ఊర్వశి శాపం

పరమేశ్వర కటాక్షం, పాశుపతాస్త్రం లభించడంతో తన జన్మ సార్థకమయిందని అర్జునుడు ఆనందించాడు. అంతలో అతని ముందు తళతళమని మెరుపులు మెరిశాయి. విమానాలు దిగాయి. ఆ విమానాల్లోంచి కుబేర, యమ, వరుణులతో కలసి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు వారందరికీ నమస్కరించి వినయంగా నిల్చున్నాడు.‘నేను యమధర్మరాజుని. వీరు కుబేర, వరుణేశ్వరులు. వారు దేవేంద్రులన్న సంగతి నీకు నేను చెప్పనవసరం లేదు. పరమేశ్వర కటాక్షంతో నీవు పాశుపతాస్త్రాన్ని సంపాదించావని తెలుసుకుని మేమంతా సంతోషించాం. ఆ సంతోషంతో నీకు మరిన్ని దివ్యాస్త్రాలు ప్రసాదించేందుకు మేము సంకల్పించాం. ఆ దివ్యాస్త్రాలతో నీవు దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల దివ్యాంశలతో జన్మించిన అనేక క్షత్రియ వీరులను అనాయాసంగా వధించగలవు. ప్రభాకరదేవుని అంశతో జన్మించిన ఆ రాధేయుని కూడా నీవే నిర్జించగలవు’ అన్నాడు యమధర్మరాజు. దండాయుధాన్ని బహూకరించాడు. వరుణేశ్వరుడు పాశాస్త్రం ప్రసాదించాడు. కుబేరుడు కుబేరాస్త్రం ప్రసాదించాడు. పరమేశ్వరుని వల్ల పాశుపతాస్త్రం, దిక్పాలకులవల్ల వేర్వేరు విశిష్టాయుధాలను సంపాదించి అరివీరులను అణచేసేందుకు మహోత్సాహంతో ముందుకు ఉరుకుతున్న అర్జునునితో-‘ఆ పరమేశ్వర కటాక్షంతో పాశుపతాస్త్రమే కాకుండా నీకు అమరత్వం కూడా లభించింది. పైగా నేను కూడా నీకు అనేక అస్త్రాలను బహూక రించాలని అనుకుంటున్నాను. అదలా ఉండగా నీవు ఇక మీదట చాలా దేవకార్యాలు నిర్వర్తించవలసి ఉన్నది. వీటన్నిటి కారణంగా నీవు అమరావతి విచ్చేయవలసి ఉన్నది. మాతలి రథంతో నీ ముందుకొస్తాడు. నీవది అధిరోహించి అమరావతికి త్వరలోనే చేరుకో’ అన్నాడు దేవేంద్రుడు. మరుక్షణం అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. కాస్సేపటికి అర్జునుడు చూస్తూండగానే ఆకాశంలో శచీపతి అమరస్యందనం గోచరించింది. ఉత్తమాశ్వాలతో, వివిధాయుధాలతో కిందికి దిగి వచ్చిన ఆ దివ్య వాహనం అర్జునునికి అపూర్వ ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవవేంద్ర సారథి మాతలి అర్జునుని సమీపించి-‘ఎన్నెన్నో రాజసూయాలు, అశ్వమేధాలు చేసిన పుణ్యాత్ములకు కూడా ఈ దివ్య స్యందనాన్ని అధిరోహించే అర్హత కలుగలేదు. నీకు మాత్రమే కలిగింది. అందుకు కారణం నీవు అమరేశ్వరుని కుమారుడు కావడమే! ఆలసించక రథాన్ని అధిరోహించండి! అమరావతికి విచ్చేయండి’ అన్నాడు.

మాతలి ఆనతి శిరసావహించి స్యందనాన్ని అధిరోహించబోతూ మందరగిరిని ఈ ప్రకారంగా వీడ్కొన్నాడు అర్జునుడు.‘మహా మహీధరా! నీ కరుణాకటాక్షంతోనే నేనీ రోజు అమరావతీనగరాన్ని సందర్శించబోతున్నాను. స్వర్గలోక ప్రయాణానికి నాకు అనుమతిని ఇవ్వు’అర్జునుడు అనతికాలంలోనే స్వర్గ రాజధాని అమరావతికి చేరుకున్నాడు. అక్కడి ఐరావతాన్ని చూసి ఆనందించాడు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు అర్జునుని అభినందించి ఆశీర్వదించారు. మనోహర సంగీతాలతో, సుందర నృత్యాలతో అప్సరసలు అర్జునుని హృదయం చూరగొన్నారు. అర్జునుడు దేవేంద్ర మందిరంలోకి ప్రవేశించి శచీపతి చరణయుగళినంటి సాష్టాంగ నమస్కృతి సమర్పించాడు. కొడుకును గుచ్చి కౌగిలించుకున్నాడు దేవేంద్రుడు. తర్వాత తన సరసన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మహనీయులకు కూడా దుర్లభమయిన అర్జునుని వైభవాన్ని చూసి సిద్ధులు, సాధ్యులు, గంధర్వాదులు వేనోళ్ళ అతన్ని కొనియాడారు. అపూర్వ సత్కారాలతో అర్జునుని అభినందించిన అనంతరం అతనికి ఓ విచిత్ర భవనంలో వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా అమరేంద్రుడు ఆజ్ఞాపించాడు. వారి ఆజ్ఞ మేరకు ఏర్పాటు చేసిన భవనంలో అర్జునుడు హంసతూలికాతల్పంపై విశ్రమించి, గంధర్వ గాయకుల గానగోష్ఠితో వినోదించాడు. ఇక్కడిలా ఉంటుండగా గంధర్వప్రముఖుడు చిత్రసేనుని తన సన్నిధికి పిలిచి, అతిలోక సౌందర్యవతి ఊర్వశిని అర్జునుని శయ్యాగృహానికి పంపించాల్సిందిగా అమరేంద్రుడు ఆజ్ఞాపించాడు.

చిత్రసేనుని నోటి వెంట అమరాధిపతి ఆన తి విన్న వెంటనే ఊర్వశి ఉప్పొంగిపోయింది. అర్జునుడంటే మోజు పడుతోన్న ఆమెకు వారి ఆనతి వరమనిపించింది. శరీరాలంకరణ ప్రారంభించింది. పన్నీట జలకాలాడింది. కస్తూరి, కర్పూర, కుంకుమలతో మేళవించిన శ్రీగంధాన్ని రాసుకుంది. చెంగల్వలను సిగలో తురుముకుంది. కనుదోయిపై కాటుకరేఖలు తీర్చిదిద్ది, సమున్నత స్తన యుగళిపై ముత్యాలమాలికను అలంకరించుకుని, ముంగురులను సవరించుకుని, వలపుతమకంతో కిరీటి విజయం చేసిన సౌధం వైపు సాగిపోయింది. కాస్సేపటికి మధుర మంజీర స్వనంతో అర్జునుని మందిరంలోకి ప్రవేశించింది. ఆమె రాకను గమనించిన అర్జునుడు చేతులు జోడించి-