నాయుడుగారి సినిమా ముహూర్తంషాట్‌ చిత్రీకరణ ఆరోజు. పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మీడియాతో ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది. సభావేదిక సిద్ధం చేశారు. ఆ వేదికపైనుండే ముఖ్యఅతిథి సీల్డ్‌కవర్‌ చించి ఆ సినిమాలో నటించే హీరోయిన్‌ పేరు ప్రకటిస్తారు. మీడియా సహా అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. అందరికంటే ఎక్కువగా ఆమెలో మరింత ఉత్కంఠ! చివరకు అక్కడ ఏమైంది?

‘‘ఈ చిత్రసీమకి నిన్ను మకుటంలేని మహారాణిని చేస్తాను, నిర్మాతలందరూ నీ అడుగులకు మడుగులొత్తుతారు, నువ్వే కాబోయే సూపర్ హీరోయిన్‌’’ తన మాటలతో ఊరించాడు డైరెక్టర్ చరణ్‌. అది వింటూనే చిత్రాంగి మనసు పురివిప్పిన నెమలిలా పరవశించిపోయింది.చరణ్ ఆమె చెయ్యి పట్టుకొని తనవైపు లాక్కోగానే ఆమె తనువంతా మైకం కమ్మినట్టైంది. ప్రతిఘటించలేదు, అతని గుండెలపై గువ్వపిట్టలా ఒదిగి పోయింది. ఆమె చుబుకం పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ ‘‘నీ కళ్ళు యువకుల గుండెల్ని కాల్చే తుపాకిగుళ్ళు.’’ అన్నాడు.‘‘ఊ...హూ....’’ అంటూ కళ్ళు మూసుకుంది చిత్రాంగి.‘‘నీ పెదాలు పనసతొనలు.... తెరపై.... క్లోజప్‌లో చూపించామంటే ప్రేక్షకుల గొంతు తడారి పోవాల్సిందే’’‘‘ఇంకా....?’’ అంది చిత్రాంగి చరణ్ కౌగిలిలో కరిగిపోతూ.‘‘నీ ఎద పొంగులు చూశారంటే మతి పోవాల్సిందే. హీరోయిన్లందరూ ప్యాకప్ అయిపోవాల్సిందే’’చరణ్ పొగడ్తలు, అతని చేష్టలు ఆమెను వివశురాల్ని చేశాయి.

అయినా తనను తాను కంట్రోల్ చేసుకుని ‘‘ప్రతీ డైరెక్టర్ ప్రతీ అమ్మాయితో రొటీన్ గా చెప్పే డైలాగులే ఇవన్నీ’’ అంది బింకంగా.‘‘ఓహ్ ...! అదా నీ భయం, ఇప్పుడు చెబుతున్నాను విను, నాలుగురోజుల్లో నాయుడుగారు ప్రారంభించే ‘ప్రెట్టీ గర్ల్‌’ చిత్రంలో నువ్వే హీరోయిన్‌’’‘‘ప్రామిస్’’ చెయ్యి ముందుకు చాచింది చిత్రాంగి. ఆ చేతిని సున్నితంగా నొక్కుతూ తనవైపు లాక్కుని ముద్దుగుమ్మ ముద్దుగుమ్మాన్ని అందుకున్నాడు చరణ్.కలలలోకంలో రెక్కలగుర్రంపై స్వారీచేస్తున్న చిత్రాంగి చరణ్‌కు తన పరువాల విందు చేసింది. ఫిల్మాలయా స్టూడియో ఆవరణ హడావిడిగా ఉంది. సినీ ప్రముఖులు, బిజినెస్‌మెన్‌, మీడియావారితో కోలాహాలంగా ఉంది. నాయుడిగారి సినిమా ‘‘ప్రెట్టీ గర్ల్’’ ముహూర్తం షాట్ చిత్రీకరణ. నిర్మాత, దర్శకుడు, హీరో అభి వేదికపై ఆశీనులయ్యారు. హీరోయిన్ సీటు ఖాళీగా ఉంది.