‘‘విన్నావా బావా! కర్ణుని మాటలు! ఇక ఆలస్యం దేనికి? రథాన్ని అటుగా పోనీయ్‌’’ అన్నాడు అర్జునుడు. భీషణ ధనుష్టంకారంతో దశ దిశలు భేదించాడు. రథం కర్ణుని ముందుకు పరుగులెత్తింది. అలాగే కర్ణుని రథం కూడా అర్జునుని ముందుకు వేగంగా ఉరికి రాసాగింది. అప్పుడు కర్ణార్జునులిద్దరూ పరశురాముళ్ళా ఉన్నారు. ప్రచండ గ్రీష్మాదిత్యుళ్ళా ఉన్నారు. ప్రత్యక్ష ఫాలాక్షుళ్ళా ఉన్నారు. వారిద్దరినీ అలా చూస్తూ చేతుల్లోని ఆయుధాలను జారవిచారు సైనికులంతా.అసహాయశూరులై ఒకర్నొకరు ఎదుర్కొంటోన్న కర్ణార్జునుల సంగ్రామ చాతుర్యాన్ని చూసేందుకు కురుక్షేత్రంలోని సైనికులే కాదు, ఆకాశంలోని అమరులు, పితృదేవతలు, విద్యాధరులు, తపోధనులు, ఇంకా అనేకులతో పాటు ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు కూడా ఉత్కంఠగా తరలిరాసాగారు. శివునికి నమస్కరించి బ్రహ్మ ఇలా వేడుకున్నాడు.‘‘కర్ణార్జునులిద్దరూ అతిరథులు. సమాన శౌర్యశక్తి సంపన్నులు. మహాయోధాగ్రేసరులు. ఒకరినొకరు ఈ ఇద్దరూ ఎదుర్కొంటే ఇంకేమయినా ఉందా? సృష్టి సమస్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ వీరుల్ని శాంతింపజేసే బాధ్యత నీదే’’‘‘పంకజాసనా! కర్ణార్జునుల యుద్ధం అనివార్యం. ఈ యుద్ధం జరిగి తీరాలి. వేడుకోలుకు తావులేదు’’ అన్నాడు శివుడు.బ్రహ్మను సమీపించాడు ఇంద్రుడు. ఇలా అడిగాడు.‘‘లోకస్రష్టా! కర్ణుణ్ణి అర్జునుడు చంపగలిగేలా అనుగ్రహించు.కర్ణుడు మరణిస్తే ద్రోణాది వీరులంతా చేరుకున్న పుణ్యలోకాలు చేరుకుంటాడు. సుఖంగా ఉంటాడు. పాపం! అర్జునుని సంగతి నీకు తెలియంది కాదు, పడరాని పాట్లు పడ్డాడు. అరణ్య అజ్ఞాతవాసాలంటూ సుఖం లేకుండా పోయిందతనికి. నువ్వు అనుగ్రహిస్తే ఇక మీదయినా సామ్రాజ్య సౌఖ్యాలు అనుభవిస్తాడు. అందుకే వేడుకుంటున్నాను’’‘‘అప్పుడే జయాపజయాల వరకు వచ్చావే! యుద్ధం ప్రారంభం కానీ’’ అన్నాడు బ్రహ్మ. ఇంద్రుడు తలొంచుకున్నాడు. బాధగా శివుణ్ణి చూశాడు.

‘‘శచీశ్వరా! పురాణ మునీంద్రులయిన నరనారాయణులే ఈ కృష్ణార్జునులు. వీరికి పరాజయం ఉండదు. లేదు. అందువల్ల నువ్వు కోరుకున్నట్టుగానే అంతా అవుతుంది. నీ కోరికే నెరువేరుతుంది’’ అన్నాడు శివుడు. అనుగ్రహిస్తున్నటుగా తలూపాడు.కృష్ణార్జునులు, కర్ణ శల్యులు శంఖ ధ్వానాలతో భూనభోంతరాళం అల్లల్లాడించారు. కర్ణుని పతాక హస్తికక్ష్య, అర్జునుని కపికేతనం ఆ శూరుల అనన్య సామాన్య తపః ప్రభావం వల్ల సజీవాలై అలరారాయి. గజకక్ష్యలో గల మత్తేభంపై హనుమంతుడు విజృంభించాడు. ఇద్దరి మధ్యా పెద్ద యుద్ధం జరిగింది. కర్ణుని కేతన హస్తి ఓడిపోయింది. గొంతెత్తి ఆక్రోశించింది. అదే సమయంలో కృష్ణార్జునులిద్దరూ శల్య కర్ణుల్ని కోపంగా చూస్తూ వీరావేశాలతో గొంతెత్తి గర్జించారు. వారి గర్జనకు ఎన్నడూ లేనిది కర్ణుడు మొదటిసారిగా భయపడ్డాడు. ఒక్క క్షణం వణికిపోయాడు. శల్యుడు అది గమనించాడు. ఆశ్చర్యపోయాడు.