అన్నమయ్య సంకీర్తనలను విశ్వవాప్తం చేసిన వారిలో అగ్రభాగాన నిలుస్తారు పద్మశ్రీ శోభారాజు. ఆ పదకవితా పితామహుని కీర్తనల ప్రచారానికి జీవితాన్ని అంకితం చేశారామె. కేవలం విని ఆనందించేందుకే కాదు, కష్టంలో వున్న వ్యక్తి సాంత్వన పొందేందుకు, సమాజంలో మార్పు సాధించేందుకు, తద్వారా ప్రపంచశాంతి స్థాపనకు సంగీతం ఉపయోగపడుతుందని బలంగా నమ్మడంతో పాటు ప్రయోగాత్మకంగా నిరూపించారామె. సంగీత విశ్వవిద్యాలయం ద్వారా వ్యక్తి వికాసంతో పాటు సమాజ సంక్షేమానికి నడుం కట్టిన డాక్టర్‌ శోభారాజుకు నవ్య నీరాజనం.

ప్రస్తుత సమాజంలో మన చుట్టూ జరుగుతున్న విపరీత పరిణామాలకు, ఉపద్రవాలకు మూలం చెడు ఆలోచనలు. ఆ ఆలోచనల్ని రూపుమాపి, వాటి స్థానంలో మంచి ఆలోచనలు వచ్చేందుకు తోడ్పడితే సమాజంలో తప్పక శాంతి నెలకొంటుంది. సంగీతంతో ఇది సుసాధ్యం అని నా విశ్వాసం. అందుకే భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే నినాదంతో నాలుగున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. శతాబ్దాలుగా సంగీత రంగంలో త్యాగయ్య, రామదాసు, ముత్తస్వామి దీక్షితుల వంటి మహనీయుల కీర్తనలు మధురంగా పాడుకునేవాళ్లం. అన్నమయ్య పదాలకు మాత్రం అప్పట్లో అంతగా ప్రచారం లేదు. కానీ ఈ రోజున అన్నమయ్య పదాలకు విస్తృత ప్రచారం లభించింది. కనీస సంగీత పరిజ్ఞానం వున్న వారు కూడా అన్నమయ్య పదాలు పాడుకుంటున్నారు. జ్ఞాన, భక్తి, సరస, వైరాగ్యభరితమైన అన్నమయ్య పదాలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచానికి తెలియని మరెన్నో అన్నమయ్య కీర్తనలు వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్యకు ఇంతటి ప్రచారం లభించడం నిజంగా తెలుగుపదానికి పట్టాభిషేకంగా భావించాలి. ఈ మహాయజ్ఞంలో నేను సైతం కీలక భూమిక పోషిచగలగడం నా అదృష్టం. ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షం.

వేంకటాచలపతితో అనుబంధం

నాన్నగారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. అమ్మ చక్కగా పాడేది. ఆమే నా తొలిగురువు. నాన్నగారి ఉద్యోగ రీత్యా నా చిన్నతనంలో కొన్నాళ్లు నేపాల్‌లో వున్నాం. నేపాలీ భాషలో కృష్ణుడి మీద చిన్నతనంలోనే తొలి పాట రాశాను. అలా నా సంగీత ప్రయాణం మొదలైంది. మహనీయులైన గురువులు లభించారు. వయెలిన్‌, కర్నాటక సంగీతాల్లో శిక్షణ తీసుకున్నాను. స్కూలు చదివే రోజుల నుంచి కృష్ణుడితో అనుబంధం ఎక్కువ. తిరుపతిలో డిగ్రీ చదివే రోజుల్లో కృష్ణభక్తి ... వేంకటేశ్వరుని భక్తిగా మారింది. అన్నమయ్య కీర్తనల్లో వున్న లాలిత్యం, సమాజహితం, గొప్ప తత్వం నన్ను మంత్రముగ్ధం చేశాయి. ఎక్కడికి వెళ్లినా ఒకటి రెండు సినిమా పాటలు పాడినా, అన్నమయ్య కీర్తనలు తప్పక పాడేదాన్ని. సంగీతం కూడా నేర్చుకోవడంతో పాఠశాల, కళాశాలల్లో ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతులు నావే. పెండ్యాల, ఎస్‌. రాజేశ్వరరావు, రమేష్‌నాయుడు, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి గొప్పవారు నా పాట విని అభినందించేవారు. ఎస్‌. రాజేశ ్వరరావుగారు నన్ను మద్రాసు పిలిపించుకుని ప్రముఖ రికార్డింగ్‌ కంపెనీలో రెండు అన్నమయ్య కీర్తనల్ని రికార్డు చేశారు. సినిమా పాటల గాయనిగా నీకు మంచి భవిష్యత్తు వుంది. నేనే అవకాశం ఇస్తాను అన్నారు. రమేష్‌నాయుడి గారు మద్రాసు వస్తే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇస్తామన్నారు. ఫ్రెండ్స్‌ కూడా ప్రోత్సహించారు. ఈ లోగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టు కోసం అన్నమయ్య కీర్తనల ప్రచారకర్తగా నాకు తొలి స్కాలర్‌షిప్‌ ఇచ్చారు. ఈ రెండింటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అని మీమాంసలో పడి కొద్ది రోజులు నలిగిపోయాను. నాకు ఏ కష్టం వచ్చినా కపిల తీర్థంలోని నమ్మాళ్వార్‌ ఆలయంలో కూర్చుని ఆ స్వామికి మొర పెట్టుకోవడం అలవాటు. అంతరాలయంలో కూర్చుని స్వామితో మాట్లాడుతూ గడిపేదాన్ని. ఆ రోజున కూడా ఆలయంలో కాసేపు ధ్యానంలో గడిపే సరికి నాకు మనసులో ఒక నిశ్చితాభిప్రాయం కలిగింది. ఆ ఏడుకొండల స్వామి సమక్షానికి నడుచుకుంటూ వెళ్లాను. కన్నీళ్లతో ఆ వేంకటేశ్వరుని ముందు నిలుచున్నాను. ఆయనే నన్ను చేయిపట్టుకుని తన సేవకు, అన్నమయ్య పద ప్రచార మార్గానికి నడిపించారు. ఆ వేంకటేశ్వరునితో నా అనుబంధం అలా మొదలైంది.