ప్రముఖ కవయిత్రి చిల్లర భవానీదేవి. తెలుగునాట తొలి నానీల కవయిత్రి. కథ, నవల, వ్యాసం, నాటకం, నాటిక, రూపకాలు, పాటలు, గేయాలు, అనువాదాలు.....ఇలా బహుముఖ సాహితీ ప్రక్రియల్ని సృజించారు. 47యేళ్ళ సాహిత్య ప్రయాణంలో ఇప్పటివరకు 48 పుస్తకాలు వెలువరించారు . 35అవార్డులు అందుకున్నారు . మరో రెండు పుస్తకాలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆమె ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు కూడా. సమకాలీన కవిత్వంలో, కవిత్వం పాలు తగ్గిపోయిందనీ , Unacknowledged Legisleters గా పేరొందిన రచయితలు ఒక అక్షరం రాసినా, ఒక ఉపన్యాసం చేసినా చాలా బాధ్యతగా ప్రవర్తించాలంటున్న భవానీదేవి ఇంటర్వ్యూ...

దేశం గర్వించదగిన ప్రముఖ పాత్రికేయ సోదరులు కోటంరాజు రామారావు, కోటం రాజు పున్నయ్యల వంశంలో పుట్టారు భవానీదేవి. ఆమె తండ్రి కోటంరాజు సత్యనారాయణశర్మ. తల్లి అలివేలు మంగతాయారు. ఆరుగురు సంతానంలో రెండోవారు భవానీదేవి. ఆమె తండ్రి న్యాయవాది, అడ్వకేట్‌. ఇన్‌కమ్‌టాక్స్‌ ఆడిటర్‌, కవి, రైతు, పుస్తక పాఠకుడు....ఇలా బహుముఖ పాత్రలు పోషించేవారు. జాషువా, కరుణశ్రీ లాంటి ఎందరో ప్రముఖులు వారింట్లో విస్తరివేసేవారు. అనేక సాంస్కృతిక, కళా, సాహిత్యసేవకు ప్రధానపోషకునిగా బహుముఖీనమైన తండ్రి వ్యక్తిత్వం ఆమెలో గొప్ప స్ఫూర్తిని నింపింది.గుంటూరుజిల్లా పొన్నూరు మండలం ములుకుదురు భవానీదేవి స్వగ్రామం. ఆమె 1954 అక్టోబరు 5వ తేదీన హైదరాబాద్‌లో జన్మించినప్పటికీ, గ్రామీణ వాతావరణంలో గంపెడు బంధువుల మధ్య పెరిగారు. వ్యవసాయ స్ర్తీలుపాడే తొలకరినాట్ల పాటలు, పాడిపంటలు, ఆలయాలు, సంప్రదాయాలతో ఆమె జీవితం పెనవేసుకుపోయింది. ఎం.ఏ తెలుగు, ఎం.ఏ హిందీ, ఎల్‌.ఎల్‌.బి చేశారు. ‘‘స్వాతంత్ర్యానంతర తెలుగు–హిందీ కవితల తులనాత్మక పరిశీలన’ అనే అంశంపై ఉస్మానియాలో పిహెచ్‌డి చేశారు. 35రూపాయల జీతంతో టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి, లెక్చరర్‌గా, హైదరాబాద్‌ హైకోర్టులో కొంతకాలం జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి గ్రూప్‌–2 పాసై ఎ.పి సచివాలయంలో 33 ఏళ్ళు పనిచేసి డిప్యూటీ సెక్రెటరీగా 2012లో రిటైరయ్యారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ప్రస్తుతం పాఠాలు బోధిస్తున్నారు.

కవిత్వం

తొమ్మిదో యేటే పద్య రచన చేశారు భవానీదేవి. ఆంధ్రజ్యోతి వారపత్రిక ‘కొత్త కలాలు’ శీర్షికలో 1973లో వెలువడిన ‘కట్నం’ ఆమె తొలి కవిత. కృష్నశాస్త్రిపై ఆమె రాసిన తొలివ్యాసం ఆంధ్రప్రభలో వెలువడింది.‘నాలోని నాదాలు’, ‘శబ్దస్పర్శ’, ‘వర్ణనిశి’, అక్షరం నా అస్తిత్వం’, ‘కెరటం నా కిరీటం’, ‘భవానీ నానీలు’, ‘హైదరాబాద్‌ నానీలు’, ‘ఇంతదూరం గడిచాక’, ‘నది అంచున నడుస్తూ...’ ఇవన్నీ ఆమె కవితా సంపుటిలు. ‘భవానీ కవిత్వం–1’, ‘భవానీ కవిత్వం–2’, ‘గవేషణ’ శీర్షికలతో మూడు వాల్యూమ్స్‌గా ఆమె మొత్తం కవిత్వం వెలువడింది. ‘‍స్వాతంత్ర్యానంతర తెలుగు హిందీ కవిత్వంలో స్ర్తీ’ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది.మానవత్వం, మానవీయ విలువలు, ప్రగతి భావనలే ప్రధానంగా ఆమె కవిత్వంలో ఉంటాయి.

స్ర్తీల కుటుంబ, ఉద్యోగ, సాంసారిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను స్ర్తీల హృదయావిష్కరణ కవితలుగా మలిచారు భవానీదేవి. ఆమె తన కవిత్వంలో స్ర్తీ హృదయాన్ని ఆవిష్కరించారు.‘నిత్యం నీ కోసమే కన్నీటి అన్వేషణ/నన్ను ఏ చెత్త కుండీలో పడేశావ్‌.../నీ పైట చెంగుకోసం ప్రపంచమంతా వెతుక్కుంటున్నా....’అంటూ ఒక అనాథ బాలిక అంతరంగాన్ని ఆవిష్కరించిన ‘అమ్మకోటి’ కవిత ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. తండ్రి బురఖా ఇచ్చినప్పటి ఒక ముస్లిం బాలిక మనోభావాలు, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆల్జీమర్స్‌ సమస్యలు వంటి భిన్న వస్తువులతో ఆమె కవితలు మనకళ్ళకు కడతాయి.