అతడివైపు విస్మయంగా చూశాడు డిటెక్టివ్‌ శరత్‌.‘‘అవును సార్‌. మీరీ కేసు టేకప్‌ చేసి నిజానిజాలు తేల్చాలి’’ నిర్బయంగా చెప్పాడు నాగరాజు.అప్పుడు అతనికేసి మరింత పరిశీలనగా చూశాడు శరత్‌.‘‘ఈ కేసును నేనే పరిశోధించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు?’’ సూటిగా అడిగాడు శరత్‌.

‘నా కూతురిసంగతి నాకు తెలుసు. అది కరాటే ఫైటర్‌. ఎక్స్‌పర్ట్‌ షూటర్‌. అలాంటిదాన్ని ఎవరో తుపాకీ చూపించి బెదిరించి ఎత్తుకుపోయారంటే నేను నమ్మను’’.కూతురుపట్ల అతడికున్న విశ్వాసం అతడి మాటల్లో తొణికిసలాడటం గమనించాడు శరత్‌.కేసు వివరాలు చదివాడు.మమతకు పెద్దలు కుదిర్చిన మానవ్‌తో పెళ్ళి జరిగింది. వారంరోజులు ఇద్దరూ హనీమూన్‌కి వెళ్ళివచ్చారు. మణికొండలో ఓ ఇల్లు కొన్నారు. చుట్టూ అంతగా ఇళ్లు లేవు. ఇప్పుడిప్పుడే కడుతున్నారు. ఓ రోజురాత్రి దుండగులు ఇంట్లో ప్రవేశించి మానవ్‌ను కాల్చి మమతను ఎత్తుకుపోయారు. ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బు ఎత్తుకు పోయారు.

ఇది జరిగిన కొన్నాళ్ళకు మమత, తన తండ్రి ఇంటి ల్యాండ్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని, తనను వెతకవద్దని, వెతకాలని ప్రయత్నిస్తే తన ప్రాణానికి ముప్పు ఉంటుందనీ చెప్పింది. ఆమె నుంచి మళ్ళీ ఫోన్‌ రాలేదు. అంతర్రాష్ట్ర ముఠాయే ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసు దర్యాప్తులో భావించారు. కానీ ఆధారాలు దొరకలేదు. తుపాకీ గాయాల నుంచి మానవ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.‘అంటే మీ అమ్మాయి క్షేమంగా ఉంది కదా’’ అడిగాడు శరత్‌.‘‘వాళ్ళు అలా చెప్పించి ఉండొచ్చు, అది ఏమైపోయిందో, వాళ్ళు దాన్ని ఏం చేశారో? దాని జాడ తెలుసుకోవడం ముఖ్యం, అప్పటివరకు నాకు శాంతి లేదు’’.