సోషల్‌ మీడియాలో వచ్చిన గాలి వార్తలు నిష్కారణంగా ఇద్దరు పరిశోధనా విద్యార్థుల ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ గాలివార్తలు ప్రచారం చేసినవాడిని కనిపెట్టి శిక్షించాల్సిందే అని డిటెక్టివ్‌ శరత్‌ను దీనంగా వేడుకున్నాడు ఆ విద్యార్థి తండ్రి. దాంతో కేసు టేకప్‌ చేశాడు శరత్‌. హత్యలు జరిగిన గ్రామానికి వెళ్ళాడు శరత్‌. కానీ గ్రాస్తులు శరత్‌కారును కూడా ధ్వంసంచేసి అతడిమీద దాడిచేశారు. అప్పుడేం జరిగింది?

‘‘మనిషి మనిషిగా ఎదిగేకన్నా జంతువుగా దిగజారటానికి ప్రాధాన్యం ఇస్తాడు. నీరు పల్లానికి జారినట్టు మనిషి పశుత్వంవైపే మొగ్గు￸చూపుతున్నాడు. అందుకే మనిషిని రెచ్చగొట్టి పశువుగా మార్చడం సులభం. అదే అతడిలోని మానవత్వాన్ని తట్టిలేపి మనిషిని మనిషిగా నిలబెట్టడం మాత్రం కష్టం. కోతికి కొబ్బరికాయలాగా అపరిపక్వవాదులకు సోషల్‌ మీడియా ఒకటి దొరికింది. మనిషిలోని పశుత్వం జాగృతం కావడం దీంతో సులభమైనపోయింది...’’ ఇంకా ఏదో చెప్ప బోతున్న డిటెక్టివ్‌ శరత్‌ తలుపు దగ్గర శబ్దం కావటంతో ఆ వైపు చూశాడు.ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఓ నడి వయసు వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చాడు.‘‘ఇతడు సోమనాథం. నిన్ను కలవటానికి వచ్చాడు’’ పరిచయం చేశాడు విజయ్‌.

అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శరత్‌.సోమనాథం కళ్ళల్లో నీళ్ళు!‘‘నాకు ఒక కొడుకు. వాడి పేరు రంగనాథం. ఈ మధ్య పాపాలపల్లిలో పాపలనెత్తుకుపోయే వాడని ప్రజలు పొరపడి సామూహిక దాడిచేసి చంపిన ఇద్దరిలో ఒకడు నా కొడుకు’’ చెప్పి ఏడవటం ప్రారంభించాడాయన. పేపర్లో వార్త శరత్‌కి గుర్తొచ్చింది.నగర యువకులిద్దరు రీసెర్చ్‌ గురించి పాపాలపల్లి వెళ్ళారు. అరు దైన పక్షుల గుంపు వస్తుందని తెలిసి వాటి జీవనశైలి పరిశీలించేందుకు వెళ్ళారు.

పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్‌ గ్రామానికి వస్తోందని, సోషల్‌మీడియాలో అప్పటికే ప్రచారం కావటంతో ఆ గ్రామ ప్రజలు వారిద్దరినీ పిల్లలను ఎత్తుకుపోయే వాళ్ళని భావించి దాడిచేశారు. కొట్టి చంపి, శవాలింర పోలీసులకు అప్పగించారు. నిజం తర్వాత తెలిసింది. కేసు నమోదు చేశారు. ఎవరినీ అరెస్టు చేయలేదు.‘‘నేను మీకు ఏ రకంగా సహాయపడగలను?’’ మృతుడి తండ్రిని అడిగాడు శరత్‌.‘‘ఇలాంటి ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొట్టినవాళ్ళని పట్టుకోవాలి. శిక్షించాలి’’ కసిగా చెప్పాడతడు.