వర్తమాన సాంఘిక సమస్యలపై చురకత్తి మొనల్లాంటి అక్షరాలు రాసే స్ర్తీవాద కవయిత్రి మందరపు హైమవతి.దేశవ్యాప్తంగా కవితా సమావేశాల్లో పాల్గొంటూ స్ర్తీవాద సమస్యలపై గొంతెత్తి ఫైర్‌బ్రాండ్‌ గా పేరొందారు. ‘వేదనాగ్నిలో పుటంపెట్టిన అక్షరాలే అసలైన కవిత్వం’ అంటారామె.. ‘నా రాతా–చేతా ఒకటే, ఒకటి రాసి మరొకటి చేసేవారు కవే కాదు’ అంటారు ఆమె.‘పురుషుల్ని ద్వేషించే స్వేచ్ఛాప్రియులే ఫెమినిస్టులు’ అనేది కేవలం దురభిప్రాయం. పురుషాహంకారాన్ని, వారిలోని సంకుచిత భావాలను ఖండించేదే స్ర్తీవాదం అని స్పష్టం చేస్తారు ఆమె.సాహిత్యంలోనూ, వాడుకభాషలోనూ స్ర్తీని నీచంగా చిత్రించే పదప్రయోగాలను నిషేధించాలని నిర్ద్వంద్వంగా చెబుతారామె.‘‘ఆకాశంలో సగం, చట్టస‍భల్లో 33 శాతం, స్ర్తీ పురుష సమానత్వం....లాంటివన్నీ రాజకీయ నినాదాలే. ఆచరణలో స్ర్తీకి సమానత్వ హక్కులు, ఆత్మగౌరవం, సంపూర్ణ రక్షణ కలిగించేదే అసలైన ప్రభుత్వం–ఆదర్శప్రభుత్వం అంటున్న హైమవతి ఇంటర్వ్యూ...

కృష్ణాజిల్లా విజయవాడ ఆవిడ పుట్టిన ఊరు. తండ్రి మందరపు కాసులు. తల్లి దుర్గాంబ. ఐదుగురు సంతానంలో పెద్ద కూతురుగా బాల్యంనుంచీ తండ్రి సాహిత్య విమర్శనాదృక్పథాన్ని పుణికిపుచ్చుకుని సాహిత్యాధ్యయనం చేస్తూ, తండ్రివెంట కవితాగోష్ఠుల్లో పాల్గొంటూ పన్నెండవ యేటే కవిత్వం రాయడం ప్రారంభించారు.భాషాప్రవీణ చదివి ప్రబంధ సాహిత్యం అధ్యయనంతో పూర్వసాహిత్యంపై పట్టు సాధించారు. కాళిదాసు ఆమె అభిమాన కవి. ఆ శ్లోకాలు, ప్రబంధ పద్యాలు నేటికీ ఆమెకు కంఠోపాఠమే.బాల్యంనుంచీ హైమవతి పద్యాలే రాసేవారు. శ్రీశ్రీ కవిత్వాన్ని కంఠస్థం చేసి, తిలక్‌, బైరాగి కవిత్వం, జాషువ పిరదౌసి పద్యాలు ఒంటబట్టించుకున్నాక వచన కవిత్వం ప్రారంభించారు.‘‘కవిత్వమే నా ఉచ్ఛ్వాస, కవిత్వమే నా నిశ్వాస, ‘రాయకుండా ఉండలేను’ అనుకున్నప్పుడు మాత్రమే కవిత్వం రాస్తాను’’ అంటారు ఆమె.

స్ర్తీవాద రచయిత్రిగా గుర్తింపు

ఆంధ్రజ్యోతి ‘ఈవారం కవిత’ శీర్షికలో ఆమె రాసిన ‘సర్పపరిష్వంగం’ తో స్ర్తీవాద కవయిత్రిగా రెండు దశాబ్దాలక్రితం హైమవతి వెలుగులోకి వచ్చారు.భార్యాభర్తలు తనువులు ఒకటై అద్వైత స్థితి పొంది ఈ లోకాన్నే మరచిపోయిన ఘడియల్లో, చెవిలో గుసగుసగా, ‘జీతం ఎప్పుడిస్తారు?’ అని అడిగే భర్తలు సిగ్గుతో తలదించుకుని పశ్చాత్తాప పడేలా చేస్తుంది హైమవతి రాసిన ‘సర్పపరిష్వంగం’ కవిత. ఆమె కవిత్వంపై చేరా చేసిన సమీక్ష ఆమెకు స్ర్తీవాద కవయిత్రిగా దన్నునిచ్చింది.‘‘ఆ సమయంలో వేశ్య కూడా ఆ ప్రసక్తి తేదు/పశువైనా ప్రవర్తించదు మరోవిధంగా/ఒక్కసారి వేయి రాక్షసబల్లులు మీద పాకినట్టు మనసు ఝడుసుకున్న ఆ క్షణంలో....../భారతస్ర్తీనైనందుకు/సంప్రదాయ సజీవసమాథిలో/ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ/వివాహం ఊబిలో కూరుకుపోతున్నప్పుడు...../క్షణ క్షణం రాజీపడుతూనే/నిత్య పర్యంతం బ్రతికేస్తూనే ఉంటాను నీ సర్పపరిష్వంగంలో’’ లాంటి ఆమె కవితలెన్నో దేశవ్యాప్తంతా పలుసాహిత్య సమ్మేళనాల్లో సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాయి.

‘‘అమ్మ కడుపులో ఉమ్మనీటి సరస్సు నుంచి/కొత్త ప్రపంచ పొత్తిళ్ళలోనికి ఓ తామరమొగ్గలా ఉదయించాలనుకుని రోజులు లెక్కబెడుతున్నదాన్ని/నా రాకను నిషేధిస్తావెందుకు...../మెడలో పసుపుతాడు బిగిసినాక/తెరవెనుక సూత్రధారుడాడిస్తే ఆడే తోలుబొమ్మలా....../తలమాత్రమే లేని శిలావిగ్రహంలా/మిగిలిపోతానని బాధపడుతున్నావా అమ్మా’’ అంటూ పొత్తిళ్ళలోనే కడదేరిపోయే గర్భస్థశిశువు ఆక్రందనను కళ్ళకుకట్టే ‘నిషిద్ధాక్షరి’ కవిత శక్తిమంతమైన ఆమె స్ర్తీవాద భావజాలానికి మరో మచ్చుతునక.‘‘చొంగకార్చే నాలుకలు ప్రేక్షక కళాపోషకులు/దేశాల సరిహద్దుల రేఖలు గీచినట్టు/దేహాన్ని ఇలా అవయవ స్ఫూర్తిగా/విభజించిందెవరు...../ఈ కొలతలేమిటి....మూసలో బంగారాన్ని కరిగించినట్టు మనసులో వేదనను మరిగించిందెవరు....’’ అంటూ ప్రపంచీకరణ నేపథ్యంలో జాడ్యంలా పట్టుకున్న అందాలపోటీలను ‘సంతకాలు చేద్దాం రండి’ అనే తన కవితలో దునుమాడారు హైమవతి. ‘వంటింటి సూరీడు’ లాంటి ఇంకా ఎన్నో గొప్ప కవితలు రాశారు.