‘‘చిన్న దెబ్బ తగిలిందని చెప్పాడు.కాస్సేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు. సరే అన్నాను. కానీ సాయంత్రమైపోయినా నిద్రలేవలేదు. నిద్ర లేపాలని వెళ్ళాను. ఒళ్లు చల్లగా ఉంది. ఎంత పిలిచినా లేవలేదు. దాంతో హాస్పిటల్‌కి తీసుకువెళ్లాను. అప్పటికే మరణించి కొన్ని గంటలు గడిచిందన్నారు. శరీరం లోపల తగిలిన దెబ్బవల్ల జరిగిన రక్తస్రావమే మరణానికి కారణం అంటున్నారు. నాకేమీ బోధ పడటంలేదు. అసలు నా స్నేహితుడికి ఏమైందో, ఎందుకు మరనించాడో మీరే తెలుసుకోవాలి’’ డిటెక్టివ్‌ శరత్‌ను వేడుకున్నాడు సుందరం.

‘‘మీ స్నేహితుడి పేరేంటి?’ అడిగాడు శరత్‌.‘‘రాబర్ట్‌. వాడు నేను కలిసి చదువుకున్నాం. ఉపాధ్యాయులుగా కలిసి ఒకేచోట ఉద్యోగం చేస్తున్నాం. నేను హిందీ చెప్తాను. వాడు సైన్స్‌ చెప్తాడు. ఇద్దరం ఫ్లాట్‌ రెంట్‌ షేర్‌ చేసుకుంటున్నాం’’‘‘దెబ్బ తగిలిందని ఎన్ని గంటలకు చెప్పాడు?’’‘‘ఉదయం పదకొండున్నరకు ఫ్లాట్‌కు తిరిగి వచ్చాడనుకుంటాను. నేను టైమ్‌ చూడలేదు. లంచ్‌ కూడా వద్దన్నాడు’’.‘‘మీ స్నేహితుడు పొద్దున్నే ఎక్కడకు వెళ్ళాడు?’’‘ప్రొద్దున్న ఎనిమిదికి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. ఎటెళ్లాడో తెలియదు. నేను అడగలేదు. ఇప్పుడే వస్తానని బండిమీద వెళ్ళాడు. వాడి బండిని పరిశీలించాను, ఏక్సిడెంటైన దాఖలాలు లేవు, బండి మామూలుగానే ఉంది’’.‘‘పోలీసులు ఏమైనా పరిశోధన చేశారా?’’‘తెలియదు.

వాళ్లు అంతగా పట్టించుకున్నట్టులేదు. కానీ నా స్నేహితుడికి ఏమైందో తెలియాలి’’ అన్నాడు సుందరం.‘‘సరే. నేను కేసు పరిశోధిస్తాను’’ అన్నాడు శరత్‌.‘అసలేమైందో తెలుసుకోవాలండీ. అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు’’ అన్నాడు సుందరం. పో‍స్టుమార్టమ్‌ డాక్టర్‌ పరమశివం శరత్‌వైపు చూసి నవ్వాడు.‘దెబ్బ తగిలినమాట నిజమేగానీ గాయం శరీరంపైన కనబడదు. ఆ ప్రభావం శరీరం లోపల పడింది. నరాలుచిట్లి రక్తస్రావమైంది. ఐతే దెబ్బ తగిలినట్లు ఇన్‌టైమ్‌లో గుర్తించకపోవటంవల్ల లోపలి భాగాలలో రక్తంనిండి ఊపిరి అందటం కష్టమైపోయి మరణించాడు’’ చెప్పాడు పరమశివం.