‘‘నేను పాత గోడ కూల్చి కొత్త గోడ కట్టాలనుకున్నాను. పాత గోడ కూలుస్తుంటే గోడలో ఇది దొరికింది. తొమ్మిది అంగుళాల గోడ ఇది’’ చెప్పాడు బిల్డింగ్‌ యజమాని.గోడ నడుమ ఉన్న శవాన్ని జాగ్రత్తగా తీస్తున్నారు.దానివైపు చూశాడు శరత్‌.

చూడగానే అమ్మాయి శవం అని తెలుస్తోంది. కనీసం నాలుగేళ్ళు పైగానే శవం గోడలో ఉండిపోయిందని తెలుస్తోంది. చర్మం బాగా లాగిన ‘లెదర్‌’లా ఎముకలకు అంటుకుని ఉంది. శవం కుళ్లిపోవటంవల్ల కుచించుకుపోయి కనిపిస్తోంది. అయితే శవం అంతా కుళ్లిపోయినా, వక్షోజాల భాగం మాత్రం పెద్దగా, స్పష్టంగా పాడవకుండా కనిపిస్తోంది.‘ఇంప్లాంట్స్‌’ అనుకున్నాడు శరత్‌.కొందరు వక్షోజ భాగం పెద్దగా కనబడేందుకు కృత్రిమ పద్ధతులు అనుసరిస్తారు. అలా ఈమె ‘ఇంప్లాంట్స్‌’ వేయించుకున్నట్టుంది. అవి కుళ్లిపోవు. దాంతో శరీరం అంతా కుళ్లిపోయి కుంచించుకుపోయినా అవి మాత్రం పాడవకుండా ఉన్నాయి. అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

జీవం ఉన్న మనిషి మూర్ఖత్వానికి, వ్యర్థమైన దురాశకు ప్రతీకగా అనిపిస్తున్నాయి. శవాన్ని బయటకు తీసిన తరువాత గోడ దగ్గరకు వెళ్లి పరిశీలించటం ప్రారంభించాడు శరత్‌.గోడ లోపలి భాగం వెంటనే అతడి దృష్టిని ఆకర్షించింది.జాగ్రత్తగా చూశాడు.ఇతర గోడలకూ శవం ఉన్న ప్రాంతానికీ తేడా ఉంది.కాంక్రీటు కలపటంలో తేడా వచ్చింది. ఈ భాగంలో కాంక్రీటులో నీరు ఎక్కువగా పోసినట్టున్నారు. దాంతో అక్కడ గోడ మెత్తగా ఉంది. శవం ఆకారం గోడలో ప్రింట్‌ చేసినట్టుంది.ఆ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించిన శరత్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌తో చెప్పాడు.‘‘ఒక రకంగా హంతకుడు మనకు ఈ అమ్మాయిని గుర్తించే ఆధారాలు ఇచ్చాడు’’ అన్నాడు. గోడ మీద ముద్రితమై ఉన్న శవం ఆకారాన్ని చూపిస్తూ.