తెలుగుభాష కు, పాటకు జీవం
డా. రహమతుల్లా ఘంటసాల అవధానం
ఘంటసాలపై అవధానమా ? అంటూ ఆశ్చర్యపోతారు తెలియనివారెవరైనా !
మరుక్షణంలో మళ్ళీ ఆనందపరవశులవుతారు .
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు డాక్టర్‌ ఎస్‌. రహమతుల్లా.
వృత్తిరీత్యా నెఫ్రాలజిస్ట్‌ . ప్రవృత్తిరీత్యా ఘంటసాల పరిశోధకుడు .
అంతకుమించి తెలుగు భాషాభిమాని మాత్రమే కాదు,
ఘంటసాల అవధానంలో జాతీయ రికార్డు స్థాపించారు రహమతుల్లా.
పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా, ‘హే కృష్ణా ముకుందా.. మురారి.....’ అంటూ చిన్నప్పుడే పాటలు పాడేవారు .
కుల, మత, ప్రాంతీయ తత్వాలు, భాషా బేధాలు వంటి సంకుచిత ధోరణులు పెచ్చరిల్లిన ఈ తరుణంలో , నిజమైన లౌకిక స్ఫూర్తితో విశాల భావాలకు అంకితమైన అవధాని రహమతుల్లా .
తెలుగు భాషను ప్రేమించిన భారతీయార్‌, శ్రీకృష్ణదేవరాయలు , సి. పి. బ్రౌన్‌ ఎవరో తెలియకపోయినా, వారిని తలుచుకోలేకపోయినా మన మధ్యవున్న ఇలాంటి మార్గదర్శిని మాత్రం గుర్తిద్దాం .

తెలుగు భాష, ఘంటసాల పాటే ఊపిరిగా అద్బుత ధారణశక్తి ప్రదర్శిస్తున్న రహమతుల్లా గురించి......

 


ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోవున్న ఒరిస్సా పట్టణం పర్లాకిమిడి మా స్వస్థలం. మా నాన్నగారు అబ్దుల్‌ మజీద్‌, అమ్మ షఫీవున్నాబీబి. మేం నలుగురం అన్నదమ్ములం. నాకు ముగ్గురు అక్కలు. నాన్నగారు బట్టలు, చర్మాల వ్యాపారం చేసేవారు. మా ఇంట్లో మతపరమైన ఛాందసవాదం, భాషా, కులబేధాలు ఏ కోశానా ఉండేవికాదు.
మా అన్నయ్యలిద్దరూ వైద్యులు. చిన్నప్పటినుండీ మావన్నీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ చదువులే. మెట్రిక్యులేషన్‌ (11వ తకగతి) వరకు సొంతూళ్ళో చదివి, బరంపురం మహారాజా కృష్ణచంద్ర వైద్యకళాశాల (ఎంకెసిజి) లో 1975లో వైద్యవిద్య పూర్తిచేశాను.
 
హే కృష్ణా ముకుందా మురారీ...
నా బాల్య మిత్రుడు గొర్తి జగన్నాథం సంగీతాభిరుచిగలవాడు (జె.వి.రమణమూర్తిగారి అల్లుడు). ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రంలో సుశీలగారు పాడిన ‘‘మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగేనా....అనే పాట నాకెంతో నచ్చింది. ఆ పాట పాడుతూ ఉండేవాణ్ణి. మా స్కూలు హెడ్మాస్టర్‌ గౌరీశంకర్‌గారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. నా పాటను ప్రోత్సహించేవారు. మంచి సినిమాలు చూడమని డబ్బులిచ్చేవారు. మా నాన్నగారు కూడా అంతే. మంచి కుటుంబ కథా చిత్రాలు చూడమనీ, అందులో మంచిని చూసి నేర్చుకోమనీ ప్రోత్సహించేవారు.
మా కుటుంబం మీద తెలుగుభాషా ప్రభావమే ఎక్కువ. హిందీ సినిమాల ఊసు తక్కువ. చుట్టూ తెలుగు సినిమాలే. ఇంట్లో మేం తెలుగుపాటలు పాడుకునేవాళ్ళం. హే కృష్ణా ముకుందా మురారీ.....అని ఘంటసాల పాట పాడుతుంటే, ‘ఒరేయ్‌ మనం ముస్లిమ్‌ మతస్తులం, అలాంటి పాటలు పాడకూడదురా’ అని ఎప్పుడూ అమ్మానాన్న అడ్డు చెప్పలేదు. ఆ విధమైన మతసామరస్య వాతావరణం, కులమత భాషా భేదాలులేని కుటుంబ జీవితాన్ని మా నాన్నగారు అలవాటు చేశారు. ఆ పెంపకమే నన్ను తెలుగు భాషపైన, ఘంటసాలపాట పైన అవ్యాజమైన ప్రేమాభిమానాలు పెంపొందిచుకునేట్టు చేసింది. హైస్కూల్లో పాటలపోటీల్లో పాల్గొనేవాణ్ణి. అటు చదువులోనూ, ఇటు ఆటల్లోనూ ఎన్నో బహుమతులొచ్చేవి. నా పాటకు బహుమతి రాకపోతే ఎక్కడ తప్పుచేశానో, ఎదుటివాడు ఎక్కడ బాగా పాడాడో... అని నాకు నేనే విశ్లేషించుకునేవాణ్ణి.
 
జగదేకవీరుడు సినిమా ప్రభావం
సినిమాలు విపరీతంగా చూసేవాణ్ణి. డైలాగ్‌ డెలివరీ, కెమెరా, లాంగ్‌షాట్‌, గుర్రంమీద డూప్‌ వంటి విషయాలు చర్చించుకునేవాళ్ళం. నా స్నేహితుడు సామినేని శివప్రసాద్‌ ఇవన్నీ ఎక్కడో తెలుసుకుని మా దగ్గర చర్చించేవాడు. అలా ‘జగదేకవీరుని కథ’ సినిమా నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ సినిమాలో ఘంటసాల పాడిన ‘శివ శంకరీ..శివానంద లహరి...అనే పాట నన్ను తీవ్రంగా కదిలించింది. హైస్కూల్లో ఎన్టీఆర్‌ పార్టీ, ఎఎన్నార్‌ పార్టీ అని చీలిపోయి కేవలం నేను ఎన్టీఆర్‌కు ఘంటసాల పాడిన పాటలే పాటలని అనుకునేవాణ్ణి. కాలేజీలో చేరాక విశాలభావం,సాహిత్య విశ్లేషణ అలవడ్డాయి. కాలేజీ లైఫ్‌లో సామినేని శివప్రసాద్‌, నేను, తాయి వెంకటరెడ్డి, ఇవటూరి బాపేశ్వర్రావు నలుగురం కలిసి సినిమాలు, ఘంటసాల పాటలపై చర్చించుకునేవాళ్ళం. అలా పాటల సాహిత్యంపై అవగాహన పెరిగి పాటను ఆస్వాదించేవాళ్ళం. నేను పాటలు రాసి, వరసలు కడితే వెంకటరెడ్డి పాడేవాడు. బరంపురంలో మెడిసిన్‌ చేస్తూనే రెండేళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. హౌస్‌సర్జన్‌ తర్వాత కాకినాడలో సీనియర్‌ హౌస్మెన్‌షిప్‌ ఏడాది కోర్సు చేస్తూ డాక్టర్‌ తమ్మా సూర్యనారాయణ, ఎర్రా ఢిల్లేశ్వర్రావులతో కలిసి లవకుశ, రహస్యం, గుండమ్మకథ, పూలరంగడు...ఇలా విపరీతంగా ఎన్నో సినిమాలు చూస్తూ ఘంటసాల పాటలు ఆస్వాదించేవాణ్ణి. అలా ఆ పాటలు, ఆ మ్యూజిక్‌ నాలో బాగా జీర్ణించుకుపోయింది. మరోవైపు డాక్టర్‌ ఎ.బి.బి.ఆచారిగారు నాతో ఘంటసాల పాటలు పాడిస్తూ నా కంఠానికి సానపెట్టారు. ఇలా ఎంతోమంది నన్ను ప్రోత్సహించి ఘంటసాల పాటల పరిశోధనవైపు నడిపించారు. అదొక దైవ సంఘటన. ఘంటసాల పాట మధ్యలో ఎక్కడ గుర్తుచేసినా, చిన్న పదం చెప్పినా, కొద్దిగా మ్యూజిక్‌ వినిపించినాగానీ అది ఏ పాట, సన్నివేశం, హీరో ఎవరు, ఏ సినిమా... లాంటి వివరాలు ఠక్కున చెప్పేసేవాణ్ణి.