‘డిటెక్టివ్‌ శరత్ ఊళ్లోలేడు, ఇప్పుడెలా?’ అసిస్టెంట్‌ రాముతో అంది సెక్రటరీ సుధ.‘ఏమైంది?’ అడిగాడు రాము.‘ఓ కవర్‌ వచ్చింది. పైన ‘ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ’ అని రాసి ఉంది. ‘

ఎలా?’ అంది సుధ.‘ఏదీ ఇటివ్వు, నేను చూస్తాను. డిటెక్టివ్‌ లేనప్పుడు అసిస్టెంటే డిటెక్టివ్‌’ అంటూ ఆమె చేతిలోంచి కవర్‌ లాక్కున్నాడు. విప్పిచూశాడు. లోపల మడచిన ఓ తెల్లకాగితం ఉంది. మడత విప్పాడు. దాన్లో ముడివేసిన రెండు దారం ముక్కలున్నాయి. ‘పుస్తకాల నడుమ ఆధారం ఉంది’ అని తెల్లకాగితం పైన రాసి ఉంది. రాముకు అర్థం కాలేదు.‘బాస్‌ ఎప్పుడు వస్తాడు?’‘మారువేషంలో పరిశోధనకు వెళ్ళారు. తనే ఫోన్‌ చేస్తానన్నారు’తెల్లకాగితంలో ఆ వాక్యంవైపు, ముడివేసిన దారం ముక్కలవైపు చూస్తూ కూచున్నాడు రాము.ఫఫఫ‘మళ్లీ వచ్చింది కవర్‌’ రాముకి ఇచ్చింది సుధ.కవర్‌ తెరిచాడు రాము. మళ్లీ అదే వాక్యం. అదే దారం ముడి!‘పుస్తకాల నడుమ ఆధారం ఉంది’ అన్న వాక్యం కింద, ఓడిపోతున్నావు’ అని కొత్తగా రాసి ఉంది.‘ఏమిటిది?’ స్వగతంగా పైకే అని, కాస్సేపు ఆలోచించి ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి ఫోను చేశాడు.‘దిసీజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రజిత. ఎవరు మాట్లాడేది?’ గంభీర స్వరం ధ్వనించింది.‘ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌...?’ అన్నాడు రాము.‘లాంగ్‌లీవ్‌. అతనిస్థానంలో నేను వచ్చాను. మీరెవరు?’.‘డిటెక్టివ్‌ శరతకి అసిస్టెంట్‌ని, రామూని. నాకు గమ్మత్తైన వార్నింగులొస్తున్నాయి. మీతో మాట్లాడాలి’.‘రండి’.

రెండు ఉత్తరాలను, దారం ముడుల్ని కనుబొమలు ముడిచి చూశాడు ఇంద్రజిత.‘వీటిమీద వేలిముద్రల కోసం చూశాను. లేవు. పంపినవారి అడ్రస్‌ ఏమీలేదు. చేతి రాత ఆధారంగా తెలుస్తుందేమోనని చూశాను. తెలియటం లేదు’ చెప్పాడు రాము.‘మొదటి లెటర్‌ రాగానే ఎందుకు చెప్పలేదు?’ గద్దించినట్టే అడిగాడు ఇంద్రజిత.‘ఆకతాయి పనేమో అనుకున్నా. రెండవది వచ్చేసరికి అనుమానం వచ్చింది’.ఇంద్రజిత ఏవో ఫైల్స్‌ తీసిచూశాడు. మళ్ళీ పక్కన పెట్టేశాడు. చివరికి ఓ ఫైలు తీసి చదివి మౌనంగా రామువైపు తోశాడు.మిస్సింగ్‌ పర్సన్స్‌ ఫైలు.. ‘దాన్లో ఇద్దరు అమ్మాయిల ఫొటోలపై వేలుపెట్టి, ‘నీకు మొదటి కవర్‌ అందినప్పుడు వీళ్ళల్లో ఒక అమ్మాయి మిస్సయింది. రెండోకవర్‌ వచ్చినప్పుడు రెండో అమ్మాయి మిస్సింగ్‌. మొదటి అమ్మాయి శవం నిన్న దొరికింది. మెడచుట్టూ ఈ ముడివేసిన తాడుతో నొక్కిచంపాడు. అత్యాచారం చేయలేదు’.