవితం నుంచే. దీనినే ఇప్పుడు కార్పొరేట్‌ రంగం మోడ్రనైజ్‌ చేస్తోంది.‘‘చిత్రకళ ఎప్పటికీ అంతరించిపోదు. టాలెంట్‌ను మార్కెట్‌ చేసుకోలేని చిత్రకారుడు ఎన్నటికీ నిరుత్సాహ పడకూడదు, చిత్రకళ కొంతమందికి ఒక గొప్ప వరంగా స్వతఃసిద్ధంగా అబ్బుతుంది. అంతగొప్ప కళను సొంతం చేసుకున్న కళాకారుడు ఎన్ని కష్టాలు ఎదురైనా, మరో దృష్టి లేకుండా తన టాలెంట్‌ను కాపాడుకోవాలి.

నిరంతర సాధనతో తనను తాను చిత్రకళాకారుడుగా నిలబెట్టుకున్నవారే ఉన్నత‍‌శిఖరాలనధిరోహిస్తారు ప్రతి చిత్రకారుడికి తనదైన శైలి, ఎవరినీ అనుకరించని సరికొత్త శైలిని సమకూర్చుకోగలిగితే ఆ చిత్రకళాకారుడు కచ్చితంగా ప్రజల గుర్తింపు పొందుతాడు’’ అనేదే రాజు స్థిరాభిప్రాయం.ఒక ప్రకృతి దృశ్యం, పచ్చికబయలు, సౌందర్యరాశి....ఇలా పలు చిత్రాలు మనిషికి ఒక గొప్ప ఆనందాన్నిస్తాయి. అంతగొప్ప కళను సమాజానికి అందించే చిత్రకారుడు ఎప్పుడూ సామాన్యులకంటే డిఫరెంట్‌గానే ఆలోచిస్తారు అంటారు రాజు.

కూనగా ఉన్నప్పుడే కుంచె పట్టి...

చాలా చిన్న వయసులోనే కుంచె పట్టి బొమ్మలు వేశారు రాజు. 1959 ఆగస్టు 11వ తేదీన విజయనగరం జిల్లా గర్బాం గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి ఈపూరి సత్యనారాయణరాజు. మాంగనీసు మైన్స్‌లో మేనేజర్‌గా పని చేశారు. ఆయన తల్లి రాజేశ్వరి. ఏడుగురు సంతానంలో రాజు ఆరోవారు. ఇద్దరు అక్కయ్యలు, ఐదుగురు అన్నదమ్ములు.బాల్యంలోనే రాజుకు పితృవియోగం కలగడంతో ఆయన అన్నయ్యలు నారాయణమూర్తిరాజు, కృష్ణమూర్తిరాజు బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబం విజయవాడకు తరలి వచ్చింది. అక్కడే రాజు చదువు కొనసాగింది. ఆయన రెండో అన్నయ్య చిత్రాలు గీస్తూ ఉండటంతో రాజుకు మరింత ప్రోత్సాహం లభించినట్టైంది. రాజుకు ఎప్పుడూ ఆయనకు బొమ్మలు గీయడంపైనే ఆసక్తి చూపించేవారు. క్లాసులో పాఠం వినకుండా బొమ్మలు గీసుకునేవారు. ఇంట్లోవాళ్ళను ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్ళ స్కెచెస్‌ గీసేవారు.

ఇంట్లో కుర్చీలు, కుండలు, రెపరెపలాడే జెండాలు, సైన్సు పుస్తకంలో బొమ్మలు...ఇలా కాదేదీ చిత్రణకనర్హం అన్నచందంగా తనకు తెలియకుండానే రాజు నిరంతర సాధన చేసేవారు. స్కూల్లో ఎన్నో బహుమతులు వచ్చేవి. సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లో మ్యాగజైన్స్‌ కొనుక్కుని వాటిల్లో బొమ్మలు ప్రాక్టీస్‌ చేసేవారు. పలు పత్రికల్లో చంద్ర, జయదేవ్‌ లాంటివారి బొమ్మలు అనుకరిస్తూ, ఆ తరహాలో ఆర్టిస్టు కావాలని కోరుకునేవారు. ఆ కోరికతోనే విజయవాడలో ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్ళి బాలి, ఈవిఆర్‌, పి.ఎస్‌.బాబు లాంటి ఆర్టిస్టు కలిసేవారు. వాళ్ళందరినీ ఆరాధిస్తూ, అక్కడే కూర్చుని వారు ఎలా గీస్తున్నారో గమనించేవారు.