కవయిత్రి, కథకురాలు రేణుక అయోల. ట్రాన్స్‌జెండర్స్‌పై దీర్ఘ కావ్యం రాసిన తొలి తెలుగు కవయిత్రి ఆమె. సమాజంలో విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరంగా మానసిక చిత్రహింస అనుభవిస్తున్న ట్రాన్స్‌జెండర్స్‌ (హిజ్రా)ను కనీసం మనుషులుగా గుర్తించాలంటారు. సమాజంలో వారికి సమాన హోదా ఇవ్వాలనీ, అప్పుడే మనం మనుషులం అనిపించుకుంటామనీ ఆవేదన వ్యక్తం చేస్తున్న రేణుక అయోల ఇంటర్వ్యూ...

నేను ఒరిస్సా రాష్ట్రం కటక్‌లో జనవరి 17న పుట్టాను. నాన్నగారు గంటి కపర్ది. అమ్మ హేమలత. శ్రీకావ్యకంఠ గణపతిమునిగారి మనుమరాలిని. నాకో తమ్ముడు, చెల్లెలు. నాన్నగారు హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో పనిచేసేవారు. అందువల్ల నా బాల్యం, చదువు అంతా హైదరాబాద్‌లోనే. మా ఇంటి నిండా పుస్తకాలే. ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. మా నాయనమ్మ కాశీమజిలీకథలు సహా చార్లెస్‌ డికెన్స్‌, అలెక్స్‌హెలీ ‘రూట్స్‌’ లాంటి ఆంగ్లసాహిత్యం బాగా చదివేవారు. నాన్నగారు భోజనం చేసేటప్పుడు కూడా పుస్తకాలు చదువుకునేవారు.బాల్యం నుంచీ పుస్తకపఠనం చేసేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, శరత్‌ సాహిత్యం, చలం సాహిత్యం అన్నీ చదివేదాన్ని. చలం సాహిత్యం చదివితే మా ఇంట్లో ఎలాంటి అభ్యంతరం పెట్టేవారు కాదు.

స్కూలు పూర్తయ్యాక మలక్‌పేట కాలనీ లైబ్రరీకి వెళ్ళేదాన్ని. టెన్త్‌లో డ్రాయింగ్‌వేసి, దానికి తగినట్టుగా కింద కవితరాసి స్నేహితులకు బహుమతులిచ్చేదాన్ని.ప్రముఖ రచయిత చెరబండరాజు మా టీచర్‌. నా తొలి కవితను ఆయనకే చూపించి బ్లెస్సింగ్స్‌ పొందాను. ఇంటర్మీడియట్‌లో ఉండగా వనితామహావిద్యాలయంలో ప్రముఖ రచయిత్రి వాసా ప్రభావతి మాకు తెలుగు పాఠాలు చెప్పేవారు. బి.ఏ వరకు చదివాను.నా కవిత్వంజీవితభాగస్వామితో కలిసి మధ్యప్రదేశ్‌లో చాలా కాలం ఉన్నాను. అక్కడ తెలుగు వాతావరణం లేకపోవడంతో, ఇక్కడినుంచే లిటరేచర్‌ తీసుకెళ్ళేదాన్ని. మహిళాజ్యోతి పత్రికలో వ్యాసాలు రాసేదాన్ని. 2010లో ‘ఆయన’కు బదిలీ కావడంతో హైదరాబాద్‌ చేరుకున్నాం. మొదట్లో నేను కథలే ఎక్కువ రాశాను. ఆ తర్వాత పూర్తిగా కవిత్వం మీదే నా దృష్టి కేంద్రీకరించాను.నేను రాసిన ‘ఓ చినుకు’ అనే నా తొలి కవిత ‘విపుల’ మాసపత్రిక ముషాయిరాలో వెలువడింది. భర్తను కోల్పోయిన స్ర్తీల పరిస్థితిపై నేను రాసిన ఆ కవిత పెద్ద వాదోపవాదాలకు, విమర్శలకు తెరతీసింది.

నా తొలి కవితా సంపుటి ‘లోపలిస్వరం’. ప్రముఖ రచయిత శీలా వీర్రాజు దీనిని ఆవిష్కరించారు. నా రెండో కవితా సంపుటి ‘పడవలో చిన్నదీపం’. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ఆవిష్కరించారు. మూడో కవితా సంపుటి ‘మూడో మనిషి’ కూడా ఆయనే ఆవిష్కరించారు. నా కవిత్వంలో ఎక్కువగా ప్రకృతి ఆరాధన, మానవత్వం, మానవ సంబంధాలే ఉంటాయి. నా మూడు కవితా సంపుటిలపైనా ప్రముఖ రచయిత సౌభాగ్యగారు చేసిన సమగ్ర విశ్లేషణ కూడా ఒక పుస్తకంగా వెలువడింది.కథాసంకలనంనేను మొట్టమొదట ఎక్కువగా కథలే రాశాను. ‘భూమిక’ స్ర్తీవాద పత్రిక నిర్వహించిన పోటీల్లో నా కథ ‘డైరీ’కి ప్రథమ బహుమతి వచ్చింది. ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికవారి పోటీల్లో ‘నాదికాని వెన్నెల’ కథకు బహుమతి లభించింది. నా కథలన్నీ 2008లో ‘నాది కాని వెన్నెల్లో’ అనే శీర్షికతో కథాసంకలనంగా వెలువడ్డాయి.