మానవసేవే మాధవ సేవ. అదే మన కర్మభూమి సిద్ధాంతం. దీనులకు సేవ చేసేవారిని సామాన్య ప్రజలెప్పుడూ మనుషులలో దేవుడుగానే భావిస్తారు. అలాంటి అత్యున్నతమైన సేవాభావంతో వైద్యరంగంలో ఉన్నత విలువలను సృష్టించారు దేవనార్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ పద్మశ్రీ డాక్టర్‌ ఆలంపూరు సాయిబాబా గౌడ్‌. వృత్తిరీత్యా ఆయన ప్రముఖ నేత్రవైద్య నిపుణులు, రచయిత.

హైదరాబాద్‌ బేగంపేటలో అంధబాలలకు మూడు ద‌శాబ్దాలుగా ఆయన నిర్వహిస్తున్న ఉచిత విద్యాసంస్థ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.ఈ సంస్థ విద్యార్థులు గొప్ప చదువులు చదివి, బ్యాంక్‌ ఆఫీసర్లుగా, చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌గా, ఇతర రంగాలలో స్థిరపడి ప్రభుత్వానికి పన్నులు చెల్లించేస్థాయికి ఎదిగి సమాజంలో అందరితో సమానంగా ఉన్నతంగా, గౌరవప్రదంగా జీవిస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే, ఆయన విద్యాసంస్థ అంధబాలలకు ఓ స్వర్గథామం. అంతేకాదు,అం‌ధులు ఎవరిసహాయం లేకుండా ఇవిఎంల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేందుకు డాక్టర్‌ సాయిబాబాగౌడ్‌ సూచించిన పరిష్కారాన్నే ఎన్నికలసంఘం దే‌శవ్యాప్తంగా అమలుచేస్తోంది.పద్మశ్రీ బిరుదుతో సహా నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా ‘విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్న డాక్టర్‌ సాయిబాబాగౌడ్‌ ఇంటర్వ్యూ..

తండ్రి ఆశయం నెరవేర్చిన తనయుడు

మహబూబ్‌నగర్‌జిల్లాలోని మారుమూల ఆలంపూర్‌ గ్రామంలో జన్మించారు సాయిబాబాగౌడ్‌. ఆయన తండ్రి నర్సప్పగౌడ్‌, తల్లి దేవమ్మ. ఎనిమిది మంది పిల్లల్లో ఆయన చివరి సంతానం. తండ్రి నర్సప్ప తన పిల్లలను కల్లుగీత కులవృత్తిలోకి రానీయకుండా చదువులు చెప్పించారు.మెరిట్‌ స్టూడెంట్‌ కావడంతో టీచర్లు సాయిబాబాగౌడ్‌ను ఎంతో ప్రోత్సహించేవారు. హైదరాబాద్‌ నిజాం మెడికల్‌ కాలేజీలో మెరిట్‌లో సీటు సంపాదించుకుని, తండ్రి ఆశయసాధనకోసం ఎం.ఎస్‌ ఆప్తల్మాలజీ కోర్సుచేసి నేత్రవైద్య నిపుణుడయ్యారు. 1975లో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. సరోజినీదేవి హాస్పిటల్‌, నీలోఫర్‌, గాంధీ హాస్పిటల్స్‌లో పనిచేశారు. డాక్టర్‌ శివారెడ్డితో కలిసి గ్రామాల్లో పర్యటించి వేలాది వైద్యశిబిరాలు నిర్వహించారు.

దేవనార్‌ ఫౌండేషన్‌

నేత్రవైద్య నిపుణుడుగా ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు, తన వద్దకు చికిత్సకు వచ్చే కొంతమంది చిన్న పిల్లలకు ఇక శాశ్వతంగా చూపురాదన్న విషయాన్ని ఎంతో ఆవేదనతో చెప్పలేక చెప్పలేక తల్లిదండ్రులకు చెప్పేవారు ఆయన. తమబిడ్డ భవిష్యత్తు తల్చుకుని కొంతమంది తల్లిదండ్రులు బిగ్గరగా ఏడ్చేసేవారు. ఈ ఘటనలు చూస్తూ డాక్టర్‌ సాయిబాబాగౌడ్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు.‘‘వాళ్ళకి ఎలాగూ కంటిచూపు తీసుకురాలేం, కనీసం ఒక పాఠశాల పెట్టి మంచి విద్య నేర్పి సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా వారిని తీర్చిదిద్దాలి’’ అని సంకల్పించి 1991లో తల్లిదండ్రులపేరిట ‘దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ బ్లైండ్‌’ స్థాపించి వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

అంతర్జాతీయ విద్యాసంస్థగా..

డాక్టర్‌ సాయిబాబా గౌడ్‌ దంపతులు 1992లో నలుగురు అంధబాలబాలికలతో హైదరాబాద్ బేగంపేటలో దేవనార్‌ ఫౌండేషన్‌ ఇంగ్లీషు మీడియంలో ఉచిత పాఠశాల ప్రారంభించారు. కష్టాలకు, ఖర్చులకు ఆయన భయపడకుండా, ఆయన చిత్తశుద్ధీ, స్థిరసంకల్పంతో పాఠశాలను నడిపించారు. అలా నాలుగేళ్ళకు దాతలు ముందుకు రావడం ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం కూడా నిధులు సమకూర్చింది. నాటి నుంచీ నేటివరకు 12వ తరగతి వరకు అంధబాలలకు ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత భోజనం, ఉచితంగా దుస్తులు సమకూరుస్తున్నారు.గడచిన 27 ఏళ్ళలో ఇది అంతర్జాతీయ విద్యాసంస్థగా పేరుప్రఖ్యాతి గడిచింది.

అంధులకోసం ప్రపంచంలో ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా వెంటనే దానిని ఈ సంస్థలో ప్రవేశపెడతారు. ప్రస్తుతం ఈ సంస్థలో అంధుల విద్యాభ్యాసానికి ఇరవై రకాల సాఫ్ట్‌వేర్స్‌ ఉపయోగిస్తున్నారు. నాలుగు కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అంధవిద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. ఒక్క డ్రాపౌట్‌ కూడా లేకుండా ఈ సంస్థను నడుపుతున్నారు. ఇటీవల36 మంది అంధ విద్యార్థులు ఎసెస్సీ పరీ‌క్షరాస్తే, 222మంది ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు రాశారు. క్వశ్చన్‌పేపర్స్‌కు అంధ విద్యార్థులు ఒక సహాయకుడి ద్వారా ఆన్సర్స్‌ రాస్తారు.