‘‘ఎలా చెప్పాలో తెలియటం లేదు’’డిటెక్టివ్‌ శరత్‌ ఎదురుగా కూర్చుంటూ అన్నాడతడు.అతడిని పరిశీలనగా చూశాడు శరత్‌.‘‘పర్లేదు. మీ సమస్య చెప్పండి. ఎలా పరిష్కరించవచ్చో ఆలోచిద్దాం’’ అన్నాడు శరత్‌.అతడు కాస్సేపు దిక్కులు చూశాడు. మరికాస్సేపు తల వంచుకుని కూర్చున్నాడు. చివరికి గొంతు సవరించు కున్నాడు.

‘‘మా నాన్న తప్పిపోయాడు’’‘‘మతిస్థిమితం లేదా మీ నాన్నగారికి?’’‘‘తొంభైఏళ్ళు దాటిన మనిషి, ఐనా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇప్పటికీ కారు నడుపుతారు. చెవులు, కళ్ళు, కాళ్ళు, కీళ్ళు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి’’‘మరెలా తప్పిపోయాడు’‘‘రిటైరైన మా అక్కయ్య దగ్గరే ఉంటాడు మా నాన్న.మేమందరం అక్కయ్యకు నెలనెలా డబ్బులు పంపిస్తాం. వారం క్రితంనుంచి నాన్నగారు ఫోన్‌ ఎత్తటం లేదు. అక్కయ్యను అడిగితే ఏవేవో కారణాలు చెప్పేది. చివరికి నిన్న ఇంటికి వెళ్లాను. ‘‘నాన్న ఏడి?’’ అని అడిగితే, ‘‘తెలియదు, కనబడటం లేదు’’ అని చెప్పింది.‘‘ఎప్పటినుంచి కనిపించడంలేదు?’’ అని అడిగితే, ‘‘ప్రొద్దుటినుంచీ’’ అని చెబుతోంది. అంది. పోలీసు రిపోర్టిచ్చానంది. ఆ మాట నిజమే. కానీ, ఎక్కడో ఏదో జరిగిందనిపిస్తోంది నాకు, నాన్న ఏమయ్యారో, ఎక్కున్నారో మీరే కనిపెట్టాలి’’ అన్నాడు.

‘‘మీ బంధువుల దగ్గరకు వెళ్ళారేమో?’’‘‘అందరినీ అడిగాను. ఆయన ఎవరి దగ్గరకీ వెళ్లలేదు’’‘‘మరి మీ అక్క ఏం చెబుతున్నారు?’’‘‘తను గుడికి వెళ్లిందట. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేరట. చుట్టుపక్కలవాళ్లని అడిగిందట. వాళ్లు తెలియదన్నారు. పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది, అంతే. నేను అడిగితేతప్ప నాన్నగారి గురించి చెప్పలేదు. మా కెవరికీ ఫోన్లు చేయలేదు’’‘‘మీరు ఎంతమంది సంతానం?’’‘‘ముగ్గురం. అక్కయ్యే అందరికంటే పెద్దది. మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. అక్కయ్య పెళ్ళయ్యాక బావగారు గల్ఫ్‌ వెళ్లారు. తర్వాత ఆయన ఆచూకీ తెలియదు. ఎంక్వయిరీలు చేశాం. ఏమీ తెలియలేదు. అప్పటినుంచీ అమ్మనాన్న అక్కయ్య దగ్గరే ఉంటున్నారు. అమ్మపోయింది. నాన్న ఒక్కరే మిగిలారు.