‘‘ఒక్కసారి ఈ కేసు చూడు’’ డిటెక్టివ్‌ శరత్‌తో అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.ఆ ఫైలు తీసుకుని వివరాలు చదవటం ఆరంభించాడు శరత్‌. కొంత చదవగానే అతడి ముఖం గంభీరంగా మారింది. విజయ్‌వైపు ఓసారిచూసి మళ్ళీ సీరియస్‌గా చదవటం మొదలుపెట్టాడు. పూర్తిగా చదివాక ఫైలు టేబుల్‌మీదపెట్టి నిట్టూర్పు విడిచాడు. పెట్టాడు. పరుగెత్తేముందు దీర్ఘశ్వాస తీసుకునే రన్నర్‌లా దీర్ఘశ్వాస తీసుకుని, ‘‘ఆ పాప ఎవరో ఇంకా పోల్చుకోలేదా?’’అన్నాడు. విజయ్‌ తల అడ్డంగా ఊపి, ‘‘పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ చూశావా?’’ అన్నాడు. శరత్‌ తలూపి, ‘‘పాప ఒళ్ళంతా గాయాలు. దారుణంగా హింసించారు. రక్తంలో డ్రగ్‌ ఓవర్‌డోస్‌ కనిపిస్తోంది. అదీ మామూలు డ్రగ్‌ కాదు. త్వరితంగా యవ్వనాన్ని రప్పించే డ్రగ్‌. మహిళల్లో డెలివరీని సులభతరం చేయటంకోసం వాడే డ్రగ్‌ ఇది’’ అని మరోసారి రిపోర్టు చూశాడు శరత్‌.

‘‘మెదడులోని హైపోథాలమస్‌ భాగంలో ఉత్పత్తిచెందే ఈ హార్మోన్‌, పిట్యూటరీగ్లాండ్‌ ద్వారా విడుదల అవుతుంది. యువతీ యువకుల్లో రొమాంటిక్‌ ఉద్రేకసమయంలో, తీవ్రమైన ప్రేమలో ఉనప్పుడు ఈ హార్మోన్‌ అధికంగా కనిపిస్తుంది. కృత్రిమమందుల ద్వారా కూడా ఈ హార్మోన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. కానీ ఇంత చిన్నవయసున్న పాపలో ఈ హార్మోన్‌ ఉత్పత్తిచేసే డ్రగ్‌ వాడకం ఉండటం...’’ అంటూ హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చినవాడిలా విజయ్‌వైపు చూశాడు శరత్‌.‘‘అవును. నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఇదొక ఒంటరి కేసు కాదేమో అనిపిస్తోంది. ఈ పాప ఎవరో, ఆమె శవం అక్కడికి ఎవరు తెచ్చి పారేశారో కనుక్కుంటే, తీగలాగితే డొంక అంతా కదలవచ్చు. నాకు ఇది ఐసోలేటెడ్‌ (Isolated) కేసు కాదనిపిస్తోంది’’ అన్నాడు విజయ్‌.