‘‘అమ్మా... నేను టెర్రస్‌పై క్రాకర్స్‌ కాల్చుకునేందుకు వెళ్తున్నా’’ అంటూ ప్లేట్లోని పెరుగన్నాన్ని గబగబా తినేసి పరుగుతీశాడు గోపాల్‌.‘‘ఒరేయ్‌ పిచ్చిసన్నాసి. ఆగరా...’’ అని లక్ష్మమ్మ అరుస్తున్నా అతను వినిపించుకోలేదు.30 ఏళ్లు దాటినా గోపాల్‌లో చిన్నపిల్లాడి చేష్టలు తగ్గలేదనుకుంది లక్ష్మమ్మ. దానికితోడు 150 కిలోల బరువుంటాడు కాబట్టి అందరూ అతడ్ని వింతగా చూస్తారు. పెళ్లానికి ఇతడి పొడగిట్టదు. అందుకే పెళ్లయిన కొంతకాలానికే విడిచిపెట్టి వెళ్లింది. దీపావళి రావడంతో వాచ్‌మ్యాన్‌ పిల్లలతో కలిసి క్రాకర్స్‌ కాల్చేందుకు టెర్రస్‌ మీదకు వెళ్లాడు గోపాల్‌.మంగాపురంలోని ఆ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ మీద గోపాల్‌ దగ్గరుండి పిల్లలతో క్రాకర్స్‌ కాల్పిస్తున్నాడు. కాస్త దూరంలో ఉన్న పక్క అపార్ట్‌మెంట్‌లో... వృద్ధ దంపతులిద్దరూ టెర్రస్‌ మీద ఈవెనింగ్‌ వాక్‌ చేస్తున్నారు. కాసేపటికి తర్వాత ‘టప్‌’ మని తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. 

అది దీపావళి తుపాకీ శబ్దం కాదని వెంటనే తెలిసిపోయింది వారికి. అనుమానంగా గోపాల్‌ క్రాకర్స్‌ కాలుస్తున్న అపార్ట్‌మెంట్‌వైపు చూశారు. గోపాల్‌ను కొంతమంది చుట్టుముట్టిన సీన్‌ కనిపించింది.‘‘అయ్యో... అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. వారంతా కలిసి అతడ్ని కొడుతున్నారు’’ అంటూ అప్రమత్తమైన దంపతులిద్దరూ వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేశారు.పోలీసులు వచ్చేసరికి అక్కడ సీన్‌ బీభత్సంగా ఉంది.ఒకటి కాదు రెండు కాదు మృతదేహంపై అంగుళానికో కత్తిపోటు ఉంది.

ఆ ప్రాంతమంతా రక్తమయమైంది. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ హత్యాప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల వాళ్ల దగ్గరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అక్కడే ఉన్న పూలకుండీ పక్కన చీకట్లో ఏదో మెరుస్తుండటాన్ని గుర్తించి సెల్‌ఫోన్‌ లైట్‌ వేశారు ఇన్‌స్పెక్టర్‌.‘‘సార్‌... ఇది బుల్లెట్‌ షెల్‌’’ అని కానిస్టేబుల్‌ అనడంతో అలర్ట్‌ అయ్యారు వెంకటరమణ.వెంటనే ఏసీపీ సయ్యద్‌ రఫీకి ఫోన్‌ కలిపారాయన.‘‘సార్‌... మంగాపురంలోని ఒక అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ మీద మర్డర్‌ జరిగింది. హంతకులు ఫైర్‌ ఆర్మ్‌ ఉపయోగించారు. బుల్లెట్‌ షెల్‌ దొరికింది’’ అంటూ తాను గుర్తించిన వివరాలను తెలిపారు.‘‘ఔనా... తుపాకులు ఉపయోగించారంటే సీరియస్‌ థింగ్‌. నేనిప్పుడే అక్కడికి వస్తున్నా’’ అన్నారు రఫీ.