‘‘అతడే.....’’ దూరం నుంచి చూపించాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.అతడిని పరీక్షగా చూశాడు డిటెక్టివ్‌ శరత్‌.‘‘ఇతడే హంతకుడని ఎలా నిర్ధారించారు?’’‘‘ప్రతి శని, ఆదివారాల్లో హత్య జరుగుతోంది. రాత్రిపూట ఒంటరిగా తిరిగే అమ్మాయిలను ఎంచుకుని హత్యలు చేస్తున్నాడు’’ చెప్పాడు విజయ్‌.‘‘ఆధారాలు?’’ అడిగాడు శరత్‌.

‘రెండు హత్యలు జరిగిన స్థలంలో సిగరెట్‌ పీకలు దొరికాయి. సిగరెట్‌ బ్రాండ్‌ ఆధారంగా హత్య ఇతడు చేసి ఉండవచ్చని అనుమానించాం. దూరం నుంచి మనవాళ్ళు ఫాలో అవుతూ ఇతడి కదలికల్ని కనిపెడుతున్నారు. అన్నోన్‌ పద్ధతిలో అతడిద్వారా కొంత సమాచారం సేకరించే యత్నం చేశారు. అయితే హత్యలు జరిగిన రోజుల్లో తాను ఏంచేశాడో, ఎక్కడ ఉన్నాడో ఇతను సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. హత్యలకు గురైన అమ్మాయిలను చివరిసారి సజీవంగా చూసినవాడు ఇతడే.తల అడ్డంగా ఊపాడు శరత్‌.‘‘ఇవన్నీ అనుమానించటానికి పనికొస్తాయిగానీ, నేరం నిర్ధారణకు పనికిరావు’’ అన్నాడు శరత్‌.‘‘హత్య జరిగిన విధానాన్ని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మన పోలీసు డిపార్ట్‌మెంట్‌ సైకాలజిస్ట్‌ సుందరం ఇచ్చిన ప్రొఫైల్‌ తయారు చేశాడు. ఆ ప్రొఫైల్‌ ఇతడికి సరిగ్గా మ్యా్‌చ్‌ అవుతోంది కూడా, అందుకే సీరియస్‌గా అతడిమీద దృష్టిపెట్టాం’’ అన్నాడు విజయ్‌.

‘‘నాకు ఆ ఫైలు, ఇతర వివరాలు అన్నీకావాలి. ఈ లోపు మీరు అతడి కదలికల్ని మరింత క్లోజ్‌గా పరిశీలించండి’’ అన్నాడు శరత్‌.‘‘అలాగే చేస్తాం, ఇంకా ఇవాళ బుధవారమే. ఒకవేళ శని ఆదివారాలలో హత్య జరిగేట్టయితే ఇంకా మనకి కొంత సమయం ఉంది’’ అన్నాడు విజయ్‌.‘‘ఇంతవరకూ అతడి ప్రతి కదలికను పసికట్టటంవల్ల ఏం తేలింది?’’‘‘ఏమీ తేలలేదు, మామూలు సమయాల్లో ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా మామూలుగా ఉంటాడు, సులభంగా గుంపులో కలిసిపోతాడు. హత్యకు సంబంధించిన టెండెన్సీ సాధారణ సమయంలో ఈ మనిషి ప్రవర్తనలో కనబడదు. కేవలం ఆ మూడ్‌ వచ్చినప్పుడు మాత్రమే మృగంలా మారిపోతాడు’’ చెప్పాడు విజయ్‌.