అర్జునునితో త్రిగర్త దేశాధీశుల యుద్ధం

ధర్మరాజు అశ్వమేధయాగ దీక్ష స్వీకరించాడు. వేదోక్తంగా ఆశీర్వచనాలు అందుకున్నాడు. నారచీర, జింకచర్మాల్ని భుజాల మీద ఉంచుకుని, దండం చేబట్టాడు. బంగారు నగలు ధరించాడు. ఋత్విక్కులు, ఋషుల మధ్య పవిత్ర అగ్నిహోత్రంలా వెలిగిపోసాగాడు.యథావిధిగా వ్యాసుడు అశ్వమేధయజ్ఞ తురంగాన్ని విడిచిపెట్టాడు. అది భూమిని చుట్టు ముట్టేందుకు బయల్దేరింది. ధర్మరాజు అనుమతితో అర్జునుడు, గాండీవం చేపట్టాడు. యజ్ఞతురంగాన్ని అనుసరించాడు. యజ్ఞతురంగాన్ని పట్టుకుని అర్జునుడు నడుస్తోంటే, అతని వెన్నంటి చతురంగ బలాలు ప్రయాణిస్తోంటే హస్తినాపుర ప్రజలంతా జయజయధ్వానాలు చేశారు. అభినందించి, ఆశీర్వదించారు. అర్జునుని యాజ్ఞ్యవల్క్య శిష్యుడు, అనేక మంది బ్రాహ్మణులతో అనుసరించాడు. భూమికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా యజ్ఞతురంగం ఉత్తరదిశగా ప్రయాణించింది. త్రిగర్తదేశం చేరుకుంది.తమ దేశంలోనికి యజ్ఞతురంగం చేరుకున్నదని వేగుల ద్వారా తెలుసుకున్నారు, త్రిగర్త దేశాధీశ్వరుని పిల్లలూ, మనవలూ. కోపంతో ఊగిపోయారు. ఆ తురంగాన్ని చేజిక్కించుకోవాలనుకున్నారు. అపార సైన్య సమేతులై యుద్ధానికి సిద్ధమయ్యారు. అర్జునునికి ఎదురు నిలిచారు. తురంగాన్ని కదలనీయరాదన్నారు. పిల్లల ఆవేశకావేషాలు చూసి నవ్వుకున్నాడు అర్జునుడు. ఇలా అన్నాడు.‘‘వద్దు, మీకీ అల్లరి తగదు. యజ్ఞతురంగాన్ని అడ్డగించడం మహాపాపం. అయినా మనకీ మనకీ అనవసర శత్రుత్వం దేనికి? తప్పుకోండి.’’తప్పుకోలేదు త్రిగర్తశూరులు. సూర్యవర్మను ముందు ఉంచుకుని, యుద్ధాన్ని ప్రారంభించారు. వారించాడు అర్జునుడు. ఇలా అన్నాడు.

‘‘వీరులారా! ధర్మరాజు అజాతశత్రువు. అపార కరుణాసాగరుడు. నన్నీ తురంగమ రక్షణార్థం పంపుతూ వారేమన్నారో తెలుసా?’’‘‘ఏమన్నారు?’’‘‘భారత రణరంగంలో మహరాజులంతా ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు మిగిలారు. ఆ పిల్లలని సంహరించడం అన్యాయం. పిల్లలతో యుద్ధం భావ్యం కాదు. ఒకవేళ వారు యుద్ధానికి సన్నద్ధులయితే వద్దని వారించండి అన్నారు. అందుకే మీతో యుద్ధం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపొండిక్కణ్ణుంచి.’’ అన్నాడు అర్జునుడు. వినలేదు వారు. ధనుస్సులూ, కత్తులూ చేపట్టి ప్రవాహంలా ముందుకు ఉరకసాగారు.‘‘ఊరకనే ప్రాణాలను బలిపెట్టకండి.’’ మళ్ళీ హెచ్చరించాడు అర్జునుడు. అతని హెచ్చరికను పట్టించుకోలేదు సూర్యవర్మ. చిచ్చర పిడుగుల్లాంటి బాణాల్ని అర్జునుని మీద గుప్పించాడు. వాటిని మార్గమధ్యంలోనే తుత్తునియలు చేశాడు అర్జునుడు. అది గమనించాడు సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ. అర్జునుని మీద దండెత్తాడు. గుప్పెడు బాణాల్ని ప్రయోగించాడు. వాటిని కూడా అర్జునుడు మధ్యలోనే ముక్కలు ముక్కలు చేశాడు. మరో తమ్ముడు ధృతవర్మ యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అర్జునునితో పోరాటానికి దిగాడు. వందలకొలదీ బాణాలను ప్రయోగించాడు అతని మీద. నిశిత శరపరంపరతో ధృతివర్మను చీల్చి చెండాడే వాడే అర్జునుడు, పిల్లాడని ఊరుకున్నాడు. అర్జునుడు ఊరుకుంటున్న కొలదీ ధృతవర్మ రెచ్చిపోసాగాడు. గమనించాడది అర్జునుడు. ప్రతాపం చూపించాలనుకున్నాడు. పది బాణాలను ఒక్కసారిగా ప్రయోగించాడు. ఆ పది బాణాలూ ఒక్కుమ్మడిగా ధృతవర్మ గుండె మీద నాటుకున్నాయి. లక్ష్య పెట్టలేదు ధృతవర్మ, వాటిని పెరికి, గురి చూసి, అర్జునుని చేతిని నొప్పించాడు. గురి చూసి ధృతవర్మ చేసిన గాయానికి అర్జునుని చేతిలోని గాండీవం పట్టు తప్పి కింద పడింది. అది చూసి త్రిగర్తశూరులు వెర్రిగా ఆనందించారు. గొంతులెత్తి గర్జించారు.ఇంద్రధనుసులాంటి గాండీవం పట్టు తప్పడం ఏమిటి? కిందపడడం ఏమిటి? అర్జునుడు పరధ్యానంగా ఉన్నాడా? లేకపోతే పిల్లల మీద ప్రతాపం ఏమిటిని మిన్నకున్నాడా? ఎందుకని అర్జునుడు ఆగ్రహించడం లేదు? అతను ఆగ్రహించకపోవడం అదృష్టం. ఆ అదృష్టాన్ని వదులుకోకూడదు. మంచి తరుణం ఇది. మించిపోనీయకూడదు. ఇదే అదనుగా అర్జునుని మీద రెచ్చిపోవానుకున్నారు కొందరు.

అర్జునుడు గాండీవాన్ని అందుకుంటే కీడు మూడినట్టే! అది అతని చేతికి అందనీయకుండా చెయ్యాలనుకున్నారు. కలసికట్టుగా త్రిగర్తశూరులు అర్జునుని ఎదుర్కొన్నారు.వచ్చి పడుతున్న బాణాలను లెక్కచేయకుండా, అర్జునుడు కిందకి దిగి గాండీవాన్ని అందుకున్నాడు. దాన్ని అతను అందుకోకూడదని త్రిగర్త వీరులు ఎంతగానో ప్రయత్నించారు. కాని అది వారి వల్ల కాలేదు. గాండీవాన్ని అందుకున్న మరుక్షణం అర్జునుడు విజృంభించాడు. దారుణ బాణాలతో యుద్ధభూమిని కమ్మేశాడు. అతని బాణాలకు త్రిగర్త రథికులు అనేకులు ఆర్తనాదం చేస్తూ కుప్ప కూలిపోయారు. చనిపోయారు. క్షణానికి పదిమంది వంతున రథికులు ప్రాణాలు కోల్పోతుంటే అది చూసి, సైనికులు భయపడ్డారు. మూల మూలలకు పరుగుదీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు చాటు లేక దొరికిపోయారు. ప్రాణాలు పోతాయని తెలిసి, చేతులు జోడించారు.