‘‘నన్ను రక్షించండి. నాకు తెలియకుండా ‘మృగాల’ బారినపడ్డాను. కొన్నిగంటలలో నన్ను చంపేస్తారు. ఎలాగైనా నన్ను రక్షించండి, ప్లీజ్‌...నాకు బ్రతకాలని ఉంది. ఇలా చావాలని లేదు. నన్ను రక్షించండి’’ టేప్‌ విన్నాడు డిటెక్టివ్‌ శరత్‌.

ఒకటికి రెండు మార్లు చాలా జాగ్రత్తగా విన్నాడు. తర్వాత ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ వైపు చూశాడు.‘‘ఈ టేప్‌ మీ దగ్గరకు వచ్చి ఎంత సేపైంది?’’ అడిగాడు శరత్‌.‘‘ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ వారికి గుర్తుతెలియని నెంబరునుంచి ఫోన్‌ వచ్చింది. లొకేషన్‌ ట్రేస్‌ చేసేంత సమయం లేదు. దాంతో అందరినీ అలర్ట్‌ చేశారు. దాదాపు అరగంటైంది’’ చెప్పాడు విజయ్‌.‘‘ఫోన్‌ నంబర్‌ రికార్డ్‌ కాలేదా?’’‘‘నంబర్‌ అహ్మదాబాద్‌లో రిజిష్టరై ఉంది’’‘‘టీమ్‌ని పంపించారా?’’‘‘అహ్మదాబాద్‌ అడ్రసుకు స్థానిక పోలీసులు వెళ్లారు. అతడు రైల్లో తన సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నాడట. అయితే ఇంకా వేరే సెల్‌ నంబర్లు ఉండటంవల్ల సెల్‌ఫోన్‌ పోయినాగానీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు, పోయిన ఆ నంబర్‌ను బ్లాక్‌ చెయ్యలేదు’’. తల ఊపాడు శరత్‌.‘‘డెడ్‌ ఎండ్‌ చేరుకున్నాం. అందుకే నిన్ను పిలిచాం’’ అన్నాడు విజయ్‌.

‘‘మనకు ఆ అమ్మాయి ఫోను తప్పించి మరో ఆధారం లేదుకదా’’ అన్నాడు శరత్‌.‘‘అవును’’ అన్నాడు విజయ్‌.మళ్ళీ ‘టేప్‌’ ఆన్‌ చేశాడు శరత్‌.జాగ్రత్తగా విన్నాడు మరోసారి.ఫోను వచ్చింది. ‘హలో’ అనే లోగా అమ్మాయి ఎవరో తరుముతున్నట్టు గబగబా చెప్పింది. ఫోను హఠాత్తుగా ‘కట్‌’ అయిపోయింది. మళ్ళీమళ్ళీ విన్నాడు. విజయ్‌ తనపనిమీద బయటకు వెళ్ళిపోయాడు.శరత్‌ పదే పదే అదే టేప్‌ రివైండ్‌ చేసి వినటం ప్రారంభించాడు.ఆ అమ్మాయి స్వరంలోని విహ్వలత, భయంతో పరుగుదీయడం విన్నాడు.