‘మా చిన్నప్పుడయితే ఇసుక గూళ్లు కట్టుకుని... మట్టితో బొమ్మలు చేసి ఎంత బాగా ఆడుకునేవాళ్లమో... ఈ తరం పిల్లలు అవన్నీ కోల్పోతున్నారు’ అని అంటున్నారా.... అచ్చం ఇలానే ఆలోచించారు డాక్టర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబు. తనకొచ్చిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టారు. అందుకు ప్రతిరూపమే పాతికేళ్లు పూర్తి చేసుకున్న ‘బాలోత్సవ్‌’ పండగ. ‘ఇది ఖమ్మం జిల్లాలోని మా కొత్తగూడెం పండగ’ అని గర్వంగా చెప్తారాయన. 
 
‘‘మా కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున దాదాపు ఒక ఎకరా స్థలంలో ‘కొత్తగూడెం క్లబ్‌’ ఉంది. 1991లో ఆ క్లబ్‌ సెక్రటరీ బాధ్యతలు నాకు అప్పగించారు. అప్పటివరకు ఆ క్లబ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు రిక్రియేషన్‌ ఫెసిలిటీలు ఏర్పాటు చేసేందుకే పరిమితమైంది. నేను సెక్రెటరీగా ఎంపికయ్యాక కొద్దిమందికే పరిమితమైన ఈ క్లబ్‌ సేవల్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నాను. పిల్లలకోసం ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. ఈ ఆలోచనకు కారణం నేను గ్రామీణ వాతావరణంలో పెరగడమే. మాది ఉమ్మడి కుటుంబం కూడా. మా ఊరంతా ఒక కుటుంబంలా ఉండేది. మా అమ్మగారిది మధిర పక్కన మాదేపురం, మా నాన్నగారిది గుంటూరు దగ్గర తెనాలి. గ్రామీణ వాతావరణంలో పెరిగిన నేను బాల్యాన్ని హాయిగా ఆస్వాదించాను. అది ఇప్పటి పిల్లలకు లేకుండా పోయింది. అంతా తరగతి గదుల్లో బందీలైపోయారు. అందుకని పిల్లల కోసం ఏదైనా చేస్తే బాగుండనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన మొదటి సంవత్సరం పట్టణ స్థాయి ప్రభుత్వ పాఠశాల పిల్లలతో ప్రారంభించాం. నాలుగు అంశాలు, వందమంది పిల్లలతో మొదటి ‘బాలోత్సవా’నికి బీజం పడింది. అప్పుడు బాలోత్సవం అనే పేరు కూడా లేదు. ‘పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు’ అనే వాళ్లం. ఆ కార్యక్రమం చూసిన పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ‘ఈ వేదిక బాగుంది. మా అందరికీ ఇందులో అవకాశం కల్పించాలి’ అనడంతో ప్రారంభించి రెండేళ్ల తరువాత మండల స్థాయికి తీసుకెళ్లాం. ఆ తరువాత జిల్లాస్థాయికి చేరుకుంది. 
 
ఇలాంటి వేదిక లేదన్నారు
ప్రారంభంలో భోజన సదుపాయం ఉండేది కాదు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చినవాళ్లు కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయేవాళ్లు. 2000 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే దీనికి ‘బాలోత్సవ్‌’ అని నామకరణం చేశాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. రాష్ట్రస్థాయిలో చేసిన మొదటి సంవత్సరం పది జిల్లాల నుంచి పిల్లలు వచ్చారు. ఆ తరువాత మొత్తం రాష్ట్రమంతటి నుంచీ పిల్లలు రావడం మొదలైంది. పిల్లలకోసం ప్రత్యేకంగా ఇలాంటి వేదిక ఒకటి ఇప్పటివరకు లేదన్న టాక్‌ వచ్చింది. మా కార్యక్రమాల్లో క్లాసికల్‌, జానపద నృత్యాల వంటి ప్రదర్శనా కళలతో పాటు మాతృభాష మీద మమకారం పెంచేవి, సాహిత్యంవైపు పిల్లల్ని తీసుకెళ్లే కార్యక్రమాలు ఉంటాయి. 
 
పోటీలంటే రారు
కథలు చదివే అలవాటు ఉన్న నా తోటి డాక్టర్లు, లాయర్లతో కలిసి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ‘కథా విశ్లేషణ’ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇందులో ఒక కథ ఇచ్చి పిల్లల్ని విశ్లేషించమంటాం. దీనికి పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి రచయితలను పిలవడం మొదలుపెట్టాం. ఇందులో పేరుకు పోటీనే కాని సీరియ్‌సగా పోటీలు జరిగేది మాత్రం ప్రదర్శనా కళల్లోనే. ప్రదర్శనా కళల్లో పోటీలు లేకపోతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రారు. అదే సాహిత్యం విషయానికి వచ్చేసరికి పోటీలంటే రారు. నేర్చుకోవడానికి వస్తారు. సాహిత్యం రుచి ఒకసారి చూపిస్తే... అది రుచి మరిగిన పిల్లలు దాన్నుంచి బయటికి పోరు. అనేకమంది కవులు, కథారచయితలు వస్తారు బాలోత్సవానికి. ‘అనగనగా’ అనే టైటిల్‌తో ‘కథారచన’ మొదలుపెట్టాం. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గర కథలు నేర్చుకుని చెప్తారు. ఇది మొదలుపెట్టాక తాత, అమ్మమ్మ, నానమ్మల ఒళ్లో కూర్చోవడం మర్చిపోయిన పిల్లలు మళ్లీ వాళ్ల దగ్గరకి వెళ్లి కథలు చెప్పించుకోవడం మొదలుపెట్టారు. 
 
అమోఘంగా రాస్తారు
కథలు చెప్పడం వల్ల బోలెడు లాభాలు ఉంటాయి. నాలుగైదేళ్ల పిల్లలు వందలాది మంది ముందు నిల్చొని కథ చెప్పడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నలుగురిలో మాట్లాడే ధైర్యం వస్తుంది. మాతృభాష మీద పట్టు ఉంటుంది. ధారణ ఉంటుంది. భాషలో పట్టు ఉంటే అనర్గళంగా మాట్లాడతారు. పిల్లల కోసం చేసే ఈ కార్యక్రమంలో ఏ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసినా అది పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందనేది క్షుణ్ణంగా ఆలోచిస్తాం. కథా రచనను వర్క్‌షాప్‌లా చేస్తాం. కథ ఎలా రాయాలి, కథా వస్తువు ఏంటి, ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముగించాలి వంటి అంశాల్ని ప్రముఖ కథా రచయితలు చెప్తారు. ఆ తరువాత ఒక స్టోరీలైన్‌ ఇచ్చి పిల్లల్ని వెంటనే రాయమంటాం. ఇప్పుడు దాదాపు 500 మంది పిల్లలు కథలు రాస్తున్నారు. కథలు, కవితలే కాకుండా ఒక అంశం ఇచ్చి అన్య భాషా పదాలు దొర్లకుండా తెలుగు భాషలోనే మాట్లాడమంటాం. మా బాలోత్సవ్‌ ఉద్దేశం - తెలుగు భాష మీద మమకారం పెంచి, సాహిత్యం దిశగా పిల్లల్ని నడిపించడమే. మట్టికి దూరమైన పిల్లల్ని మళ్లీ మట్టికి దగ్గరకి తెచ్చే ప్రయత్నం. 
 
యజ్ఙంలా చేస్తున్నాం
ఈ పాతికేళ్లలో మేం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఆశించకుండానే కార్యక్రమాలు నిర్వహించాం. గత పదిహేనేళ్లుగా కెసిపి సిమెంట్స్‌ ఇందిరాదత, నోవా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ సాంబశివరావు సాయం చేస్తున్నారు. మేము, కొందరు డాక్టర్లం కలిసి స్వచ్ఛందంగా ఇస్తుంటాం. మా అన్నయ్య కొడుకు శ్రీనివాస్‌ గత పది సంవత్సరాలుగా పిల్లలందరికీ భోజనాలు పెడుతున్నాడు. 
 
ఇష్టపడి చేసుకునే పండగ
వేలమంది పిల్లలకు ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తున్నామంటే అది అందరి సహకారం వల్లనే. ఇందుకు కొత్తగూడెం పట్టణాన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇది మా ఊరి పండగ. ఈ ఊళ్లో అనేక పార్టీలు, కార్మిక సంఘాలు ఉన్నాయి. ప్రతి పార్టీ కార్యాలయం, ఊళ్లో ఉన్న కళ్యాణమండపాలు అన్నీ పిల్లల కోసం కేటాయిస్తారు. కొందరయితే కార్యక్రమానికి వచ్చిన పిల్లల్ని వాళ్ల ఇళ్లకి తీసుకెళ్తారు. సింగరేణిలో పనిచేసి రిటైర్‌ అయిన మాధవరావు బాలోత్సవ్‌ జరిగే మూడు రోజులు నిద్రపోరు. పిల్లలందరికీ దగ్గరుండి ప్రేమగా భోజనాలు పెట్టిస్తారాయన. అలాగే ఛటర్జీ, శర్మ, చంద్రశేఖర్‌... ఇలా వీళ్లే కాకుండా ఇక్కడి నుంచి వెళ్లి ఎక్కడెక్కడో సెటిలయిన వాళ్లు 250 మంది వరకు ఉన్నారు. వాళ్లంతా బాలోత్సవ్‌ కోసం వస్తారు. ఇక్కడుండి అందరూ కలిసి సమష్టి కృషి చేస్తారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు పిల్లలకి అవకాశం. ఈసారి ఢిల్లీ నుంచి ఆరు పాఠశాలల పిల్లలు రిప్రజెంట్‌ చేశారు. అమెరికా, ఆస్ర్టేలియా నుంచి సెలవులకి వచ్చిన పిల్లలు పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు ఊరూరా జరగాలనేది మా కోరిక. ఇప్పటికయితే మధిర, కాకినాడ, భద్రాచలం, చర్ల, సిరిసిల్లలో జరుగుతున్నాయి. ఏలూరు, గుంటూరు, విజయవాడలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదో ఉద్యమంలా సాగాలి’’.
నేను తెనాలిలో తాలూకా హైస్కూల్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాను. కర్ణాటకలోని బెల్గాంలో ఎంబిబిఎస్‌ చేశాను. పంజాబ్‌లోని అమృతసర్‌లో ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌ చేశాను. అక్కడే ఫిరోజ్‌పూర్‌ మిషన్‌ హాస్పిటల్‌లో రెండేళ్లు సర్జన్‌గా పనిచేశాను. 1977లో కొత్తగూడెం వచ్చి స్థిరపడి జనరల్‌ సర్జన్‌గా ప్రాక్టీసు చేస్తున్నాను.
కిరణ్మయి