ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌: తెలుగు, హిందీ చిత్రాలలో నటించిన ప్రముఖ హీరోయిన్‌ సోనాలీ బింద్రే ఇటీవల రచయితగా కూడా మారారు. పిల్లల పెంపకానికి సంబంధించి ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ)నిర్వహించిన ఛేంజ్‌ ఆఫ్‌ గార్డ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె పలు అంశాలను ముచ్చటించారు. 

నేను బుక్‌ లవర్‌ను. విపరీతంగా పుస్తకాలు చదువుతాను. అది నాకిష్టమైన వ్యాపకం కూడా. ఓ పుస్తకం చదివిన వెంటనే వన్‌ మోర్‌ బుక్‌ అనే తత్త్వం నాది. ఇప్పటి తరానికి పుస్తకాలు చదివే తీరిక లేదు. టీవీ, కంప్యూటర్‌, సోషల్‌ మీడియా.. ఇలా ఎన్నో అంశాలు వీరి సమయాన్ని మింగేస్తున్నాయి. కానీ ఓ మంచి పుస్తకం చదవడం వల్ల పొందే జ్ఞానం అపారమైనదని నమ్ముతాను. అందుకే సోషల్‌ మీడియాపై సోనాలీస్‌ బుక్‌ క్లబ్‌ పేరిట ఓ బుక్‌ క్లబ్‌ ప్రారంభించా. ఇందులో పుస్తకాలు చదివే అలవాటును వృద్ధి చేసుకోమంటూనే మంచి పుస్తకాల గురించి చర్చలు కూడా చేస్తుంటాం.
 
రచయితగా.. 
నేను ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాను. కానీ ఎప్పుడూ కూడా నా ఫొటో ఓ రచయితగా పుస్తకంపై పబ్లిష్‌ అవుతుందని ఊహించలేదు. కానీ ‘ద మోడ్రన్‌ గురుకుల్‌ .. మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ పేరెంటింగ్‌ ’ ద్వారా నా ఫోటోను చూసుకుని ఆశ్చర్యపోయా. 

ఫిక్షన్‌ మాత్రం కాదు.. 
నాకు ఫిక్షన్‌ రాయడం రాదు. చదువుతాను. కానీ ఫిక్షన్‌ చాలా కష్టం. నిజానికి రచన చేయడమంటేనే చాలాకష్టం. దానికి ఎంతో ఓపిక, చెప్పాలనుకున్న అంశాలను అందంగా చెప్పగల నేర్పు.. చాలా టైం పడుతుంది. నా రెండో పుస్తకానికి ఓ లైన్‌ అనుకున్నాను. కానీ రాయడానికి ఇంకా టైమ్‌ పడుతుంది.
 
సూచన చేసేంత లేదు.. 
నా మొదటి పుస్తకం పేరెంటింగ్‌ మీద నేరాసినా దానిలో ఎక్కడా తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వలేదు. నిజానికి అంత అనుభవం నాకు లేదు. అసలు పేరెంటింగ్‌ అనేది ఇండివిడ్యులిస్టిక్‌ అంశం. ఇంటిలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరూ విభిన్నంగా ఉంటారు. వారిని పెంచే రీతి కూడా విభిన్నంగానే ఉంటుంది. నా పిల్లల విషయంలో నాకు వచ్చిన సందేహాలు.. అనుభవం ద్వారా వాటికి తెలుసుకున్న సమాధానాలు మాత్రమే వాటిలో ఉంటాయి. అవి కొంతమందికి ఉపయోగపడవచ్చు. కాకపోతే నేను చెప్పేది... సంప్రదాయాలు, ఆధునికత సమ్మేళనంలా పేరెంటింగ్‌ ఉండాలి. మన మూలాలను మరిచిపోకుండా పిల్లలను పెంచాల్సిన అవసరం ఉంది.
 
తెలుగులో... 
తెలుగు సినిమా పరిశ్రమలో నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ అందరూ ప్రొఫెషనల్‌గాఉండటమే కాదు సాఫ్ట్‌స్పోకెన్‌ పీపుల్‌.నాకు అలాంటి వారే నచ్చుతారు. కాబట్టి సహజంగానే ఈ ఇండస్ట్రీని ప్రేమిస్తాను. మరలా స్ర్కీన్‌పై వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు. పిల్లలతో బిజీగా ఉన్నాను. తరువాత ఏమవుతుందో చూడాలి.