‘‘ఇదొక విచిత్రమైన కేసు, నీకు అప్పగిస్తున్నాను’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌, డిటెక్టివ్‌ శరత్‌కి ఫైలు అందిస్తూ.నవ్వుతూ ఫైలు అందుకుని చదవటం ఆరంభించాడు శరత్‌. అతడి భృకుటి ముడిపడింది. విజయ్‌వైపు చూశాడు.‘‘ఇదేమిటి?’’ అడిగాడు.

‘‘సమస్య అదే మరి.భార్య, భర్త, అతడు...అతడు హత్యకు గురయ్యాడు. భర్తే అతడిని చంపాడంటోంది భార్య. తనకేమీ తెలియదంటాడు భర్త. అసలు తన భార్యకు అతడితో సంబంధం ఉన్నట్టే తెలియదంటాడు. మరి అతడిని కలవటానికి ఎందుకెళ్లావని అడిగితే, ‘నీతో మాట్లాడాలి, రా’ అన్నాడంటాడు. కేసు గందరగోళంగా ఉంది’’ అన్నాడు విజయ్‌.వైభవ్‌–మానస భార్యాభర్తలు. మూడో వ్యక్తి మధుకర్‌. మానస, అతనూ కొలీగ్స్‌. వైభవ్‌ ఆఫీసు పనిమీద మరో ఊరు వెళ్లాడనుకుని, మానస, మధుకర్‌లు ఓ హోటల్‌లో గడిపారు. ముందు మధుకర్‌ హోటల్‌నుంచి బయల్దేరాడు. కాస్సేపటికి మానస బయల్దేరి, బయటకు వచ్చేసరికి హోటల్‌పక్కన చీకటి సందులో ఇద్దరు కొట్టుకోవడం కనిపించింది. వారిలో ఒకరు మధుకర్‌. అక్కడికి వెళ్లానుకుంది. కానీ, అవతలివ్యక్తి తన భర్తతోనే అని గుర్తుపట్టి, ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది.

చాలాసేపటికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. ఆమె నిద్ర పోతున్నట్టు నటించింది. అతడు ఆమెని ఏమీ అడగలేదు. ఫ్లైట్‌లో ఊరు వెళ్తున్నానని నోట్‌ రాసి, ప్రొద్దున్న ఆమె లేచేలోగా అతడు వెళ్లిపోయాడు. మధుకర్‌ని రాత్రి ఎవరో కొట్టి చంపారని ఆమె ఆఫీసుకొచ్చాక తెలిసింది. ఆమె తిన్నగా పోలీస్‌ స్టేషన్‌కి వెల్ళి తను చూసింది చెప్పింది. విమానం దిగ్గానే వైభవ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. తాను హోటల్‌ పక్కన సందులో మధుకర్‌తో కొట్లాట జరిగినమాట నిజమేగానీ, తన భార్యతో అతడికి సంబంధం ఉన్నట్టు తనకు తెలియదంటాడు వైభవ్‌. తనని కలిసేందుకు రమ్మని మధుకర్‌ పిలిస్తే వెళ్లానంటాడు. ఎన్నివిధాలుగా అడిగినా అదే సమాధానం. గొడవ జరిగాక, మధుకర్‌ తనని వదలి పారిపోయాడంటున్నాడు వైభవ్‌. రైలు మిస్సైంది, మర్నాడు ఉదయం ఫ్లైట్‌కి టికెట్‌ బుక్‌ చేసుకుని ఇంటికి వచ్చి తెల్లారే ఊరు వెళ్లానంటున్నాడు వైభవ్‌. మరి మధుకర్‌ని ఎవరు చంపినట్టు?’’