స్థానిక గాయకులకు మిగతావాళ్లకు తేడా ఏంటి?..

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇళయరాజా

‘‘ఎవరు పాడినా వినసొంపుగా ఉండాలి. స్థానిక గాయకులకు, మిగిలిన వాళ్లకీ తేడా ఏంటి? నా దృష్టిలో అందరూ లోకలే. మిగిలిన వాళ్లు ఆకాశం నుంచి ఊడిపడలేదుగా? వాళ్లేం గంధర్వులు కాదు కదా’’ ..అని అన్నారు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా. దాదాపు ఆరువేల పాటలను కంపోజ్‌ చేసిన ఆ సంగీత సామ్రాట్టు.. తన 40 ఏళ్ల ప్రస్థానంలో తొలిసారి హైదరాబాద్‌లో లైవ్‌ కాన్సర్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు. టెంపుల్‌ బెల్స్‌ ఈవెంట్స్‌, ఎం.ఎల్‌.ఎన్‌.ఈవెంట్స్‌ సంయుక్తంగా ఈ కార్యకమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘‘నవంబర్‌ 5న గచ్చిబౌలి స్టేడియంలో అన్నీ తెలుగు పాటలే పాడబోతున్నాను. నన్ను అందరికన్నా ఎక్కువగా ఇష్టపడేది తెలుగు వారే. వారు కొన్ని దశాబ్దాలుగా నా పాటలను రికార్డుల్లోనే వింటున్నారు. అందుకే తొలిసారి నా ఆర్కెస్ట్రాతో పెర్ఫార్మ్‌ చేయబోతున్నాను. సంగీతం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారని నాకు తెలుసు. ఆ ప్రోగ్రామ్‌ గురించి నా మాటల్లోనే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను’’ అని వివరించారు. అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత ఐదేళ్లలో ఆయన మీడియాకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే. ఆ విశేషాలు..  

నాలుగు దశాబ్దాల మీ సినీ సంగీత ప్రస్థానాన్ని ఎలా వర్ణిస్తారు..
నేను ఒక సామాన్య మానవుడిని.. నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా? (నవ్వులు).. నా ఉద్దేశంలో నా జీవితం ఒక ప్రస్థానం కాదు. నా సంగీతమే నా ప్రస్థానం. ఈ రెండింటినీ వేరు చేసి చూడలేము.
 
హైదరాబాద్‌తో మీ అనుబంధం గురించి చెప్తారా...
హైదరాబాద్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. 1970ల్లో సంగీత కచేరీల్లో హార్మోనియం వాయించటానికి హైదరాబాద్‌కు వచ్చేవాడిని. మా గురువుగారు సికింద్రాబాద్‌లో ఉన్న ఒక మ్యూజిక్‌ స్టోర్‌లో వెస్ట్రన్‌ మ్యూజిక్‌ స్కోర్‌ పుస్తకాలు దొరుకుతాయని చెప్పారు. నేను రైల్వే స్టేషన్‌లో దిగి నేరుగా సికింద్రాబాద్‌ వెళ్లి ఆ పుస్తకాలు కొనుక్కునే వాడిని.
ఇక నా కచేరీ విషయానికి వస్తే.. దక్షిణాదిన అందరి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించేది తెలుగువారే. వారికి నేనంటే ప్రేమ.. పిచ్చి. పిచ్చి ప్రేమ..(నవ్వులు). వారి ముందు- నేను లైవ్‌ కచేరీ చేస్తున్నాననే ఆలోచన చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. దీనిలో 85 మంది సంగీత కళాకారులు పాల్గొంటున్నారు.
 
ఒకప్పటి హైదరాబాద్‌కు..ఇప్పటి హైదరాబాద్‌కు తేడా ఏమిటి?
భౌతికంగా మారి ఉండొచ్చు. కానీ మనుషులు వారేగా! వారితో మనకున్న బంధం బంధమే కదా. మనుషులు మారనంత కాలం ఫర్వాలేదు.
 
మీ సినీ ప్రస్థానంలో మరపురాని సంఘటనలేవైనా చెబుతారా?
బాలచందర్‌ రుద్రవీణ సినిమాలో ‘లలిత ప్రియ కమలం’ అనే పాట ఉంది. ఆ పాట ఎలా పుట్టిందో చెబుతాను. ఆ సినిమాలో హీరోయిన్‌ ఒక రాగంలో పాట పాడి వెళ్లిపోతుంది. ఆ రాగం పేరే ఆ అమ్మాయిది. ఆ రాగాన్ని విని హీరో ఆమె పేరు తెలుసుకోవాలి. అలాంటి పేరున్న రాగంతో పాట చేయమని డైరక్టర్‌గారు అడిగారు. అప్పుడు నేను హిందుస్థానీలో ఉన్న లలితప్రియ అనే రాగంలో పాటను చేశా.
 
ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు ఆధ్యాత్మికతను ఎలా అభివర్ణిస్తారు?

నా దృష్టిలో జీవితం.. ఆధ్యాత్మికత.. సినిమా.. సంగీతం వేర్వేరు కాదు. మనం చేసే ప్రతి పనిలోను ఆధ్యాత్మికత ఉంటుంది. మా దగ్గర బెల్లంతో వినాయకుడిని చేసి పూజిస్తారు. మళ్లీ బెల్లాన్నే ఆయనకు నైవేద్యంగా పెడతారు. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత ఉంటుంది.

మీ కచేరీలో స్థానిక గాయకులు పాల్గొంటారా?
గాయకులనేవారు గంధర్వలోకాల నుంచి కిందకురారు. మన చుట్టుపక్కలే ఉంటారు. అయినా సంగీతానికి స్వ, పర భేదాలేముంటాయి?
 
ప్రస్తుతం సినిమా సంగీతంపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం సంగీతం ఉందనుకుంటున్నారా? మీరు ఏది సంగీతమనుకుంటున్నారో.. అది సంగీతం కాదని నేను అనుకుంటున్నా. అలాంటప్పుడు దానిపై నాకు అభిప్రాయం ఎలా ఉంటుంది.. మీరే చెప్పండి..
 
ప్రస్తుతం ఉన్నది సంగీతం కాకపోతే.. మీ ఉద్దేశంలో సంగీతమంటే ఏమిటి?
సంగీతాన్ని ఇలా ఉండాలి అని ఎలా చెప్పగలుగుతా? చేసి వినిపించాలంతే..
 
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో విభేదాలకు కారణాలేమిటి?
ఆ విషయాన్ని వదిలేద్దాం.. గొప్పవాళ్ల గొప్పతనం గురించి చెప్పకపోతే తప్పవుతుంది. ఇక విభేదాల విషయానికి వస్తే- ఆయనకు నేను సమాధానం చెప్పాలంటే వేరే విధంగా మాట్లాడాలి. అయినా అది నాకు, ఆయనకు మధ్య ఉన్న వ్యవహారం. అది పబ్లిక్‌కు ఎందుకు?