డిటెక్టివ్‌ శరత్‌ ఆమెకు డబ్బులిచ్చాడు. ఆ డబ్బుతీసి ఆ వృద్ధురాలు ఏడుస్తున్న స్ర్తీకి అందించి ఈ డబ్బుతో కడుపునిండుగా ఏదైనా తెచ్చుకుని తినండి అని చెప్పి బయలుదేరింది. శరత్‌ ఆమెను వెంబడించాడు. ఆమె ఓ ఇంట్లోకి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చి తాళం వేసింది. నాలుగు సందులు తిరిగి మళ్ళీ అదే ఇంట్లోకి వెనుకవైపు నుంచి ప్రవేశించింది. శరత్‌ కూడా లోపలికి వెళ్ళాడు. లోపల ఏం జరిగింది? ఇంతకీ ఆమె ఎవరు?

*************************

‘‘హుస్సేన్‌సాగర్‌లో మూడురోజులక్రితం ఒక గుర్తుతెలియని శవం దొరికింది. పూర్తిగా పాడైపోయింది. తుపాకీతో కాల్చి చంపారని పోస్ట్‌మార్టమ్‌లో తెలిసింది. అతి కష్టం మీద అతడిని గుర్తించగలిగాం. పేరు నాసిర్‌. ఇంటికి వెళ్ళాం. భార్య ఐదుగురు పిల్లలు. విషయం తెలిశాక ఆమె శోకాలు పెట్టటం ఆరంభించింది. ఆమెకు అతడు ఏంచేస్తాడో, ఎటూ వెళ్తాడో ఏమీ తెలియదు. అడిగితే కొడతాడట. ఇంటి ఖర్చులకు అడిగితే డబ్బులు ఇచ్చేవాడట. అంతే’’ డిటెక్టివ్‌ శరత్‌కి చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.

‘‘ఇంతకీ నా దగ్గరకు ఎందుకు వచ్చినట్టు?’’ అన్నాడు శరత్‌.‘‘హత్య చేసేంత ద్వేషాలు ఏమైనా ఉన్నాయా అని ఆమెని అడిగాం. అతడి వృత్తి, వ్యాపారాలగురించి ఆమెకు కనీస సమాచారం తెలియదు. ఇల్లు వెతికాం. ఓ మూల ఇది దొరికింది’’ అని ఒక కాగితంముక్క చూపించాడు విజయ్‌. అది తెరిచి చూసి అందులో ఏముందో చదివాడు శరత్‌. అతడి కళ్లు చిన్న వయ్యాయి.నలిపి పారేసిన కాగితం ముక్క అది. దానిలో రాష్ట్ర గవర్నర్‌ ఇంటి మ్యాపు ఉంది. రాష్ట్రపతి హైదరాబాద్‌ వచ్చినప్పుడు నివాసముండే భవనం మ్యాపు ఉంది. మ్యాపుని ఎవరో పెన్సిల్‌తో గీశారు. గవర్నర్‌ భవనం నుంచి రాష్ట్రపతి భవంన వరకూ దారి గీసి ఉంది.‘ఇది కేసు స్వరూపాన్ని మార్చేస్తోంది’ అన్నాడు శరత్‌ ఆలోచిస్తూ.‘‘ముఖ్యంగా, ఇంకో మూడురోజుల్లో రాష్ట్రపతి వస్తున్నారు. ఆయన గవర్నర్‌ను కలిసిన తరువాత తన బంగళాకు వస్తారు. ఇప్పుడీ హతుడు నాసిర్‌ ఇంట్లో ఈ భవంతుల ప్లాను, దారి ప్లాను దొరికాయంటే సీరియస్‌గా టేకప్‌చేయాల్సిందే’’ అన్నాడు విజయ్. తల ఊపాడు శరత్‌.

******************