ఎదురింట్లో నుంచి పాప అరుపులు వినిపిస్తున్నాయి.‘ప్రసన్న... ప్రసన్న...’ అంటూ ఇంట్లోకి వెళ్లిన ఎదురింటావిడ బాత్‌రూమ్‌లోని సీన్‌ చూసి కెవ్వుమంది.బాత్‌రూమ్‌లో ఏడేళ్ల ప్రసన్న రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో పడి ఉంది.ఆమె అరుపు విని చుట్టుపక్కలవాళ్లతో పాటు ఆ ఇంటి సమీపంలోనే ఉండే పాపకు పిన్ని వరుసయ్యే వెంకటలక్ష్మి కూడా పరుగుపరుగున అక్కడికి వెళ్లింది.పాప గొంతు దగ్గరా చేతి మణికట్టు దగ్గరా బ్లేడ్‌తో కోసారెవరో. ఆ దృశ్యం చూసి బెంబేలెత్తిన వెంకటలక్ష్మి సాయం కోసం అరవడం మొదలెట్టింది. అక్కడే ఉన్న ఒక కుర్రాడు ప్రసన్నను అమాంతం ఎత్తుకుని మరికొందరి సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయినా ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స ప్రారంభించేలోగానే ప్రసన్న చనిపోయింది.‘‘అయ్యో... బంగారంలాంటి నా పాపను ఎవరు చంపారు...’’ అంటూ ప్రసన్న తల్లి భవాని ఆసుపత్రిలో భోరున విలపిస్తోంది.

‘‘మధ్యాహ్నం రెండుగంటలప్పుడే ఫోన్‌లో మాట్లాడాను కదా... నా బిడ్డను ఇప్పుడిలా చూస్తాననుకోలేదు’’ అంటూ తండ్రి కృష్ణమూర్తి కూడా కన్నీరుమున్నీరవుతున్నాడు.ఏడేళ్ల పాపను హత్య చేశారన్న వార్త మేడ్చల్‌ సమీపంలోని ఎల్లంపేట్‌ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తన బృందంతో ఆసుపత్రికి చేరుకున్నారు.అప్పటికే పోలీసులు కొన్ని వివరాలు సేకరించారు.కృష్ణా జిల్లా కొండూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి దశాబ్దం క్రితం బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్‌ వచ్చారు. కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య భవాని, ఇద్దరు ఆడపిల్లలు కావ్య, ప్రసన్న ఉన్నారు.

భవాని దగ్గర్లోని ఒక కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తోంది. కృష్ణమూర్తి తండ్రి కూడా వారితోనే ఉంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.‘‘పెద్దవాళ్లంతా ఉద్యోగాలకు వెళ్లారు సార్‌... దసరా సెలవులు కావడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో వీరితో పాటు పప్పీ అనే కుక్కపిల్ల కూడా ఉందట. ఇంట్లో నుంచి పాప అరుపులు విని ఎదురింటావిడ వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో ప్రసన్న కనిపించింది...’’ అని అక్కడే ఉన్న ఒక పోలీస్‌ తన బాస్‌ రాజశేఖర్‌రెడ్డికి వివరాలందించాడు.‘‘సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలిద్దాం పద’’ అంటూ ముందుకు కదిలారు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి.