తెలుగురాని పిల్లలు తల్లిదండ్రులకే సిగ్గుచేటుకోకా విమలకుమారికొందరు కేవలం రచయితలుగానే ప్రసిద్ధి చెందుతారు. మరికొందరు తెలుగు సాహిత్యానికి కార్యకర్తలుగా ఉంటూ తమదైన ముద్ర వేసుకుంటూనే తను కూడా ఒక గొప్ప రచయితగా రాణిస్తూ ఉంటారు. అంటువంటి రెండోకోవకు చెందిన కవయిత్రి, కథానవలారచయిత్రి , విమర్శకురాలు, నటి కోకా విమలాకుమారి. తెలుగు భాషోద్యమంలో ఆమెది ముఖ్యపాత్ర. ఈనాటి తెలుగు విద్యార్థులు తెలుగు భాష రాకుండానే డిగ్రీ పట్టాలు పుచ్చుకోవడం తల్లిదండ్రులకే సిగ్గుచేటు అంటున్న విమలకుమారి ఇంటర్వ్యూ..

కృష్ణజిల్లా పులిగడ్డలో జన్మించారు విమలకుమారి.ఆమె తండ్రి ఆదిని సుబ్బారావు. తల్లి శేషమ్మ. ఎనిమిదిమంది సంతానంలో మూడోవారు విమలకుమారి. తండ్రి నీటిపారుదల శాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. బాల్యంనుంచీ తండ్రి స్ఫూర్తితో పద్యాలు, చారిత్రక వీరుల, వీరనారుల కథలు, ఆధ్యాత్మికాంశాలను ఎంతోబాగా నేర్చుకున్నారు. చదువంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆడపిల్లలకు చదువెందుకు అని ఏడోతరగతిలోనే చదువుమానిపించేశారు. కానీ విమలకుమారి ఏడాదిపాటు పోరాడి, మేనమామ ప్రోత్సాహంతో బాపట్ల స్కూల్లో తొమ్మిదోతరగతి పూర్తిచేశారు. వివాహం వల్ల మళ్ళీ ఆమె చదువుకు అంతరాయం కలిగింది. ఐదేళ్ళ కాపురంలో ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె చదువుకాంక్ష పోలేదు. దాంతో భర్త సహకారంతో ఒకవైపు పిల్లల్ని సముదాయించుకుంటూ ప్రైవేటుగా పియుసి పాసయ్యారు. విజయవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో రాత్రిపూట క్లాసుల్లో చేరి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, హైదరాబాద్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌ కోర్సు (బి.పి.డి) చేశారు. ఆ తర్వాత గుంటూరు ఆంధ్రాయూనివర్సిటీ పీజీ సెంటర్‌లో ఎం.ఏ పూర్తిచేసి, హైదరాబాద్‌ సెంట్రల్‌ స్కూల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగంలో చేరారు విమలకుమారి. బాపట్లలో తను చదువుకున్న ప్రభుత్వ స్కూల్లోనే ఫిజికల్‌ డైరెక్టర్‌గా ఉద్యోగం పొందారు.

సాహిత్యం

విమలాకుమారి కవిత్వ గురువు ప్రముఖ కవి, సాహితీవేత్త, సినీ రచయిత నాగభైరవ కోటేశ్వరరావు. ఆమె కవిత్వ మా‌ధుర్యాన్ని గుర్తించి ప్రోత్సహించారాయన. ఆమె తొలి కవితాసంపుటి అక్షర సందేశం’ ప్రచురణకు ఆయనే ప్రేరణ. మధ్యతరగతి మానవసంబంధాలు, సామాజిక రుగ్మతలపై ప్రతిఘటనేఈ కవితాసంపుటి ప్రధానవస్తువు.సమాజంలో నశించిపోతున్న మానవ విలువలు, ఆనాటికి వీగిపోతున్న ఉమ్మడికుటుంబ వ్యవస్థలే కవితావస్తువుగా ఆమె రాసిన రెండో కవితా సంపుటి ‘అరుణిమ కోసం’. ఆ తర్వాత వెలువడిన ‘నిశ్శబ్ద వేదన’, ‘నవ్యపథం’ కవితా సంపుటిలు రెంటిలోనూ స్ర్తీల అక్రమ రవాణా, మహిళాసాధికారిత వంటివన్నీ కవితావస్తువులుగా కనిపిస్తాయి.కాగా, ‘పున్నమి నవ్వింది’, ‘మనసు కదిలింది’ ఆమె కథాసంపుటిలు. అన్నిరకాల సామాజికాంశాలను స్పృశించాయి ఆమె కథలు. ఆడపిల్లలపై యాసిడ్‌ దాడులను వ్యతిరేకిస్తూ ఆమె రాసిన కథ ‘మనసు కదిలింది’. సస్పెన్స్‌, హాస్యం మేళవించిన కథ ‘బృంద’. ‘‘గృహ హింస, ఆఫీసులలో చెప్పుకోలేని వేధింపులు, యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, ప్రేమ పేరిట మోసాలు...ఇలా సమాజంలో ఎక్కువ బాధింపబడుతున్నది స్ర్తీలే.

అందుకే నా కవిత్వం, కథలు, నవల, వ్యాసాల్లో స్ర్తీలు, మహిళాసాధికారిత గురించే ఉంటుంది’’ అంటారు విమలకుమారి.‘తరుణీ తరంగాలు’, ‘విమలభారతి’, ‘కనుపర్తి వరలక్ష్మమ్మ జీవితం–సాహిత్యం’ ఆమె వ్యాస సంపుటులు. తొమ్మిదిమంది మహిళా రచయిత్రులతో కోకా విమలకుమారి వెలువరించిన ‘శ్రీకృష్ణదేవరాయ ప్రతిభాపుష్పం’ మరో వ్యాస సంపుటి. శ్రీకృష్ణదేవరాయలు సంగీత, సాహిత్య సామ్రాజ్యవైభవ వ్యాసాలే ఇవన్నీ. ‘విమలాభారతి’ పేరిట పేరిట ఆమె రాసిన 25సాహిత్య వ్యాసాలను హిందీ సాహిత్య అకాడమీ హిందీలోకి అనువదింపజేసింది.