ప్రముఖ చిత్రకళాకారుడు దాకోజు శివప్రసాద్‌. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్ని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు చిత్రకళకు ఉన్నాయని దృ‍ఢంగా విశ్వసించే చిత్రకారుడు. చిత్రకారుడంటే బొమ్మలు గీసుకుని బతికేయడం కాదు, సామాజిక సమస్యలపై చిత్రకళను బాణంలా ఎక్కుపెట్టాలి అంటూన్నారు శివప్రసాద్‌.

మాది కృష్ణాజిల్లా గుడివాడ. నాన్నగారు దాకోజు లక్ష్మణరావు. అమ్మ చిన్నమ్మ. ఇంటికి నేనే పెద్దవాణ్ణి. నాకు ఆరుగురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. నాన్నగారు గోల్డ్‌స్మిత్‌. అయితే నాన్న నాకు మా వృత్తిపని నేర్చించడానికి ఇష్టపడలేదు. కానీ మాది స్వర్ణకారుల కుటుంబం కావడంవల్ల బాల్యం నుంచీ నాకు చక్కటి బొమ్మలు గీసే చిత్రకళ సహజసిద్ధంగా అబ్బింది. ఒకరోజు నాన్నగారి స్నేహితుడి కోరిక మేరకు మొదట ఆయన ఫొటోను పెన్సిల్‌తో గీసిచ్చాను. నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఇక అప్పటినుంచీ ఇంటికి మా బంధువులు ఎవరు వచ్చినా నన్ను అడిగిమరీ నాతో వాళ్ళ బొమ్మ గీయించుకునేవారు.

అలా నాకు డ్రాయింగ్‌ అలవాటైపోయింది. స్కూల్లో బహుమతులు గెలుచుకునేవాణ్ణి.నాకు బాల్యం నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లో పనిచేయాలనే కోరిక ఉండేది. ఎన్‌.టి.రామారావు పౌరాణిక చిత్రాలు బాగా ఇష్టపడేవాణ్ణి. శ్రీకృష్ణపాండవీయం సినిమా చూసి ఆయనకు అభిమాని అయిపోయాను. సీతారామ కల్యాణం సినిమాచూశాక ఆయన రావణాసురుడి గెటప్‌ బొమ్మ నేను గీసి ఆయన అడ్రస్‌కు పోస్టు చేశాను. ఎన్‌.టి.ఆర్‌. బొమ్మల్ని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా దించేసేవాణ్ణి.

మా కుటుంబం 1975లో హైదరాబాద్‌కు తరలివచ్చి స్థిరపడింది. మాది పెద్ద కుటుంబం కావడంతో నాన్నగారికి తోడుగా కమర్షియల్‌ ఆర్ట్‌ వర్క్‌లో జాబ్‌కోసం ప్రయత్నించాను. జాంబాగ్‌లో పనిచేస్తుంటే, సంఘ్వీ టెక్స్‌టైల్స్‌వారు నా హ్యాండ్‌ రైటింగ్‌ చూసి ఉద్యోగం ఇచ్చారు. 1977లో ఈనాడు దినపత్రికలో లెటరింగ్‌ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాను. కానీ సినిమాల్లోకి వెళ్ళాలనే నా కోరికవల్ల, అక్బర్‌–సలీం–అనార్కలి’ సినిమా తీస్తున్న సమయంలో ఆఫీసుకు మూడ్రోజులు సెలవుపెట్టి ఎన్‌.టి.ఆర్‌ ఇంటికి వెళ్ళాను. నేను గీసిన ఎన్‌.టి.ఆర్‌. బొమ్మలు ఆయనకు చూపించాను.

ఆయన చూసి, ‘భలే వేశావే’ అంటూ నన్ను మెచ్చుకుని రామకృష్ణ సినీ స్టూడియోలో ఆర్ట్‌ డైరెక్టర్‌ దగ్గర పనిలో పెట్టారు. కానీ ఆ పని నాకు నచ్చలేదు. ఎన్‌.టి.ఆర్‌కు చెప్పకుండా మానేశాను. ఈనాడులో ఉద్యోగంపైనే నా సర్వశక్తులూ కేంద్రీకరించి ఏకాగ్రతగా పనిచేసి, మూడునెలల్లోనే మంచి లెటరింగ్‌, డిజైనింగ్‌ ఆర్టిస్టుగా నైపుణ్యం సాధించాను. మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాను.నా పెళ్ళి ఖర్చులకు ఆఫీసులో వెయ్యి రూపాయలు అడ్వాన్స్‌ అడిగితే ఇవ్వలేదు. దాంతో ఆ డబ్బుకోసం ‘ఈవారం’ పత్రికలో చీఫ్‌ ఆర్టిస్టుగా చేరాను.

ఎన్‌.టి.ఆర్‌తో సాన్నిహిత్యం

1985–1991వరకు ‘ఉదయం’ పత్రికలో చీఫ్‌ ఆర్టిస్టుగా పనిచేశాను. ఎన్‌.టి.ఆర్‌ చిత్రాల్లోని ఎన్నో గెటప్స్‌, పెయింటింగ్స్‌తో పాఠకుల్ని అలరించేవాణ్ణి అదే సమయంలో ఎన్‌.టి.రామారావు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా తీస్తున్నారు. ఆ స్టిల్స్‌ కూడా ఇంకా బయటకు రాలేదు. కానీ నేను ‘శివరంజని’ పత్రికలో ‘విశ్వామిత్ర’ గెటప్‌లో ఎన్‌.టి.ఆర్‌ ఎలా ఉంటారో ఊహించి మంచి పెయింటింగ్‌ వేశాను. ఎన్‌.టి.ఆర్‌ అది చూసి ఎంతో అబ్బురపడి వెంటనే నాకు కబురంపారు. ఆబిడ్స్‌లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, ఎలాంటి భేషజం లేకుండా నమస్కారం పెట్టి నన్ను రిసీవ్‌ చేసుకున్నారు. ‘‘మర్యాద అంటే ఎన్‌.టి.రామారావుగారి దగ్గరే నేర్చుకోవాలి’’ అన్నంత గొప్పగా ఉంటుంది ఆయన మర్యాద.

‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా పోస్టర్స్‌ డిజైనింగ్‌ వర్కు, పేపర్‌ యాడ్స్‌ వర్కు మొత్తం నాకే అప్పగించారు. నా బొమ్మల్లో ఎన్టీఆర్‌ పోలికలు అద్భుతంగా వస్తాయి. ఆయన ఎదురుగా ఉన్నట్టే ఉందని ప్రనశంసించేవారు. నా పెయింటింగ్స్‌, నా క్రియేటివిటీ డిజైన్స్‌ చూసి ఎన్టీఆర్‌ ఎంతో మురిసిపోయారు. నా అపోహలన్నీ పటాపంచలుచేస్తూ, నాకు మంచి పారితోషికం ఇచ్చారు. అలా ఎన్‌.టి.ఆర్‌ నన్ను ఎంతగానో విశ్వసించేవారు. ఆయన దగ్గర ఎంతో సంతోషంగా పనిచేశాను. సామ్రాట్‌ అశోక చిత్రానికీ నేనే వర్క్‌ చేశాను. నా పెయింటింగ్సే పేపర్‌ యాడ్స్‌గా వచ్చేవి.