బాల్య స్నేహితులు పెద్దయ్యాక వ్యాపార భాగస్వాములయ్యారు. వాళ్ళ స్నేహితురాలే ఆ వ్యాపారంలో మూడోభాగస్వామిగా చేరి వాళ్ళల్లో ఒకరిని పెళ్ళి చేసుకుంది. ఇక అప్పడు మొదలైంది అసలు కథ. ఆ పెళ్ళయ్యాక రెండో స్నేహితుడు పెళ్ళి చేసుకోకుండా ఆజన్మబ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన వారి రిలేషన్స్‌లో మిస్టరీగా మారిపోయింది. కేసు డిటెక్టివ్‌ శరత్‌ వరకు వెళ్ళింది. ఇంతకీ ఏమిటా మిస్టరీ?

‘‘ఒక మనిషిని సాటిమనిషి గుర్తించలేకపోవచ్చు. కానీ విశ్వాసపాత్రమైన కుక్కలు మాత్రం మనిషి ఏ వేషంలో ఉన్నా పోల్చుకుంటాయి. ఒక మనిషి మరో మనిషిగా చలామణీ అవుతున్నా ఇట్టే పట్టేస్తాయి. మీరు దీన్ని నమ్ముతారా?’’ డిటెక్టివ్‌ శరత్‌ని సూటిగా అడిగాడు మధుసూధనరావు.చిరునవ్వు నవ్వి, చెప్పండి అన్నట్టు చూశాడు శరత్‌.‘వ్యాపారంలో నా భాగస్వామి వీరభద్రుడు. చిన్నప్పటి నుంచీ మేం స్నేహితులం. పెద్దయ్యాక కలిసి వ్యాపారం చేసి సక్సెసయ్యాం. నా స్నేహితుడి ప్రవర్తనలో ఈ మధ్య మార్పు వచ్చింది. ఇంతకుముందు నా నిర్ణయాలకి ఎదురుచెప్పేవాడుకాదు, కాదనేవాడుకాదు. ఈమధ్య ప్రతిదానికీ అడ్డుపడుతున్నాడు. యాక్సిడెంట్‌ నుంచ కోలుకున్నాక అతడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

నేను పెద్దగా పట్టించుకోలేదుగానీ, తన వాటా తనకిచ్చేయమంటున్నాడు. వేరే దేశంలో స్థిరపడతాట్ట. నాకు అప్పటినుంచీ ఎందుకో వాడు వాడు కాదనిపిస్తోంది. దీనికితోడు మా ఇంటికి వచ్చినప్పుడు మా కుక్క వాడిని గుర్తుపట్టలేదు. కరిచినంత పనిచేసింది. మీరు పరిశోధించి, అసలు వాడు వాడో? కాదో? లేక నాదే భ్రమా? నిజమా? ఏదోఒకటి తేల్చేయాలి!’’ చివరి మాటలు ఆవేశంగా చెప్పాడు మధుసూధనరావు.‘‘అతనికి వివాహమయిందా?’’కాస్సేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మధుసూదనరావు. చివరికి గొంతు సవరించుకుని చెప్పాడు.

‘‘అయింది. ఆమె పేరు ప్రవీణ’’ ఆ పేరు ఉచ్ఛరించటంలోనే ఆమెమీద అతనికి కసి తెలుస్తోంది.అతడిని జాగ్రత్తగా పరిశీలిస్తూ అడిగాడు శరత్‌.‘‘మరి ఆమెకి లేని అనుమానం మీకు ఎందుకు?’’ మధుసూధనరావు మాట్లాడలేదు. లేచి నిలబడ్డాడు.‘‘నన్నడిగి లాభంలేదు, మీకు ఎంతైనా ఇస్తాను. ఈ వీరభద్రుడు నా వీరభద్రుడా? కాదా? అనేది కనుక్కోండి’’ అన్నాడు. శరత్‌ స్పందించలేదు. మధుసూదనరావు కాస్సేపు అలాగే నిలబడి వెళ్లిపోయాడు. అతడు వెళ్లగానే అసిస్టెంట్‌ రాముని పిలిచాడు శరత్‌.