కీటక వృత్తాంతం

బృహస్పతిని మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ధర్మరాజు.‘‘దేవమంత్రీ! ధ్యానం, ఇంద్రియనిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు...ఈ ఆరింటిలో ఏది అత్యుత్తమమయినది?’’‘‘ధర్మరాజా! నువ్వు పేర్కొన్న ఆ ఆరూ గొప్పవే! అందులో అహింస అత్యుత్తమం.’’ అన్నాడు బృహస్పతి. తర్వాత సెలవు తీసుకుని, దేవలోకానికి వెళ్ళిపోయాడు. బృహ స్పతి నిష్క్రమించడంతో భీష్ముని ప్రశ్నించాడిలా ధర్మరాజు.‘‘పితామహా! మునీశ్వరులంతా ముక్తకంఠంతో అహింస చాలా ఉత్తమమని అంటున్నారు. ఎందుకది అంత గొప్పది?’’వివరించసాగాడిలా భీష్ముడు.‘‘మనో వాక్కాయ కర్మలతో హింస, మాంసభక్షణం అన్నవి చతుర్విధ ఘోర పాపాలు. మాంసభక్షణం మహాపాపంతో సమానం. అయితే మాంసం రుచి మరిగిన వారు దాన్ని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకనే మాంసభక్షణను విడిచి పెట్టడమే అహింస అని ఆర్యులు అంటున్నారు.’’‘‘పితామహా! మాంసం పితృదేవతలకు అత్యంత ఇష్టమనీ, పైతృక క్రియ మాంసంతోనే నిర్వర్తించాలనీ పెద్దలంటారు. అలాంటప్పుడు జంతువధ తప్పనిసరి కదా?’’ అన్నాడు ధర్మరాజు. సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు భీష్ముడు. తర్వాత ఇలా అన్నాడు.‘‘ధర్మరాజా! మాంసభక్షణను మానుకోవడం అశ్వమేధయాగం కన్నా గొప్పది. వధించమని చెప్పడం, వధ...ఈ రెండూ మహాపాపాలు. అయితే పితృకార్యాలలోనూ, యజ్ఞయాగాదులలోనూ వేదం చెప్పినట్టుగా చేయడంతో ఆ హింస వల్ల పాపం ఎంతమాత్రం అంటకోదు. అయితే మాంసం మీద మోజుతో కావాలని ప్రాణుల్ని హింసిస్తే అది మహాపాపం. తనని నమిలి మింగిన వాణ్ణి మాంసం నమిలి మింగడం ఎప్పటికయినా జరిగి తీరుతుంది. మాంసం మహారుచిగా ఉంటుంది.అందుకనే దాన్నంతా ఇష్టపడతారు. అలాంటి రుచిని కాదనుకుని, మాంసాన్ని విసర్జించినవాడు దేవతలతో సరిసమానుడని పెద్దలంటారు. రాళ్ళల్లోనూ, చెట్లలోనూ మాంసం లభించదు. లభించేది ప్రాణుల వల్లనే! ప్రాణులను కత్తికో కండగా నరుకుతున్నప్పుడు, తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షంలో అతను అందుకు మళ్ళీ పూనుకోడు. మాంసభోజనాన్ని విడిచిపెడితే, అతనిలోని హింసాప్రవృత్తి దానంతటదే పోతుంది. మాంసాహారాన్ని మానుకుంటే ఆయురారోగ్యాలు పెరుగుతాయని మార్కండేయాది మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే దేవతలు, రాక్షసులను అవలీలగా గెలువగలిగారు. దానం, ధర్మం, యజ్ఞయాగాదులన్నీ అహింస ముందు దిగదుడుపే! నూరు సంవత్సరాలు చేసిన తపశ్చర్యా, మాంసాహారాన్ని మానుకోవడం రెండూ ఒక్కటే అంటారు పెద్దలు. తపస్సు, దానధర్మాలతో బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కాని మాంసాన్ని ముట్టని వారికి బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. కనీసం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజాలలో మాంసాన్ని ముట్టని వారికి ఆయురారోగ్య బలకీర్తులు అనాయసంగా లభిస్తాయని పెద్దలంటున్నారు.’’‘‘పితామహా! మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పదనం ఉంది కదా, మరెందుకు మనుషులు మాంసాన్ని విసర్జించరు?’’ అడిగాడు ధర్మరాజు.

‘‘ఎందుకు విసర్జించరంటే అది మహారుచి. పైగా దాన్ని తిన్నవారు శృంగారంలో బలిమి కలిగి ఉంటారు. ఎంత దూరం నడిచినా అలుపు రాదు వారికి. గాయాలు మానిపోతాయి. బక్కచిక్కిన వాడికి మాంసభక్షణ పుష్టి కలిగిస్తుంది. అందుకే వదలరు దాన్ని. అయితే ఒక్క విషయం,ప్రాణభయం జీవాలకన్నింటికీ ఒకటే! అందుకే తోటి ప్రాణుల్ని దయగా చూడమంటారు. అలా చూసిన వాడు బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు. దానం, తపస్సు, సత్యం, యజ్ఞం, శౌచం, మంత్ర తంత్రాలు...ఇవన్నీ అహింసా స్వరూపాలు.’’ అని ముగించాడు భీష్ముడు.‘‘పితామహా! కురుక్షేత్ర సంగ్రామంలో మరణించినవారికి ఎలాంటి గతులు కలిగియో చెప్పండి. జననమరణాలను మించిన సుఖదుఃఖాలు లేవని అందరికీ తెలుసు. తెలిసినా అనేకులు యుద్ధరంగంలో ప్రాణాలను తృణప్రాయంగా చూసి, వదిలారు. అందుకనే అడుగుతున్నాను, చెప్పండి, మన యుద్ధంలో మరణించిన వారికి ఏఏ గతులు కలిగాయి?’’ అడిగాడు ధర్మరాజు.‘‘ధర్మరాజా! దీనికి నీకు సమాధానం చెప్పే ముందు, కీటక వేదవ్యాసుల మధ్య జరిగిన ఒకానొక సంవాదం గురించి నీకు తెలియజేస్తాను. విను.’’ అన్నాడు భీష్ముడు.‘‘ఇది వింటే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.’’ అన్నాడు. చెప్పసాగాడిలా.