తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తున్న వలస రచయిత, ప్రముఖ కవి, కథకుడు సంగెవేని రవీంద్ర .పొట్ట చేతపట్టి మహారాష్ట్రకు వలస వెళ్ళిన తెలుగు ప్రజల వ్యథార్థ జీవితావిష్కరణలే ఆయన కవిత్వం. అక్కడి తెలుగు రచయితలను ఏకం చేసి, ఐక్యంగా సాహితీసేద్యం చేస్తున్నారాయన . కవిత్వం అంటే బడాయి కాదు, అదొక జీవన పోరాటం. అంటున్న సంగెవేని రవీంద్ర ఇంటర్వ్యూ .....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కరీంనగర్‌ జిల్లా గొల్లపల్లి మండలం శెకల్ల గ్రామంలో వ్యవసాయ కుటుంబం మాది. నాన్నగారు సంగెవేని లక్ష్మణ్‌. అమ్మ సూరమ్మ. 1961మార్చి 11న నేను పుట్టాను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. నాన్నగారు ముంబైలో జౌ‍ళిమిల్లు కార్మికుడు.నేను మా తాతగారు వెంకయ్యగారి దగ్గర ఉంటూ, బుగ్గారం స్కూల్లో టెన్త్‌ వరకు చదివాను.మా ఊళ్ళో డాక్టరుగారి అమ్మాయి సుజన గైడెన్స్‌లో పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను. ఐదో తరగతి నుంచే చందమామ పుస్తకాలు, కవిత్వం పుస్తకాలు చదవడం అలవడింది. స్కూల్లో మా గ్రంథాలయానికి నేనే ఇన్‌చార్జ్‌. అక్కడ లైబ్రేరియన్‌ ఉండడు. అభిరుచిగల ఒక విద్యార్థిని టీచర్లే ఇన్‌ఛార్జిగా నియమించేవారు. అలా నాకు గ్రంథాలయంతో ఎటాచ్‌మెంట్‌ పెరిగి విపరీతంగా పుస్తకాలు చదువుకునేవాణ్ణి. కొమ్మూరి, విశ్వప్రసాద్‌, మధుబాబు డిటెక్టివ్‌ రచనలు నన్ను ఇంప్రెస్‌ చేసేవి. శ్రీశ్రీ, తిలక్‌ సాహిత్యం చదివాక నా ఆలోచనల్లో పరిపక్వత వచ్చింది. కథలు బాగా చదివేవాణ్ణి. యండమూరి రచనలు నన్ను బాగా ప్రభావితం చే‌శాయి.

బాలకార్మికుడిగా

టెన్త్‌ పూర్తయ్యాక ముంబై వెళ్ళి బాల కార్మికుడిగా చాలాచోట్ల పనిచేశాను. 18 ఏళ్ళ నిండాక, 1978లో నాన్నగారు పనిచేసే జౌళిమిల్లులోనే కార్మికుడిగా చేరాను. అదే మిల్లులో అంచెలంచెలుగా ఎదుగుతూ, మేనేజర్‌ స్థాయికి చేరుకుని, 18 ఏళ్ళు అంటే 2008వరకు మేనేజర్‌గా పనిచేశాను.ముంబై వెళ్ళిన తర్వాత కూడా నా పుస్తక పఠనం ఆగలేదు. అక్కడ సరస్వతి బుక్‌ డిపోలో ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు అన్ని పుస్తకాల్నీ రెంట్‌కు తీసుకుని చదువుకునేవాణ్ణి. ఆంధ్రజ్యోతి వారపత్రిక బాగా చదివేవాణ్ణి. నా జోక్స్‌ అందులో ప్రచురితమయ్యేవి.‘స్నేహ హస్తం అందివ్వవూ!’ అనే నా తొలి కవిత ఆంధ్రభూమి వారపత్రికలో (2004) వచ్చింది. వాళ్ళు పంపిన యాభై రూపాయలు పారితోకం తీసుకుని హిమాలయాలు ఎక్కినంతగా మురిసిపోయాను. అప్పటినుంచీ అన్ని పత్రికల్లోనూ నా కవితలు రెగ్యులర్‌గా వచ్చేవి.

13 కవితా సంపుటిలు

ఇప్పటివరకు నా కెరీర్‌లో తొమ్మిది కవితా సంపుటిలు సహా మొత్తం 13 పుస్తకాలు వెలువరించాను. వీటన్నింటికీ ముంబైలోనే ఆవిష్కరణ సభలు చేశాను. ఇందులో కవితలు, దీర్ఘ కవితలు, పరిశోధనలు, చరిత్ర పుస్తకాలు ఉన్నాయి.నా తొలి కవితా సంపుటి ‘అన్వేషణ’ 2005లో వెలువడింది. 42 కవితలున్న ఈ సంపుటిని డా.కసిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ముంబై లాలా కాలేజీలో నిర్వహించిన ఈ సభకు వెయ్యిమంది సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఇండియా టుడే సహా 16 పత్రికల్లో దీనిపై సానుకూలంగా రాసిన సమీక్షలు నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయి.